తొలినమస్కారము తండ్రికి!
- September 09, 2015
తండ్రీ నిను దలంచి....నాన్నా నేను నీ తాలూకు జన్యు విశేషాన్ని. నీ కొనసాగింపుని. ఈ ప్రపంచంలో నువు చేసిన సంతకాన్ని.
***
మోయలేని బాధ్యతలు కుంగదీసినపుడూ భద్రజీవితం బీటవారినపుడూ గుండెలో అకస్మాత్తుగా బరువనిపించినపుడూ నాన్న గుర్తుకొస్తాడు. నాన్న పోరాటయోధుడు. ఎలా భరించాడు. ఎలా మోశాడు. ఎన్నెన్ని దూరాలు ప్రయాణించాడు.
***
ప్రెజర్ ఈజ్ కిల్లింగ్. కావాలంటే నిమ్సుకెళ్లు. ఐసీసియూలో గుండెచేత పట్టుకుని వరసలు వరసలు నాన్నలు నాన్నలు. డయాలసిస్సూ ఫిజియోథెరపీ. ఓ సర్వేలో తెలిసింది, గుండెపోటో పక్షవాతమో, అకాల మృత్యువు పిలుపు తొలిగా వినిపించేది మగవారికే-ఆడవాళ్ల కన్నా డిసీజ్ ప్రోన్ మగాళ్లే. మీసాలుండని కవిత్వానికిది తెలుసా. సరే సరే. కానీ హూ వేర్స్ ద పాంట్స్. హూ విన్స్ ద బ్రెడ్. హూ టేక్స్ ద పెయిన్స్ అండ్ హూ డైస్ ఆన్ ద రోడ్ విత్ హెడ్ ఇంజురీ. పత్తి కాయలా గుండె పగిలిపోతుంటే పురుగు మందులు తాగిందెవరు. అయ్యా యువార్ నాట్ ఎప్రిసియేటెడ్!
***
అందుకేనా మీరెవరూ నాన్న కోసం ఒక్క పాట కూడా పాడలేదు. నాన్న కమ్మని మాట కాదా. ఎన్నెన్నో మమతల మూట కాదా. అమ్మ దేవత. కానీ నాన్న కూడా దేవుడు. దేహము, విజ్ఞానమూ ధర్మోపదేశమూ. నీకు గుర్తుందా తన మట్టిగుండెల మీద నిన్నెలా ఆడించాడు. కొనుక్కోరా అంటూ పావలా పదీ. ఆ వేరుశనక్కాయల వాసన గుర్తుందా. నాన్న ప్రేమ గాఢారణ్యం. కమ్యూనికేట్ అవలేదా గుడ్డివాడా! బ్రెయిలీ నేర్చుకో ఇక. అన్సంగ్ హీరో నాన్న!
***
త్యాగపు పరిమళం నాన్న చెమట వాసన. మంచి భర్తనిపించుకోవాలి. మంచి తండ్రనిపించుకోవాలి.మగాడనిపించుకోవాలి. కష్టమొస్తే కన్నీళ్లు పెట్టకూడదు. గుండె నిండా దు:ఖపు నిల్వలు పోగేసుకుని ఓ తెల్లారుజామున కుప్పకూలిపోవాలి. నాన్ననెంత కరకు మనిషిని చేశారు. ఏయ్ అల్లరి చేస్తున్నావేంటి. నాన్నతో చెప్పానంటే వీపు పగలగొడతారు. నాన్నా నిన్ను చిన్నప్పుడే విలన్ పాత్రలో చూపించారు. నిన్ను నువ్వు అని పిలవకుండా చేశారు. మీరూ మీరంటే నాకు ఎంత దూరం అనిపిస్తుంది చెప్పు. గంగడైతే వాడి బిడ్డూ గాడు ఒరేయ్ నాన్నా అని పిలిస్తే మురిసిపోయాడు. నల్లగా నిగనిగా మెరిసిపోయాడు. నీకు సమయమెక్కడ కుదిరింది. నా ప్రేమనీ మమతనీ రుచి చూసేందుకు నీకు అవకాశమెక్కడ దొరికింది. ఉద్యోగమనో వర్కనో నువు బయల్దేరిన సమయానికి నేను నిద్ర లేవను. పొద్దుపోయి నువ్వొచ్చేవరకు నేను నిద్ర ఒడిలో. నా బాల్యాన్ని నీకెలా పరిచయం చేసుకోను. నీ స్పర్శ నాకెందుకు కొత్తది. ఏడ్చినపుడో, సొలసినపుడో అమ్మ ఒడికే ఎందుకు చేరాను.
