ఫైనల్‌ గవర్నర్‌ నిర్ణయమే...

- February 09, 2017 , by Maagulf
ఫైనల్‌ గవర్నర్‌ నిర్ణయమే...

హైదరాబాద్‌/ చెన్నై, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో ఇన్‌చార్జి గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు తీసుకోబోయే నిర్ణయమే అత్యంత కీలకం కాబోతోంది. రాష్ట్రాల్లో రాజ్యాంగ సంక్షోభాలు ఏర్పడటం, గవర్నర్‌ వద్ద పంచాయతీలు నడవడం, ఎమ్మెల్యేలతో పరేడ్‌ నిర్వహించడం కొత్తమీకాదు. కానీ, తమిళనాడులో కొనసాగుతున్నది ఒక విచిత్ర పరిస్థితి. తనను ఒత్తిడిచేసి రాజీనామా చేయించారని, దాన్ని ఉపసంహరించుకునే అవకాశం కల్పించాలని పన్నీర్‌ సెల్వం గవర్నర్‌ను కోరారు. అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న శశికళ తనకు మెజారిటీ సభ్యుల మద్దతు ఉందంటూ గవర్నర్‌కు లేఖ అందజేశారు.
ఈ నేపథ్యంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. సీఎం రాజీనామాను గవర్నర్‌ ఆమోదించాక మళ్లీ వెనక్కి తీసుకోవడం సాధ్యమవుతుందా? అన్న మీమాంస తలెత్తుతోంది. దీనిపై న్యాయ, రాజ్యాంగ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తునారు.

ఒక్కసారి రాజీనామాను ఆమోదించిన గవర్నర్‌ మళ్లీ దాన్ని ఉపసంహరించుకోవడం రాజ్యాంగ నియమాల్లో ఎక్కడా లేదని కొందరు అంటున్నారు. పన్నీర్‌సెల్వం ఆపద్ధర్మ సీఎంగానే ఉండి తన పార్టీ శాసనసభ పక్షనేతగా ఎన్నికై వస్తేనే ఆయనను ఆ పదవిలో కొనసాగించడం వీలవుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే, రాజ్‌భవన్‌ వ్యవహారాల్లో విశేష అనుభవం ఉన్న అధికారులు ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. రాజ్యాంగంలోని 164ఎ సెక్షన ప్రకారం సీఎం రాజీనామా చేసినా దానిని ఉపసంహరించుకునే అవకాశముంటుందని అంటున్నారు.

సీఎం రాజీనామా చేసినప్పుడు ఆయన ఇష్టపూర్వకంగానే చేశారా లేదా అన్నది గవర్నర్‌ రూఢీ చేసుకోవాల్సి ఉుంటుందని, ఇందులో ఏమాత్రం అనుమానం కలిగినా ఆ రాజీనామాను ఉపసంహరణకు అవకాశం కల్పించవచ్చునని అంటున్నారు. ఎస్‌ ధర్మలింగం వర్సెస్‌ గవర్నర్‌ ఆఫ్‌ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు గవర్నర్‌ విశేషాధికారాలను ప్రస్తావిస్తూ.. తన స్వీయ నిర్ణయాధికారానికి లోబడి గవర్నర్‌ తీసుకునే చర్యలను కోర్టులు తప్పుపట్టలేవని ఈ సందర్భంగా స్పష్టం చేసిందని ఉదహరిస్తున్నారు. ఇక తాజా విషయానికి వస్తే, పన్నీర్‌సెల్వంపై ఒత్తిడి పనిచేసిందని గవర్నర్‌ భావించిన పక్షంలో రాజీనామా ఉపసంహరణకు అవకాశం కల్పించి కొద్దిరోజుల వ్యవధిలో అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా ఆయన్ను ఆదేశించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com