వివేకానందుడి 154 వ జయంతి..

- January 12, 2017 , by Maagulf
వివేకానందుడి 154 వ జయంతి..

వేదాంత తత్వశాస్త్రాలతో చెరగని ముద్ర వేసిన అత్యంత ప్రభావ శీలి. భారతప్రజానీకానికి కర్మయోగాన్ని, పాశ్చాత్య ప్రపంచానికి జ్ఞానయోగాన్ని అందించిన మహామనిషి. భరతజాతి గొప్పతనాన్ని అంతర్జాతీయ వేదిక పై చాటి చెప్పిన ఐకాన్‌. యువతకు మార్గదర్శిగా నిలుస్తున్న స్వామి వివేకానంద జయంతి నేడు... 
అఖండ భారత ఆధ్యాత్మిక పరంపరకు ప్రతినిధిగా అవతరించిన మహనీయుడు స్వామి వివేకానంద. 1863 జనవరి 12న కలకత్తాలో భువనేశ్వరీ దేవి, విశ్వనాథ్‌దత్ దంపతులకు జన్మించాడు. నరేంద్రనాథ్ దత్త అని పెట్టినా... ఆయన్ను నరేన్, నరేంద్రుడు అని పిలిచేవారు. వివేకానంద చిన్నతనం నుంచే ధ్యానం చేసేవాడు. భగవంతుడి దర్శనం కోసం పరితపించేవాడు. బ్రహ్మసమాజంలో చేరినప్పటికీ వివేకానందుడికి కావలసిన మార్గం కన్పించలేదు. దీంతో రామకృష్ణ పరమహంసను కలిశాడు. సన్యాసాన్ని స్వీకరించి ఆయనకు అంత్యంత ప్రియశిష్యుడయ్యాడు. పరమహంస ఆదేశం మేరకు అఖండ భారతావనిలో పర్యటించిన వివేకానందుడు నిమ్నజాతుల దీనస్ధితిని చూసి కలత చెందాడు. సేవాభావంతో సాటి మానవుడి బాధలను తొలగించాలని ప్రబోధించాడు. ప్రతిఒక్కరూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకొని, స్వశక్తిపై ఆధారపడినప్పుడే దేశం ప్రగతి సాధిస్తుందని చెప్పిన వివేకానందుడు తన ప్రసంగాలతో సమాజాన్ని జాగృతం చేసిన యోగి. గాంధీజీకి దారి చూపిన దివ్యజ్యోతి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పామరులకు అర్థమయ్యే భాషలో ఘంటానాదంలా పలికిన దీనజన బాంధవుడు. చికాగో సర్వమత సమ్మేళనంలో భారతీయ ఆధ్యాత్మిక వాణిని వినిపించిన మార్గదర్శకుడు. మనిషిని మనీషిగా ఉన్నతస్థితికి తీసుకెళ్లే భావమే మతమనీ, అదే సర్వతోముఖ వికాసానికి దోహదం చేస్తుందని చెప్పిన ఘనత వివేకానందుడిదే. ముక్కోటి దేవతల సమ్మిళిత రూపమే భారతమాత అని ప్రకటించారు. అందుకే నేటికి వివేకానందుడి ఆశయాలు, స్ఫూర్తి ప్రతీ భారతీయుడి హృదయాంతరాలను తట్టిలేపే మహత్తర శక్తిగా నిలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com