బడ్జెట్‌ అంటే .... ?

- January 31, 2017 , by Maagulf
బడ్జెట్‌ అంటే .... ?

 నేడు  ( ఫిబ్రవరి 1న ) బడ్జెట్‌ ను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. 130 కోట్ల ప్రజలువున్న అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ నాయకులు వాళ్ళ తలరాతేమో కానీ మనది మన దేశ తలరాత రాసేది వారే !!
బడ్జెట్‌ అనే పదం ''బౌజెట్‌'' అనే ఫ్రెంచి పదం నుండి పుట్టింది. (బౌజెట్‌ అంటే ముఖ్యమైన పత్రాలు, డబ్బు పెట్ట్టుకునే తోలు సంచీ) ప్రభుత్వం తనకు వచ్చే ఆదాయాన్ని తిరిగి వివిధ పద్దుల క్రింద ఖర్చు చేయడానికి చేసే కేటాయింపులే బడ్జెట్‌. భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 112 బడ్జెట్‌ని ''వార్షిక ఆర్దిక నివేదిక'' గా పేర్కొంది. నిజానికి బడ్జెట్‌ అంటే చిట్టా పద్దుల పట్టిక కాదు. జీవం లేని అంకెలు, సారం లేని గణాంకాలు కాదు. ప్రజల ఆశలను, ఆకాంక్షలను నిజం చేసే నిర్మాణాత్మక ప్రణాళిక. ప్రజాధనాన్ని ప్రజల నిజమైన అభివృద్ది కోసం వెచ్చించే గంభీరమైన బాధ్యతయుతమైన ప్రక్రియ. కాని నేడు దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్‌లు అంకెల గారడిగా మిగిలిపోతున్నాయి.
బడ్జెట్‌ని ఎలా పరిశీలించాలి :
1. బడ్జెట్‌ అంచనాలు (రాబోయే ఆర్ధిక సంవత్సరానికి సంబందించిన ఆదాయ, వ్యయాల గురించి అంచనా) 2. సవరించిన అంచనాలు (ప్రస్తుతం ఆర్ధిక సంవత్సరానికి సంబందించిన ఆదాయ వ్యయాలు. కాని రెండు నెలల సమాచారం అంది వుండదు కాబట్టి జనవరి వరకు వాస్తవ లెక్కలు, ఫిబ్రవరి, మార్చి నెలల ఆదాయాలు కలుపుకొని సవరించిన అంచనాలు తయారు చేస్తారు.) 3. వాస్తవ అంచనాలు గత ఆర్ధిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం, చేసిన ఖర్చుల వివరాలు 
--- బడ్జెట్‌ని పరిశీలించేటపుడు బడ్జెట్‌ అంచనాలను సవరించిన అంచనాలతో గాని, వాస్తవ అంచనాలతో మాత్రమే పోల్చకూడదు. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా సాదారణంగా బడ్జెట్‌ కేటాయింపుల్లో పూర్తిగా ఖర్చు పెట్టదు. అందువలన బడ్జెట్‌ అంచనాలను క్రిందటి సంవత్సరం (2014-15 బడ్జెట్‌) అంచనాలతో కూడా పోల్చాలి. పాలకవర్గాలు సవరించిన అంచనాలతో, వాస్తవ అంచనాలతో పోలుస్తూ అంకెల గారడీ సృష్టిస్తారు. ఉదా|| సంక్షేమానికి 100 కోట్లు ఈ బడ్జెట్‌ (2015-16)లో కేటాయిస్తే సవరించిన అంచనాల్లో (2014-15) 80 కోట్లు అనుకుంటే (2013-14) వాస్తవ అంచనాలు 70 కోట్లయితే సంక్షేమానికి 20 నుండి 30 కోట్లు అదనంగా కేటాయించినట్లు చూపిస్తారు. కాని నిజంగా 2014-15 బడ్జెట్‌ అంచనాల్లో కూడా 100 కోట్లే కేటాయించి వుంటే ఈ సంవత్సరం సంక్షేమానికి ఎక్కువేమి కేటాయించనట్లుగా, ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటే ఇంకా తక్కువే కేటాయించిట్లుగా పరిశీలించాలి. 2. పెరిగిన అవసరాలకు, ప్రాదాన్యతలకు అనుగుణంగా కేటాయింపులుండాలి. కేవలం గత సంవత్సరం కేటాయింపులకంటే ఈ సంవత్సరం ఎక్కువగా వుంటే బడ్జెట్‌లో పెరుగుదలగా భావించకూడదు. 3. ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. కేటాయింపుల్లో, రాబడిలో అది కనపడాలి. ప్రభుత్వం '' ఎంత ఖర్చు పెడుతుందనే దాని కంటే ఎలా ఖర్చు పెడుతున్నదో ముఖ్యం.'' ప్రభుత్వం యొక్క నిజస్వరూపం అర్దం కావాలంటే శాఖల వారిగా పద్దులు పరిశీలించాలి. ఉదా|| 2015-16 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం గొప్పగా చెప్పిన డబుల్‌బెడ్‌రూమ్‌ స్కీమ్‌కు కేవలం రూ. 830 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ కేటాయింపుతో గ్రామానికొ ఇల్లు మాత్రమే వస్తుంది. హైద్రాబాద్‌-వరంగల్‌ ఇండిస్టీయల్‌ కారిడార్‌ పేర్కొన్నారు. కాని ఎలాంటి కేటాయింపులులేవు.
