సీఎం అభ్యర్థిగా సెంగొట్టయన్ పేరు

- February 11, 2017 , by Maagulf
సీఎం అభ్యర్థిగా సెంగొట్టయన్ పేరు

అటు..తమిళనాట శశికళ వర్గం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. తమ వర్గం నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా సెంగొట్టయన్ పేరును తెరపైకి తెచ్చింది. శశికళపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో మన్నార్ గుడి వర్గం ఈ కొత్త పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రజా వ్యతిరేకత కొంత తగ్గేంత వరకు సెంగొట్టయన్ ను సీఎంగా కొనసాగించాలని శశికళ ఈ అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. గోల్డెన్ బే రిసార్ట్‌లో శశికళ..తన వర్గ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.  తాజా పరిణామాలు , భవిష్యత్ వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగానే  సెంగొట్టయన్  పేరును ఆమె ప్రతిపాదించినట్లు సమాచారం. కాసేపట్లో ఎమ్మెల్యేలతో కలిసి శశికళ రాజ్ భవన్  వెళ్లనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ ముందు పరేడ్ కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

తమిళనాట రాజకీయ పరిణామాలు క్షణంక్షణం మారుతుండటంతో శశికళ వర్గం అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది. పన్నీరుకు మద్దతు పెరుగుతుండటంతో కొత్త ఎత్తులు వేస్తోంది. తన వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ప్లేట్ ఫిరాయించకుండా వ్యూహాలు రచిస్తున్నారు. తనకు అత్యంత నమ్మకంగా ఉండే వ్యక్తిని సీఎం సీటులో కూర్చొబెట్టాలని శశకళ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఆమె అమ్మను ఫాలో అవుతోంది. గతంలో ఆస్తుల కేసులో జయలలిత జైలుకు వెళ్లినపుడు..నమ్మిన బంటుగా ఉన్న పన్నీరు సెల్వానికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం తన ప్రమాణస్వీకారానికి కేసులు అడ్డు వస్తుండటంతో శశికళ కూడా జయ మార్గానే అనుసరించాలని నిర్ణయించినట్లు కనిపిస్తోంది. ఆ దిశగానే 
సీఎం అభ్యర్థిగా సెంగొట్టయన్ పేరు ప్రతిపాదించారని భావిస్తున్నారు. తన వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే  మన్నార్ గుడి టీమ్  ఈ సూచన చేసినట్లు తెలుస్తోంది. సీఎంగా  సెంగొట్టయన్ కు ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వాలని విద్యాసాగర్ రావుకు విజ్ఞప్తి చేయాలని శశికళ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

ఇవాళ ఉదయమే గవర్నర్ కు శశికళ లేఖ రాశారు. తమకు అసెంబ్లీలో సంపూర్ణ బలం ఉందని,  ప్రమాణస్వీకారానికి ఆహ్వానించాలని అందులో కోరారు. ప్రభుత్వ ఏర్పాటుపై తక్షణం  నిర్ణయం తీసుకోవాలని, లేదంటే ఉద్యమం తప్పదంటూ పరోక్షంగా హెచ్చరించారు . గవర్నర్ స్పందించని పక్షంలో ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవసరమైతే ఎమ్మెల్యేలను రాష్ట్రపతి వద్దకు తీసుకువెళ్లేలా శశకళ ప్లాన్ చేస్తోంది. మెరీనా బీచ్ లో జయ సమాధి సాక్షిగా ధర్నా చేసేందుకు శశికళ సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com