అరవింద్ స్వామి డైరెక్షన్..
- December 18, 2016
నటుడిగా హీరోనా, విలన్ పాత్రా అనేది ఆలోచించను. యాక్టర్‌గా భిన్నమైన పాత్రలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తాను. ఎప్పుడూ ఒకే తరహాలో కాకుండా సాధ్యమైనంత వరకు హద్దులు చెరిపే పాత్రలు చేయడమంటే ఇష్టం' అని అంటున్నారు అరవింద్ స్వామి.
'రోజా', 'బాంబే' వంటి తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన అరవింద్ స్వామి చాలా గ్యాప్ తర్వాత 'ధృవ' చిత్రంలో నటించారు. రామ్‌చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన నేపథ్యంలో ఆదివారం అరవింద్ స్వామి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
ఎగ్జైటింగ్‌గా అనిపించింది...
'దళపతి' ద్వారా సినీ రంగంలోకి వచ్చా.
'రోజా' సినిమా చేస్తున్నప్పుడు నా వయసు 21 ఏండ్లు. స్టార్ డమ్ తెచ్చుకోవాలని ఎప్పుడూ ఆశించలేదు. సినిమాతోపాటు ఇంకా ఏదో చేయాలని వ్యాపారంలోకి అడుగుపెట్టా. 2000 తర్వాత సినిమాలకు దూరంగా ఉండి, వ్యాపారంలో బిజీ అయిపోయా. 2006లో యాక్సిడెంట్ అయ్యింది. 3, 4 ఏండ్లు నడవలేని స్థితిలో ఉన్నా. ఆ తర్వాత మూడేండ్ల క్రితం మణిరత్నం సార్ 'కాదల్' చిత్రంలో పాత్ర ఉందని చెప్పారు. పాత్రకు న్యాయం చేయగలనా?
నాపై నాకు నమ్మకం కలగలేదు. రెండు నెలలు టైమ్ అడిగి ఫిట్‌గా తయారయ్యా. అలా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చా. 'ధృవ' తమిళ 'తని ఒరువన్'కి రీమేక్. ఆ కథ చెప్పినప్పుడు స్క్రిప్టుపై డిస్కషన్ చేశాం. నాకు పాత్ర కంటే మేకింగ్ ప్రాసెస్, డిస్కషన్స్ బాగా నచ్చాయి. ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం కూడా అదే. తెలుగులో చేయాల్సి వచ్చినప్పుడు కూడా దర్శకుడు సురేందర్‌రెడ్డితో అలానే డిస్కస్ చేశాను. పైగా నేను చేసిన పాత్ర కాబట్టి చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. సినిమాకు మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగులో నాకు ఇది మంచి రీఎంట్రీ చిత్రమని భావిస్తున్నా. నేను ఫిట్‌గా, స్టయిలిష్‌గా కనిపిస్తున్నా రంటున్నారు, నిజం చెప్పాలంటే రామ్‌చరణ్ నాకంటే ఫిట్‌గా ఉన్నారు.
దాన్ని బ్రేక్ చేయాలని..
ఒక నటుడిగా భిన్నరకాల అనుభవం కావాలి. అందుకే పాజిటివ్, నెగటివ్ అనే తేడా లేకుండా అన్ని రకాల పాత్రలు చేస్తాను. బ్యారియర్స్‌ని బ్రేక్ చేసే పాత్రలు చేయడం, ప్రయోగాలు చేయడం ఇష్టం. 'ధృవ' కూడా ఒక ప్రయోగాత్మకంగా చిత్రమే. ఈ సినిమా చేయడానికి కూడా ఇదో కారణం. మంచి వ్యక్తి అనిపించుకుని బోర్ కొట్టింది. నేను కూడా నెగటివ్ రోల్స్ చేస్తానని నిరూపించుకోవాలనే చేశా.
విలన్ పాత్ర ఇందులో కొత్తగా ఉంటుంది. విలన్ కోపంగా ప్రవర్తించడు, స్మోకింగ్ చేయడు, డ్రింకింగ్ చేయకుండా చాలా కొత్తగా ఉంటాడు. పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సినిమాలో నెక్ట్స్ ఏం చేస్తాడన్నా ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగేలా ఉంటుంది. హీరో, విలన్ అనే తేడా మన ఇండియాలోనే ఉంది. హాలీవుడ్ యాక్టర్స్ అన్ని రకాల పాత్రలు చేస్తారు.
క్రియేటివ్ సైడ్ ఇష్టం..
నేను మోడల్‌గా పనిచేస్తున్నప్పుడు మణిరత్నం సార్ నన్ను చూసి 'దళపతి' సినిమాకు తీసుకున్నారు. బేసిక్‌గా నాకు ఫిల్మ్ మేకింగ్, క్రియేటివ్ సైడ్ అంటే చాలా ఇష్టం. బిజినెస్‌లో కూడా డిఫరెంట్ ఐడియాస్, కాన్సెప్ట్స్ ఇంప్లిమెంట్ చేసేవాడిని. ఖాళీ టైమ్‌లో కథలు రాస్తున్నాను. ప్రస్తుతం రెండు స్క్రిప్టులు రాశా. వచ్చే ఏడాది దర్శకత్వం వహిస్తా. నా సినిమాలో నేను నటించను. దర్శకత్వంలో కూడా వైవిధ్యంగా, పరిధులను బ్రేక్ చేసే సినిమాలు రూపొందిస్తా. నాకు తమిళం, ఇంగ్లీష్ తప్ప మిగిలిన భాషలు రావు. నేర్చుకోవడం కూడా కష్టం. అందుకే నటుడిగానైనా, దర్శకత్వమైన తమిళంలోనే చేస్తా. ఇతర భాషల్లో నటించేటప్పుడు మన దృష్టి అంతా డైలాగ్ బాగా చెప్పడంపైనే ఉంటుంది. యాక్టింగ్‌పై ఫోకస్ చేయలేం. అందుకే తమిళంలోనే చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం 'భోగన్', 'శతురంగ వెట్టై 2'తోపాటు మమ్ముట్టి నటించిన 'భాస్కర్ ది రాస్కెల్' తమిళ రీమేక్‌లో నటిస్తున్నా. ఇవి దేనికదే భిన్నమైనవి. ఇక నటుడిగా, వ్యాపారవేత్తగా ఏది కష్టమని అడిగితే.. రెండు ఛాలెంజింగ్ అనే చెబుతా. ఫ్రాంక్‌గా చెప్పాలంటే లైఫే పెద్ద ఛాలెంజింగ్.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