ప్రభుత్వానికి ఆదాయం ఎలా సమకూరుతుంది ? : సేల్‌ టాక్స్‌, వ్యాట్‌పన్ను, ఎక్సైజ్‌ పన్ను, కస్టమ్‌ పన్ను, సర్వీసు టాక్స్‌ లాంటి మొదలగు వాటి నుండి ప్రభుత్వానికి వచ్చే ఆదాయమంతా ప్రజలు చెమటోడ్చి సంపాదించిన రూపాయి నుండే వస్తుంది...
1. ప్రజలు తమ శ్రమశక్తి ద్వారా ఉత్పత్తి చేసిన సంపదలో వారు బతకడానికి అవసరమైన వేతనాలు లేక కూలి చెల్లించి మిగిలిన సంపదను పెట్టుబడిదారులు, భూస్వాములు లాభం, వడ్డీ, అద్దె, కౌలు పేరిట స్వాదీనం చేసుకుంటారు. ప్రభుత్వానికి పెట్టుబడిదారులు, భూస్వాములు పన్నులు, ఛార్జీల రూపంలో చెల్లించే దంతా ఈ మిగులు సంపద నుండే! 2. ధరలు పెంచడం, సబ్సిడీలు తగ్గించడం, ప్రజాపంపిణి వ్యవస్థను నీరు గార్చడం, కనీస వేతనాలు సైతం ఇవ్వకపోవడం, హౌదాలు మార్చడం ఉదా|| కాంట్రాక్టు ఉద్యోగులు. వివిధ రకాల పన్నులు పెంచడం, కొత్త పన్నులను వేయడం లాంటి చర్యలతో ప్రజలు తాము బ్రతకాడానికి పొందిన వేతనాలు లేక కూల్లను సైతం పీల్చి పిప్పి చేసి ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకుంటుంది. క్రిసల్‌ అనే సంస్థ అద్యయనం ప్రకారం 2009-14 ఐదేళ్ల కాలంలో ధరలు పెరుగుదల వలన ప్రజలు 6 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయారు. బడ్జెట్లు ధనికులకు వరంగా , సామాన్యులకు శాపంగా మారుతున్నాయి తాత్వికుడైన కార్ల్‌మార్క్స్‌ బడ్జెట్‌ను ''ఆదాయ పున:పంపక'' సాధనమని నిర్వచించాడు. బడ్జెట్‌ అంటే అన్ని వర్గాల సంక్షేమం కోసం ఖర్చు చేసే ప్రణాళికగా వుంటుందని సామాన్యులు భావిస్తారు. కాని పెట్టుబడిదారి సమాజంలో అది సాద్యం కాదు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ.. అన్నట్లుగా గత యుపిఎ ప్రభుత్వం 2007-14 వరకు ఈ ఏడేండ్ల కాలంలో పెట్టుడిదారులకు రూ. 34.5 లక్షల కోట్లు పన్ను రాయితీలు ఇచ్చింది. యుపిఎ కు బిన్నంగా పాలిస్తామన్నా బిజెపి 2014-15 బడ్జెట్‌లో రూ.5,89,285.2 లక్షల కోట్లు పన్ను రాయితీలిచ్చి, దొందు దొందేనని నిరూపించుకున్నాయి. 2014-15లో మన ద్రవ్య లోటు రూ. 5,55,649 కోట్లు, బిజెపి ప్రభుత్వం పెట్టుబడిదారులకు పన్ను రాయితీలు ఇవ్వకపోతే రూ.33,636.2 కోట్ల మిగులు బడ్జెట్‌ వుండేది. ప్రజలకిచ్చే సబ్సిడీల వలన ఆదాయం దుబార అవుతుందనే దుష్ప్రచారం చేస్తూ ద్రవ్యలోటు తగ్గించుకోవడానికి ప్రజలకిచ్చే సబ్సిడీలు, సంక్షేమ పథకాలకు కోత పెట్టింది. పెట్టుబడిదారులకిచ్చే పన్ను రాయితీల వలన దేశాభివృద్ది జరుగుతుందని ప్రచారం చేస్తూ లక్షల కోట్లు వరాలుగా