వనితా శక్తికి జోతలు...

- February 09, 2017 , by Maagulf
వనితా శక్తికి జోతలు...

నేటి నుంచి మూడు రోజులపాటు మహిళా పార్లమెంటు సదస్సు 
హాజరవుతున్న ప్రముఖ నారీమణులు
అమరావతి: పవిత్ర కృష్ణా నదీ తీరం వేదికగా తమ గళాన్ని ప్రపంచానికి బలంగా వినిపించేందుకు మహిళా లోకం సిద్ధమైంది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమ ప్రాంతంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు విభిన్నంగా జరగనుంది.

రాజకీయ, సామాజిక, విద్య, క్రీడలు, పారిశ్రామిక, మీడియా, సినిమా, కళలు, సాంస్కృతిక తదితర రంగాలలో ఉన్నత శిఖరాలకు ఎదిగిన దేశ, విదేశాలకు చెందిన మహిళామణుల స్ఫూర్తిదాయక ప్రసంగాలతో పాటు, మహిళా సమస్యలపై చర్చాగోష్ఠులు జరుగనున్నాయి. మహిళలు తమ ఆలోచనల్ని కలబోసుకునేందుకు, అభిప్రాయాల్ని స్వేచ్ఛగా వెల్లడించేందుకు, మా సమస్యలు ఇవీ అని నినదించేందుకు, వాటికి పరిష్కారాలు కనుగొనేందుకు ఈ సదస్సు వేదికగా నిలవనుంది. ఇటీవల కాలంలో జాతీయ స్థాయిలో ఇంత భారీ ఎత్తున మహిళా పార్లమెంటు సదస్సు జరగడం ఇదే మొదటిసారి. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి సదస్సు జరగడం, అది కూడా కొత్త రాజధాని అమరావతి ప్రాంతంలో జరుగుతుండటం మరో విశేషం. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న రాష్ట్రంగా మహిళా సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్‌ ముందడుగు వేసింది. రాష్ట్రంలో ఒక్క పంచాయతీరాజ్‌ సంస్థల్లోనే జడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, సర్పంచ్‌లు కలిపి మొత్తం 79,313 మంది మహిళా ప్రతినిధులు ఉన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా జాతీయ స్థాయిలో మహిళా పార్లమెంటు సదస్సు నిర్వహించడం... మహిళాభ్యున్నతి దిశగా మరో ముందడుగు.
మహిళా సాధికారతే లక్ష్యం..!: జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుని కొన్ని నిర్దిష్ట లక్ష్యాలతో నిర్వహిస్తున్నారు. అవి. 1. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళా సాధికారతను సాధించడం. 2. విభిన్న రంగాలకు చెందిన మహిళలకు, విద్యార్థినులకు మధ్య చర్చలు, సంప్రదింపులకు వేదిక కల్పించడం 3. వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రతినిధులు, విద్యార్థినుల మధ్య ఒక అనుసంధాన వ్యవస్థ ఏర్పడేలా చూడటం. 4. విద్యార్థినులు తాము ఎంచుకున్న రంగాల్లో ముందుకు వెళ్లేందుకు ఆ రంగాల్లోని ప్రముఖ మహిళల సలహాలు పొందడం 5. మహిళా సాధికారతకు సంబంధించిన కొత్త ఆలోచనలు, విధానాలు, సిద్ధాంతాలు, వ్యూహాలను రూపొందించడం. 6. మహిళల్లో సామాజిక బాధ్యతా భావాన్ని పెపొందించడం 7. వివిధ రంగాల్లో నిర్ణాయక ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెంపొందించడం 8. విద్యార్థినులు తమ శక్తి సామర్థ్యాల్ని గుర్తించి, విభిన్న రంగాల్లో తమదైన ముద్ర వేసేలా ప్రోతహించడం 9. మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం, సామాజిక భద్రత, లైంగిక వేధింపులు, అణచివేతలు, లింగ వివక్ష వంటి సమస్యలపై సమాజానికి కనువిప్పు కలిగేలా చేయడం.
