భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిన మహోన్నతమైన రోజు జనవరి 26 ...
- January 25, 2017
గణతంత్ర దినోత్సవం ఎలా అయ్యింది? ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి ఆ రోజు పండుగ చేసుకుంటాం. మరి ఈ రోజు జెండా ఎందుకు ఎగరవేస్తున్నాం..?
రాజ్యాంగం... మనదేశానికి వెన్నెముక. మంచి చెడులను తెలిపి, దేశాన్ని సరైన దారిలో నడిపించే దిక్సూచి అదే మన న్యాయవ్యవస్థకు ఊపిరి. అలాంటి రాజ్యాంగం మనదేశంలో అమల్లోకి వచ్చిన రోజు జనవరి 26. భారత గడ్డపై పుట్టిన ప్రతి వ్యక్తికి స్వేచ్ఛని, మాట్లాడే హక్కుని, అందరితో సమానంగా జీవించే హక్కుని, భావ వ్యక్తీకరణ హక్కుని, నచ్చిన మతాన్ని అనుసరించే హక్కుని, చదువుకునే అర్హతని కల్పించింది రాజ్యాంగమే. వీటిలో ఏ ఒక్కటి అందుకోవడంలోనైనా అన్యాయం జరిగితే... న్యాయస్థానాన్ని ధైర్యంగా ఆశ్రయించవచ్చనే హక్కుని అదే రాజ్యాంగం కల్పించింది. మన జీవితాలని స్వేఛ్చా పతంగాలుగా మార్చిన రాజ్యాంగం తన నడకను ప్రారంభించిన రోజును మనమెందుకు పట్టించుకోకూడదు... అందుకే 68 ఏళ్లుగా ఈ రోజును పండుగలాగే చేసుకుంటున్నాం. జెండా ఎగురవేస్తున్నాం, స్వీట్లు పంచుతున్నాం, సాంస్కృతిక కార్యక్రమాలెన్నో ఏర్పాటుచేసుకుంటున్నాం... స్నేహితులతో ఆనందంగా గడుపుతున్నాం... సోషల్ మీడియాలో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియచేసుకొంటున్నాం.
చరిత్రపుటలను ఒకసారి తిరగేస్తే ....1947, ఆగస్టు 15 న మనదేశం స్వాతంత్ర్య దేశంగా అవతరించింది. కేవలం స్వతంత్రమే లభించింది, కానీ సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం మాత్రం కాదు. దేశాన్ని నడిపించడానికి నాయకులు ఉన్నారు తప్ప, సరైన విధివిధానాలు లేవు. బ్రిటిష్ వారి చట్టాలే అమల్లో ఉన్నాయి. మనల్ని మనం చక్కగా పాలించుకునే విధంగా, ప్రభుత్వ నిర్మాణం పరిపుష్టంగా ఉండేలా.... ఉత్తమ దిశానిర్దేశం చేసే రాజ్యాంగం మనకూ ఉండాలి అని భావించారు ఆనాటి గొప్ప నేతలు. డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. 1947, ఆగస్టు 29న రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఉత్తమ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ఎంతో మంది మేధావుల అనేక దేశాల రాజ్యాంగాల్ని ఆపోసన పట్టారు. వాటన్నింటి ఆధారంగా, కొన్ని దేశాల నుంచి మంచి సూత్రాలని దత్తత తీసుకుని... మన రాజ్యాంగ రచన పూర్తి చేశారు. దీనికి రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. 1949, నవంబర్ 26 రాజ్యాంగపరిషత్ డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ సారథ్యంలో పూర్తయిన రాజ్యాంగానికి ఆమోద ముద్ర వేసింది. అతి పెద్ద లిఖిత రాజ్యంగముగా చరిత్రకెక్కింది. దీనిని 1950, జనవరి 26న అమల్లోకి తెచ్చారు. ఆనాటి నుంచి మనదేశం స్వతంత్రదేశమే కాదు, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. భారత ప్రజల అపార త్యాగాల ఫలితంగా దేశానికి రాజకీయ స్వాతంత్య్రం సిద్ధించింది. ఫలితంగా అందివచ్చినదే సర్వోత్కృష్టమైన భారత రాజ్యాంగం. భారత దేశాన్ని సర్వ సత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యింగాన్ని నిర్మించుకునేందుకు పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, సమానత్వాన్ని చేకూర్చడానికి జాతీయ సమైక్యతనూ, సమగ్రతనూ సంరక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి, 1949 నవంబరు 26వ తేదీన రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించి, శాసనంగా రూపొందించుకున్నప్పటికీ, 1950 జనవరి 26 నుంచి 395 అధికరణలు, 22 భాగాలు, 9 షెడ్యూళ్ళతో అమల్లోకి వచ్చింది. ఆ రోజున ప్రపంచానికి భారత దేశం నూతన గణతంత్ర రాజ్యం(రిపబ్లిక్)గా ప్రకటించబడింది. ప్రస్తుతం 447 ఆర్టికల్స్, 26 అధ్యాయాలు, 12 షెడ్యూళ్ళు, 121 సవరణలతో కూడినది ఈ భారత దేశ బృహత్ రాజ్యాంగం..స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు పట్టిన కాలం: 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు.రాజ్యాంగ సభ 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాయటానికే పట్టింది.రాజ్యాంగ రాతప్రతిని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్కరించింది.భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు. 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేసారు.1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి, భారత్ తాత్కాలిక పార్లమెంటు గా మారింది.1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తరువాత కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటు ఉనికిలో ఉంది.మన రాజ్యాంగం యొక్క అసలు ప్రతులు రెండు మాత్రమే ఉన్నాయి, హిందీలో ఒక ప్రతి, ఇంగ్లీష్ లో ఒక ప్రతి ఉన్నాయి, ఆ ప్రతులు పాడవకుండా ఉండేందుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్‌కేసులలో పార్లమెంట్ భవనంలో భద్రపరిచారు, వాటి నకలును ఫోటో కాపీలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి.మన రాజ్యాంగం జనవరి 26వ తేది ఉదయం 10:18 నిమిషాలకు అమలులోకి వచ్చింది.1930వ సంవత్సరంలో జనవరి 26వ తేదిని స్వాతంత్ర్య దినోత్సవం లేదా పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా జరుపుకొనేవారు, అంటే ఆరోజున భారతదేశం పూర్తి స్వేఛ్చ కోసం పోరాడడానికి నిర్ణయించుకున్న రోజు.
జనవరి 26నే ఎందుకు అమల్లోకి తెచ్చారు? 1929లో జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన చారిత్రాత్మక లాహోర్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో 1930 జనవరి 26 వ తేదీన సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని దేశం మొత్తం పాటించాలని నిర్ణయించింది. ఆ మేరకు అన్ని రాజకీయ పక్షాలు, ఉద్యమకారులు ఆ రోజును సగర్వంగా పూర్ణస్వరాజ్ గా జరుపుకోవడానికి ఏకతాటిపైకి వచ్చారు. అందుకే ఆ రోజును పురస్కరించుకుని రాజ్యాంగాన్ని జనవరి 26 వ తేదీనే అమల్లోకి తెచ్చారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









