బెంగళూరు వేదికగా ప్రవాస భారతీయ దినోత్సవం..!
- January 07, 2017
దేశం కానీ దేశం.. భిన్న సంస్కృతి.. భిన్న భాష.. విభిన్న సంప్రదాయాల నడుమ లక్షలాదిమంది భారత సంతతి వ్యక్తులు, ప్రవాస భారతీయులు వివిధ దేశాల అభివృద్ధిలో నిరంతరం శ్రమిస్తున్నారు. దాదాపు రెండున్నర కోట్లమందికి పైగా వివిధ దేశాల్లో నివసిస్తున్నారు. కొన్నేళ్లుగా మాతృదేశానికి దూరంగా ఉన్న వారందరినీ ఒకే వేదికపై తెచ్చేందుకు ఏర్పాటు చేసిన మహత్తర వేడుకే ప్రవాస భారతీయ దినోత్సవం. గాంధీ తిరిగొచ్చిన వేళకు గుర్తుగా జనవరి 7 నుంచి 9 వరకు ప్రవాసీ భారతీయ దివస్‌ను నిర్వహిస్తారు. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షపై పోరు సల్పిన గాంధీ 1915 జనవరి 9న భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా జనవరి 9న ఈ వేడుకలను నిర్వహిస్తారు. 2003లో ప్రారంభమైన ఈ ఉత్సవాలు దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది బెంగళూరును వేదికగా ఎంపిక చేశారు.
బ్రిటీషు పాలనలో వేలాదిమంది భారతీయులు ఆఫ్రికా తూర్పుతీరం, వెస్టిండీస్, ఫిజీ, మారిషస్.. తదితర ప్రాంతాలకు కార్మికులుగా వలస వెళ్లారు. అనంతరం ఆ దేశ సంస్కృతిలో కీలకంగా మారారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లోనే కాక రాజకీయంగానూ సత్తా చాటారు. మారిషస్, ఫిజీ వంటి దేశాల్లో భారత సంతతికి చెందినవారు అత్యున్నత పదవులను అందుకోవడం విశేషం. 1970 తర్వాత గల్ఫ్‌దేశాల్లో చమురు నిల్వలు బయటపడటంతో మధ్యప్రాచ్యానికి లక్షలాదిమంది భారతీయులు ఉపాధి నిమిత్తం వెళ్లారు. నిరంతర శ్రమతో ఆ దేశాల పురోభివృద్ధిలో పాలుపంచుకున్నారు. ఖతర్‌లో భారతీయుల సంఖ్య ఆ దేశ జనాభాలో సగభాగం ఉందంటే దేశం నుంచి వలసలు ఏపాటివో అర్థమవుతుంది.
అగ్రరాజ్యమైన అమెరికాలోనూ పలు రంగాల్లో భారత సంతతికి చెందినవారు సత్తా చాటుతున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆ దేశంలోని పలు చట్టసభల్లో ఐదుగురు ప్రవాసులు ఎన్నిక కావడం గమనార్హం. ప్రవాస భారతీయులకు చెందిన అనేక సంఘాల్లో తెలుగువారికి చెందిన తానా, ఆటా, బాటా, టాంటెక్స్.. వంటి సంస్థలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ భారతీయ మూలాలను గుర్తు చేస్తున్నాయి. సొంతగడ్డపై పలు సంక్షేమ పథకాల్లో భాగస్వాములుగా నిలుస్తున్నాయి.
విదేశాల్లో స్థిరపడిన చాలామంది భారతీయులు తమ సొంతగడ్డను విస్మరించకుండా పలు సంక్షేమ పథకాల్లో పాల్గొంటున్నారు. సొంత వూరిలో పాఠశాలలు, ఆసపత్రులు, ఆలయ నిర్మాణాలు చేపడుతూ మరి కొందరికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు. భారత ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రవాసులు అనేక సంక్షేమ పథకాలకు చేయూతనివ్వడం ద్వారా వేల మైళ్ల దూరంలో ఉన్నా సేవా భావాన్ని వీడలేదన్న సందేశాన్ని పంపుతున్నారు.
తాజా వార్తలు
- టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల..
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్‌ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!







