ప్రణయం

- October 22, 2016 , by Maagulf

1

చల్లని పున్నమిలా 
తొంగి చూస్తున్నావు 
వెచ్చని వెన్నెలవై 
అలుముకుంటున్నావు 

ఒక్కొక్క అడుగు 
మలిపేసుకుంటూ వెళ్లి
మాటలు కలుపుకున్నచోట
గుండెలు కలుసుకున్న చోట   
మళ్ళీ మళ్ళీ తడిసిపోతున్నాము

దూరమెంత నడిచినా 
నెలవంకలా తోడొస్తుంటది నీ తలపు 
కాలమెంత కరిగినా 
వలపెందుకో వీడదు మనసు 

2
వెన్నెల మాసిపోకుండా 
మల్లెలు వాడిపోకుండా 
వయసు ముడేసుకున్న మొహం ఆరిపోకుండా 

అడుగులు వీడిపోకుండా
ఆశలు వీగిపోకుండా 
నులివెచ్చని దాహంలా 
చిలిపి కోరిక ఒకటి చల్లారి పోకుండా 

అంతా వింతగా 
మళ్ళీ కొత్తగా 
ప్రణయం ఎందుకు పిలిచిందో 
ముసి ముసి నవ్వులతో 
తారలెందుకు మెరిసాయో బిడియంగా 

  
మట్టిలో ఇంకిన వాన చుక్కలా 
గాలితో కలిసి వీచిన  గంధంలా
పూవులో ఒదిగివున్న తేనె బొట్టులా 
మధువులో దాగున్న తెలియని మైకంలా 
ఒకరిలో ఇంకొకరం ఒంపుకున్నాక 

చెరో సగం మనమయినా 
ఒక్కటిగా పారుతున్న ప్రణయం కాదంటావా 

--పారువెల్ల

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com