ప్రత్యేక ప్రతిజ్ఞ: మహిళా పార్లమెంటు సదస్సు కోసం ప్రత్యేక ప్రతిజ్ఞ రూపొందించారు. సదస్సు ప్రారంభోత్సవ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సదస్సుకి హాజరైన అందరితో ఈ ప్రతిజ్ఞ చేయిస్తారు. ఈ సదస్సు ముఖ్య భావనల్ని దృష్టిలో ఉంచుకుని ఒక చిహ్నం(లోగో) సిద్ధం చేశారు. మూడు రోజుల సదస్సులో ప్రారంభ, ముగింపు సమావేశాలు కాకుండా ప్రధానంగా ఐదు అంశాలపై ప్లీనరీ సమవేశాలు నిర్వహిస్తారు. 'మహిళా సాధికారత సాధనలో సామాజిక, రాజకీయ సవాళ్లు' అన్న అంశంపై తొలి సమావేశం జరుగుతుంది. దీనిపై భిన్న రంగాల్లో తమదైన ముద్ర వేసిన సులజ్జా ఫ్లోరిడా మొత్వానీ, మనీషా కొయిరాలా, అరుణా మిల్లర్‌ తదితరుల ప్రసంగాలు ఉంటాయి. నోబెల్‌ బహుమతి గ్రహీత మహ్మద్‌ యూనస్‌ కూడా ఈ అంశంపై ప్రసంగిస్తారు. రెండో ప్లీనరీ సమావేశం శనివారం ఉదయం 'మహిళల ప్రస్తుత స్థాయి, నిర్ణయాధికారం' అన్న అంశంపై జరుగుతుంది. సాగరికా ఘోష్‌, అల్కా శిరోహి, నారా బ్రహ్మణి, జస్టిస్‌ జి.రోహిణి తదితరులు ఈ అంశంపై ప్రసంగిస్తారు. దీనిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ కూడాపాల్గొంటారు. చంద్రబాబు, ఆయన కోడలు బ్రహ్మణి ఒకే వేదికపై మాట్లాడుతుండటం విశేషం. మూడో ప్లీనరీ సమావేశం శనివారం మధ్యాహ్నం 'మీకు మీరే హీరో అవ్వండి' అన్న అంశంపై నిర్వహిస్తారు. దీనిలో వనితా దాట్ల, ఐ.దీపావెంకట్‌, భావనా దోషి, ఇందిరా దత్‌, కిరణ్‌బేడి తదితరులు ప్రసంగిస్తారు. 'సొంత గుర్తింపు పొందడం, భవిష్యత్‌ దార్శనికత' అన్న అంశంపై ఆదివారం ఉదయం నాలుగో ప్లీనరీ సదస్సు జరుగుతుంది. దీనిలో రత్నారెడ్డి, రికీ కెజ్‌, శైలజా కిరణ్‌ తదితరులు ప్రసంగిస్తారు. 'రాజకీయాల్లో మహిళలు-మార్పుకి వారధులు' అన్న అంశంపై ప్లీనరీ సమావేశం జరుగుతుంది. జయసుధ, మీనాక్షి లేకి తదితరులు దీనిలో ప్రసంగిస్తారు.
అతిథుల రాక..!! సదస్సులో పాల్గొనేందుకు ముఖ్య అతిథులు కొందరు గురువారమే విజయవాడ చేరుకున్నారు. వీరిలో బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా, బంగ్లాదేశ్‌ పార్లమెంటు స్పీకర్‌ షిరిన్‌ షర్మిన్‌ చౌదరి, మాజీ ఐపీఎస్‌ అధికారిణి కిరణ్‌బేడీ, సెంటర్‌ ఫర్‌ సోషల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ రంజనా కుమారి ఉన్నారు.
విద్యార్థినులతో అనుసంధానం..! 
వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన మహిళలకు, విద్యార్థినులకు మధ్య అనుసంధాన కార్యక్రమాన్ని ఈ సదస్సులో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం రోజు తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 100 మంది విద్యార్థినుల్ని ఒక బృందంగా చేసి బృంద చర్చలు నిర్వహిస్తారు. తొలి రోజంతా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు జరుగుతాయి. రెండో రోజు విద్యార్థులను ఉద్దేశించి ప్రకృతి పోదార్‌, సీమారావు తదితరులు ప్రసంగిస్తారు. అనంతర విద్యార్థినులు తొలి రోజు చర్చను కొనసాగిస్తారు. రెండో రోజు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు సూచిస్తారు. ఓటింగ్‌ నిర్వహిస్తారు. బాగా మాట్లాడిన విద్యార్థినులకు అవార్డులు ఇస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com