చైనా భద్రతా విభాగాల్లో రోబోలు..!!

- October 02, 2016 , by Maagulf
చైనా భద్రతా విభాగాల్లో రోబోలు..!!

కీలకమైన విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో అనుమానాస్పద వ్యక్తుల్ని గుర్తించి, అప్రమత్తం చేసే మేధస్సు ఉన్న పది రోబోలను చైనా ఆదివారం విధుల్లోకి ప్రవేశపెట్టింది. ముఖకవళికల సాంకేతిక పరిజ్ఞానం (ఫేస్‌ రికగ్నైజేషన్‌ టెక్నాలజీ) ఆధారంగా రోబోలు అనుమానితులను గుర్తిస్తాయని కస్టమ్స్‌ అధికారి ఝావో మిన్‌ తెలిపారు. దక్షిణ గాంగ్‌డాంగ్‌ రాష్ట్రంలోని విమానాశ్రయంలో ఝుహాయి, ఝాంగ్‌షాన్‌ నగరాల్లోని గాంగ్‌బెయి, హెంగ్వి్కన్‌ నౌకాశ్రయాల్లో ఇవి ఆదివారం విధులు నిర్వర్తించాయి.

గ్జియోహాయ్‌గా నామకరణం చేసిన ఈ మరమనుషులు తమంతట తాముగా వినడం, మాట్లాడటం, కొత్తకొత్త విషయాలు నేర్చుకోవడం, చూడటం, నడవడం చేయగలవని చైనా వార్తాసంస్థ జిన్హువా తెలిపింది. వీటిలో అమర్చిన ప్రత్యేకమైన డేటాబేస్‌ ఆధారంగా కాంటనీస్‌, మాండరిన్‌, ఇంగ్లిష్‌, జాపనీస్‌ తదితర 28 భాషలు, యాసల్లోనూ సమాధానం ఇవ్వగలవు. రోబోలు భద్రతా విధులు నిర్వర్తిస్తుండగా డ్రోన్లు ట్రాఫిక్‌ను పర్యవేక్షించే బాధ్యతలు తీసుకున్నాయి. జాతీయ దినోత్సవం సందర్భంగా చైనాలో శనివారం నుంచి వారంపాటు సెలవులు ప్రకటించారు. దీంతో సరదాగా గడపడానికి లక్షలకొద్దీ జనం రోడ్డు, రైలు, ఆకాశమార్గాన ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ ట్రాఫిక్‌ని పర్యవేక్షించడానికి అక్కడి అధికారులు డ్రోన్లను మోహరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com