కురిపించారు. వాస్తవంగా పెట్టుబడిదారులు ఉత్పత్తి రంగంలో పెట్టుబడి పెట్టకుండా, రియల్‌ఎస్టేట్‌, బంగారంపై పెట్టడం వలన ధరలు పెరిగి ప్రజలు ఆదాయాన్ని కోల్పోయారు. బిజెపి ప్రభుత్వం 2014-15 బడ్జెట్‌లో 1.06 లక్షల కోట్ల రూపాయల సంపన్నుల ఋణాలను ప్రభుత్వ బ్యాంకులు మాఫీ చేసేటట్లు చూసింది. మధ్యతరగతి ఉద్యోగులకు ఉపశమనం కలిగించే ఆదాయపు పన్ను స్లాబులు పెంచలేదు కాని పెద్ద పెద్ద కార్పోరేట్లు కట్టే కార్పోరేట్‌ పన్నుని 30% నుండి 25%నికి తగ్గించింది. పైగా ధనికులపై వేసే సంపద పన్ను (వెల్త్‌ టాక్స్‌) రద్దు చేసింది. దేశంలోని 1% ధనికుల చేతిలో 49% సంపద కేంద్రీకృతమై వుంది. సంపద పన్ను రద్దు ద్వారా వారికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. బిజెపి అధికారంలోకి వచ్చి ప్రవేశ పెట్టిన రెండు బడ్జెట్‌లలో ప్రజల సొమ్ముతో నిర్మించబడిన లాభాలు వచ్చే ప్రభుత్వ సంస్థల వాటాలు అమ్మి వాటిని కార్పోరేట్లకు కట్టబెట్టి లక్ష కోట్లకు పైగా ఆదాయాన్ని ప్రభుత్వం సమకూర్చుకోవాలని సంకల్పించంది. ఇలా ఈ ప్రభుత్వం ధనికుల బడ్జెట్‌లను ప్రవేశపెట్టింది.
ఈ విధంగా ప్రజలను దోచుకోవడం ద్వారా తన దగ్గర పోగుపడ్డ ఆదాయాన్ని పెట్టుబడిదారులకు, భూస్వాములకు అప్పజెప్పడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌ ఒక సాధనం. ప్రజల శ్రమశక్తి ద్వారా ఉత్పత్తి అయిన మిగులు సంపదను కొట్టివేయడమే కాక తమ గరిష్ట లాభాల కోసం పెట్టుబడిదారులు ప్రాధమిక మూలా ధన సంచయన పద్దతి (ప్రిమిటివ్‌ కాపిటల్‌ అక్యుమలేషన్‌)తో సహజ వనరులను, ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టడం, లూటీ చేయడం ద్వారా దోపిడిన తీవ్రతరం చేస్తారు. అందుకు మంచి సాధనంగా బడ్జెట్‌ ఉపయోగపడుతుంది. ఉదా|| బిజెపి ప్రభుత్వం 2014-15 సం|లో ప్రవేశపెట్టిన పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం ప్రాజెక్టు పేరిట భూములు, గనులు, నీళ్లు, విధ్యుత్‌, ఏయిర్‌లైన్స్‌ మొదలైన ప్రభుత్వ వనరులను కార్పోరేట్‌ శక్తులకు కట్టబెట్టాలని నిర్ణయించింది. పేదలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే సబ్సిడీలను 2015-16 బడ్జెట్‌లో 16,847 కోట్లకు తగ్గించింది. సర్వీసు టాక్స్‌ పరిధి పెంచడం, టాక్స్‌ రేటు పెంచడం వలన (12% నుండి 14%) 41,662 కోట్ల రూపాయలు పరోక్ష పన్నుల భారం ప్రజలపై పడింది. సర్వీసు టాక్స్‌ లేనపుడు ఒక గుమస్తా రూ.10 వేల తన జీతంతో జీవితవసర సరుకులు కొంటే, అంతే విలువైన సరుకులు వచ్చేవి. నేడు ఆ డబ్బుతో కేవలం రూ.8,400 సరకులే వస్తున్నాయి. ఎందుకంటే రూ.1600లు సర్వీసు టాక్స్‌ రూపంలో ప్రభుత్వానికి చేరుతున్నాయి. సుమారు రూ. 