ఎస్‌వైఎల్‌ వివాదంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజీనామా

- November 11, 2016 , by Maagulf
ఎస్‌వైఎల్‌ వివాదంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజీనామా

పంజాబ్‌లో సట్లెజ్‌ యమునా లింక్‌(ఎస్‌వైఎల్‌) వివాదంతో రాజకీయంగా దుమారం రేగుతోంది. ఎస్‌వైఎల్‌ కెనాల్‌ వినియోగంపై సుప్రీంకోర్టు హరియాణాకు అనుకూలంగా తీర్పు చెప్పడంతో పంజాబ్‌లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేందరూ రాజీనామా చేశారు. ప్రతిపక్ష నేత చంద్రజీత్‌ సింగ్‌తో సహా 42 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఈరోజు స్పీకర్‌కు రాజీనామా పత్రాలు సమర్పించారు. ఎమ్మెల్యేల వెంట సీనియర్‌ నేతలు అమరీందర్‌ సింగ్‌, అంబికా సోనీ, ప్రతాప్‌ సింగ్‌ బజ్వా తదితరులు ఉన్నారు.
ఈ విషయంపై రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ అమరీందర్‌ సింగ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌పై విమర్శలు చేశారు. ప్రజల ఆసక్తులను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆదివారం కాంగ్రెస్‌ నేతలు ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. స్పీకర్‌ ఎమ్మెల్యేల రాజీనామాలను ఇంకా అంగీకరించలేదు. అమరీందర్‌ ఇప్పటికే పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు.
పంజాబ్‌ ప్రభుత్వం 2004లో తీసుకొచ్చిన 'పంజాబ్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ అగ్రిమెంట్స్‌' చట్టం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది. హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, జమ్ముకశ్మీర్‌, దిల్లీ, చండీగఢ్‌లకు నీటి పంపకం విషయంలో పంజాబ్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదని కోర్టు ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com