జయ హెల్త్ బులెటిన్‌ విడుదల చేసిన డాక్టర్లు....

- October 21, 2016 , by Maagulf
జయ హెల్త్ బులెటిన్‌ విడుదల చేసిన డాక్టర్లు....

జయలలిత అభిమానులకు శుభవార్త. జయ మాట్లాడుతున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే మరికొన్ని రోజులు ఆమె ఆస్పత్రిలోనే ఉండాలని స్పష్టం చేశాయి. దీంతో జయలలిత మళ్లీ అధికార పగ్గాలను చేపడతారని పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. 
అమ్మ ఆరోగ్యం కోసం యాగాలు, హోమాలు చేస్తున్న అభిమానులకు అపోలో డాక్టర్లు శుభవార్త చెప్పారు. దాదాపు పది రోజుల తర్వాత జయ హెల్త్ బులెటిన్‌ విడుదల చేసిన డాక్టర్లు.. జయ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని తెలిపారు. ఆమె మాట్లాడుతున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు. సీఎంను క్రిటికల్ కేర్ నిపుణులు, సీనియర్ కార్డియాలజిస్టులు, సీనియర్ రెస్పిరేటరీ ఫిజీషియన్లు, ఎండోక్రినాలజిస్టు, డయాబెటాలజిస్టు.. వీళ్లంతా కంటికి రెప్పలా చూస్తున్నారు. 
 ప్రస్తుతం లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ బాలే నేతృత్వంలో జయ ఆరోగ్య పర్యవేక్షణ జరుగుతోంది. ఢిల్లీ ఎయిమ్స్  బృందం కూడా జయ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. సెప్టెంబర్ 22న జయ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అభిమానులు ఆమె క్షేమం కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలలో పూజలు చేస్తున్నారు. ఆస్పత్రి బయటే పడిగాపులు కాస్తున్నారు. ఎట్టకేలకు తమ పూజలు ఫలించాయని ఇప్పుడు అభిమానులంతా సంబరాలు చేసుకుంటున్నారు. 
జయ త్వరగా కోలుకోవాలంటూ దక్షిణ భారత చలనచిత్ర మండలి మాజీ అధ్యక్షడు సి.కల్యాణ్‌ చెన్నై ఫిల్మ్ ఛాంబర్లో మృత్యుంజయ జప హోమాన్ని ప్రారంభించారు. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ హోమంలో 30 మంది తమిళనాడులోని ప్రముఖ అర్చకులు పాల్గొంటున్నారు.  జయ ఆరోగ్యంగా ఉన్నారని తేలడంతో అభిమానులు తమ పూజలు ఫలించాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com