తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి పోటీచేయనున్న ఖుష్బూ..

- January 01, 2017 , by Maagulf
తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి పోటీచేయనున్న ఖుష్బూ..

కోలీవుడ్‌లో మరో సంగ్రామానికి తెరలేవబోతోంది. రాజకీయాలను తలపించేలా సాగిన నడిగర్‌ సంఘం ఎన్నికల ప్రభావంతో దాదాపుగా అన్ని సినీ సంఘాల్లోను కార్యవర్గంపై అసంతృప్తి సెగలు రేగాయి. ఇప్పుడు తమిళ సినిమా నిర్మాతల వంతు వచ్చింది. తమిళ సినీ నిర్మాతల మండలి నూతన కార్యవర్గ ఎంపికకు వచ్చే ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. సీనియర్‌ నిర్మాత కలైపులి ఎస్‌.థాను నేతృత్వంలోని ప్రస్తుతం కార్యవర్గంపై అసంతృప్తితో ఈ ఎన్నికల్లో పలు కూటములు బరిలోకి దిగే సూచనలు కన్పిస్తున్నాయి.

నడిగర్‌ సంఘం ఎన్నికల్లో సంచలనం సృష్టించిన నటుడు విశాల్‌ నిర్మాతల మండలి ఎన్నికల్లోను బరిలోకి దిగనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో తన కూటమి తరపున సీనియర్‌ నటి, నిర్మాత ఖుష్బూ అధ్యక్ష పదవికి పోటీచేయనున్నట్టు ప్రకటించి మరో సంచలనానికి తెరదీశారు. ఈ మేరకు విశాల్‌ ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. 2015లో బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత అధ్యక్షుడు థాను నేతృత్వంలోని కార్యవర్గం కాలపరిమితి త్వరలో ముగియనుంది. దీంతో నూతన కార్యవర్గం ఎంపికకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని నిర్ణయించారు.

ఈ ఎన్నికల్లో బరిలో దిగేందుకు విశాల్‌ కూటమి రంగం సిద్ధం చేస్తోంది. కూటమి సభ్యులతో చర్చించిన తరువాత నటి ఖుష్బూ సుందర్‌ను తమ కూటమి అధ్యక్ష పదవి అభ్యర్థిగా నిర్ణయించామని విశాల్‌ ప్రకటనలో తెలిపారు. ఇతర పదవులకు పోటీచేయనున్న అభ్యర్థ్థుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా, నిర్మాతల మండలి ఎన్నికలను విశాల్‌ వర్గం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది.

నిర్మాతల మండలి నుంచి విశాల్‌ను తాత్కాలికంగా తొలగించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com