18 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన కేంద్ర భారీ బడ్జెట్‌లో 32 పేదల సంక్షేమ పథకాలను రద్దు చేయడమో, కోత పెట్టడమో చేసారు. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల నిష్పత్తి ప్రభుత్వ ఆదాయంలో 70:30 నిష్పత్తిగా వుండాలి. కాని ప్రత్యక్ష పన్నులు (ధనికులు చెల్లించేవి) 10%లోపు కుంచుకపోయి పరోక్ష పన్నుల భారం 90%నికి పెరిగింది. ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యక్ష పన్నులు రూ.8,315 కోట్లు తగ్గించారు. పరోక్ష పన్నులు (పేదలు చెల్లించేవి) రూ. 23,383 కోట్లు పెంచారు. అందుకే 1902లో ''స్టేట్‌ బడ్జెట్‌ గురించి'' అనే తన వ్యాసంలో లెనిన్‌ బడ్జెట్‌ని ''అధికారిక విత్త అంకెల గారడికి '' (అఫిషియల్‌ ఫైనాన్సియల్‌ జగ్లింగ్‌) పెట్టుబడిదారి ప్రభుత్వాలు పాల్పడతాయని పేర్కొన్నారు. నేటి పాలకుల బడ్జెట్‌లను గమనిస్తే ఇది నూటికి నూరుపాల్లు నిజం.
బడ్జెట్‌లో ప్రభుత్వాలు అనుసరించిన విధానాల ఫలితంగా సమాజంలో ఆదాయ అసమానతలు తీవ్రంగా పెరిగాయి. ప్రపంచంలో ప్రతి ముగ్గురు పేదవాళ్లలో ఒకరు ఇండియాలో వున్నారని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. ఆకలి సూచికలో ఇతోఫియా దేశం కంటే అద్వాన్నంగా వున్నాము. 52% మందికి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయానికి కేటాయింపులు తగ్గడం వలన రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. ఉత్పత్తి అయిన సంపదలో వేతనాల వాట 1950లో 30% వుండగా 2014 సం|| నాటికి 14%కి పడిపోయింది. 43 కోట్ల మంది కార్మికులలలో 39 కోట్ల మంది కార్మికులు ఎలాంటి హక్కులు లేకుండా దుర్బర జీవితం గడుపుతున్నారు. 1991 ముందు శతకోటీశ్వరులు లేని భారతదేశంలో ఇపుడు 76 మంది వున్నారు. అక్షరాస్యతలో వెనుకబాటు, ప్రతి 32 నిమిషాలకోసారి ఒక మహిళపై అత్యాచారం జరుగుతుంది. అంతిమంగా కారల్‌మార్క్స్‌ పెట్టుబడిదారి అభివృద్ది గురించి చెప్పేటపుడు ''ఒక దృవం వద్ద సంపద పోగు పడమంటే అదే సమయంలో మరో దృవం వద్ద దీనస్థితి, కఠిన శ్రమ వలన తీవ్ర వేదన, అజ్ఞానం, బానిసత్వం, పాశావికత, నైతిక విలువల పతనాలు పోగుపడడమే అవుతుంది '' (పెట్టుబడి గ్రంధం మొదటి సంపుట 25వ అధ్యయనం) ఈ వ్యాఖ్యనం నేడు భారత దేశ దుస్థితికి అద్దం పడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com