ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం
- January 15, 2017
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ కోహ్లీ, కేదార్ జాదవ్ దూకుడుగా ఆడి శతకాలు నమోదు చేయడంతో ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 351 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాన్ని చేరుకుంది. 48.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకొన్న అనంతరం కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి వన్డేలోనే టీమిండియాకు కోహ్లీ చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
భారీ విజయ లక్ష్యంలో బరిలోకి దిగిన భారత్ ఆదిలో వెను వెంటనే వికెట్లు కోల్పోతూ తడబడింది. ఓపెనర్లు ధావన్(1), కేఎల్ రాహుల్(8) తక్కువ స్కోరుకే పెవిలియన్ దారి పట్టారు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లీ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించినప్పటికీ మరో ఎండ్ నుంచి పెద్దగా సహకారం లభించలేదు. మూడేళ్ల విరామం అనంతరం వన్డే జట్టులోకి వచ్చిన యువరాజ్‌సింగ్(15) పేలవ ప్రదర్శనతో వెనుదిరుగగా.. మాజీ కెప్టెన్ ధోని(6) తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కేదార్ జాదవ్‌తో కలిసి కోహ్లీ దూకుడును పెంచాడు. వీరిద్దరూ భారీ షాట్లను ఆడుతూ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇద్దరూ అర్ధ శతకాలను నమోదు చేసి అంతే వేగంగా శతకాలను పూర్తి చేసుకున్నారు. ఈ జోడీని 37వ ఓవర్లో స్టోక్స్ విడదీశాడు. స్టోక్స్ బౌలింగ్‌లో విల్లేకు క్యాచ్ ఇచ్చి కోహ్లీ వెనుదిరిగాడు. కోహ్లీ మొత్తం 105 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 122 పరుగులు చేశాడు. అనంతరం జాదవ్(120) కూడా పెవిలియన్ దారిపట్టాడు. అప్పటికీ భారత్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 291 పరుగులు. అనంతరం పాండ్యా(40 నాటౌట్), జడేజా(13), అశ్విన్(15 నాటౌట్) రాణించి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జాసన్ రాయ్, రూట్, స్టోక్స్ అర్ధ శతకాలతో రాణించడంతో 351 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. వన్డేల్లో భారత్‌లో ఇంగ్లాండ్ నమోదు చేసిన అత్యధిక స్కోరు ఇదే. ఓపెనర్ హేల్స్(9) 7వ ఓవర్లో 39 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ జాసన్ రాయ్ దూకుడుగా ఆడుతూ జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. 73 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. రాయ్ రెండో వికెట్‌కు రూట్‌తో కలిసి 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రూట్.. మోర్గాన్(28), బట్లర్(31)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. 78 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బుమ్రా బౌలింగ్‌లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం వచ్చిన స్టోక్స్ కూడా ధాటిగా ఆడి 33 బంతుల్లో అత్యంత వేగవంతమైన అర్ధ శతకం(62) నమోదు చేశాడు. భారత్‌పై ఓ ఇంగ్లిష్ బ్యాట్స్‌మన్ సాధించిన అత్యంత వేగవంతమైన అర్ధ శతకం ఇదే. అనంతరం జట్టు స్కోరు 317 వద్ద బుమ్రా బౌలింగ్‌లో స్టోక్స్ ఔటయ్యాడు. మొయిన్ అలీ 28, వోక్స్ 9, విల్లే 10 పరుగులు చేశారు.
ఇక భారత బౌలర్లలో పాండ్యా 2, బుమ్రా 2 వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్, జడేజా తలో వికెట్ తీశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