***
నాకు తెలుసు నాన్నా. నువ్వేం చేసినా నీ పిల్లల కోసం. నీ భార్య కోసం. నీ తలిదండ్రుల రుణం కోసం. నీ తమ్ముడి బాగుకోసం. నీ చెల్లెలి కాపురం కోసం. చివరికి నీ మేనకోడలి కోసం. సుఖాన్నీ ఆనందాన్నీ ప్రాణాన్నీ ఫణంగా పెట్టి ఆరాటమూ పోరాటమూ. కూలి చేశాడో, వ్యాపారం చేశాడో, ఉద్యోగమో, రాజసమో, బానిసత్వమో, గుండెకోతో. చివరకు మైనం ఓలె. నిన్నెవరు అర్ధం చేసుకుంటారు.
***
పైసా పైసా కోసం ఓటీలు చేసీ క్యాంపులు తిరిగీ ఒక నాన్న తను సైకిల్ తొక్కి నీకు స్కూటర్ కొనిచ్చాడు. ఒక నాన్న తను తెగిన చెప్పులు కుట్టించుకుని నీకు కాలేజీ కెళ్లేందుకు నైక్ షూలు కొన్నాడు. తను కొత్త చొక్కా కొనుక్కోకుండా నీ ఫీజు కట్టాడు. పొదుపు చేసి పోగేసి నిన్ను సంబడీ చేశాడు. నీ ఉద్యోగం కోసం తను కాళ్లరిగేలా తిరిగాడు. తన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో నీకు ఫ్లాటు కొనిపెట్టాడు. ఇరుకింట్లో అద్దె పొదుపు చేసే కదా చిట్టీలు కట్టి నీ చెల్లెలి పెళ్లి చేశాడు. నీ కూతురిని పట్టులంగాలో చూసుకుని మురిసిపోయాడు. ఫించను డబ్బుల్లోంచి మనవడికో ఉంగరం చేయించి తన అతిశయం చాటుకున్నాడు. ఈ సూర్యుడికింద ఓ సొంత గూడు కోసం వాడిపోయాడు. ఉడిగిపోయాడు. నాన్నా పండక్కి నువ్వేం కొనుక్కోలేదే? నాకెందుకు నాన్నా నువ్వేసుకుంటే నాకదే సంబరం!- నాకప్పుడు కళ్లు చెమ్మగిల్లే వయసు లేదు.
***
కానీ నాన్నా నీ కోసం ఈ ఆకాశం కింద ఒక్క పాటంటే ఒక్క పాటా లేదేం. నీ త్యాగానికి ఒక్క గాధా లేదేం. అయ్యా యువార్ నాట్ క్రెడిటెడ్.
***
నీ చరమాంకంలో నీ బిడ్డలు నిన్ను చూస్తారో లేదో తెలియదు. నిన్నూ అమ్మనీ వాటాలేసుకు పంచుకుంటారో లేక ఓ ఓల్డేజి హోమ్‌లో విసిరేస్తారో నీకనవసరం. నీ బిడ్డలు చల్లగుండాల. నీ బిడ్డల బిడ్డలు చల్లగుండాల.
***
తాగుబోతో తిరుగుబోతో క్రూరఘోర కర్కోటకుడో రంగనాయకమ్మ బుచ్చిబాబో యద్ధనపూడి ఆజానుబాహుడో ప్రేమికుడో కాముకుడో స్వాప్నికుడో కుటుంబరావో ఎవడైతేనేం మగాడొక ఒంటరి పర్వతం. ఒంటరి చెట్టు. ఒంటరి ద్వీపం. ఒంటరి గీతం. కన్నీరు నిషిద్ధం. కేవల హృదయవిస్ఫోటం. మీరు మమ్మల్ని కొలవలేరు. కొన్ని బూతులు తిట్టడం తప్ప.
***
అమ్మా నువ్వూ నాన్నా నా మూల ధాతువులు. మీ ఇద్దరి కొనసాగింపుని. కానీ కధలూ గాధలూ కావ్యాలూ కమనీయా సామెతలూ పోలికలూ అన్నీ నీవే కదా. నాన్నకీ కొన్ని పంచనీ. నన్నిపుడు నాన్న కోసం కూడా ఒక మొక్క నాటనీ.
***
తొలి నమస్కారం తండ్రికి. నీ ఆన. ఇప్పుడిక పురుషుల కోసం. వారోపవారాలుగా. వాదోపవాదాలుగా!
--- ఎం. వాసుదేవ రావు (మాగాల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









