అసలు లైలా, మజ్నుల మధ్య ప్రేమ ఎలా పుట్టింది...

- February 13, 2017 , by Maagulf
అసలు లైలా, మజ్నుల మధ్య ప్రేమ ఎలా పుట్టింది...

లైలా, మజ్ను.. ప్రేమికులంతా ఎప్పటికీ గుర్తుంచుకునే పేర్లు. అమర ప్రేమికులుగా కీర్తిని సంపాదించిన వీరిద్దరూ భౌతికంగా లేకపోయినా శాశ్వతంగా ఎప్పటికీ బతికే ఉంటారు. ఎప్పుడో ఏడో శతాబ్దంలో ప్రేమ కోసం ప్రాణ త్యాగం చేసుకున్న లైలా మజ్నులను ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేమికులంతా ఒకసారి స్మరించుకోవడంలో తప్పులేదు. అసలు లైలా, మజ్నుల మధ్య ప్రేమ ఎలా పుట్టింది.. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్న వీరు ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి... ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.

మనం మజ్నుగా పిలుస్తున్న ఆ అమర ప్రేమికుడి అసలు పేరు కైసిన్ అల్-ముల్లా. కైసిన్ పుట్టిన వెంటనే అతని తండ్రి షా అమారి ఓ జ్యోతిష్కుడు దగ్గరికి తీసుకువెళ్లాడు. అప్పుడా జ్యోతిష్కుడు నీ కొడుకు ప్రేమ కోసమే పుట్టాడని చెప్పాడు. పేదవాడైన షా అమారి దీన్ని సహించలేక పోయాడట. తన కొడుకు జాతకం అబద్ధం కావాలని రోజూ దేవుణ్ని ప్రార్థించేవాడట.

మరోవైపు ఉన్నత కుటుంబంలో జన్మించిన లైలాను తన తండ్రి నాజత్ షా రాజకుమారిలా పెంచాడు. ఓ మంచి యువరాజు లాంటి అబ్బాయికి లైలాను ఇచ్చి పెళ్లిచేయాలని కలలు కనేవాడు. అలాంటి సమయంలో రంగంలోకి దిగాడు.. మన మజ్ను అలియాస్ కైసిన్. ఓ రోజు మసీదు వద్ద లైలాను చూసిన కైసిన్ తొలి చూపులోనే మనసు పారేసుకున్నాడు. తరచూ ఆమెనే వెంబడిస్తూ ఆ ఊహల్లోనే బతికేవాడు. దీన్ని గమనించిన మత గురువులు మజ్నుని మందలించారు. పేదవాడివైన నువ్వు ఓ ధనవంతురాలిని ఎలా ప్రేమిస్తావని హెచ్చరించారు.

అయినప్పటికీ లైలా మీద తనకున్న ప్రేమను మనసులోనే పాతిపెట్టలేకపోయాడు. తరచూ ఏదో విధంగా లైలా కంటపడేవాడు. అలా లైలా కూడా మజ్నుపై మనసు పడింది. అంతే రెండు మనసులు ఒక్కటయ్యాయి. ఎవ్వరూ విడదీయరానంత బలంగా ఆ లేత మనసులు ముడివేసుకున్నాయి. కానీ ఎన్ని ముడులు వేసినా వాటిని విడగొట్టేవారు ఉన్నారన్న విషయం వారికప్పుడు తెలియలేదు.

మొత్తానికి వీరి ప్రేమ విషయం తెలుసుకున్న లైలా తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోనే నిర్బంధించారు. లైలా కనిపించకపోవడంతో పిచ్చివాడైన మజ్ను తీవ్ర మానసికక్షోభకు గురయ్యాడు. అనారోగ్యం పాలయ్యాడు. మరోవైపు నాజత్ షా తన కూతున్ని భగత్ అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేసాడు. బలవంతంగా వేరే వ్యక్తికిచ్చి పెళ్లిచేసినా లైలా మనసు మారలేదు. ఎప్పుడూ మజ్నునే తలుచుకుంటూ ఉండేది. దీంతో భగత్, లైలాల మధ్య అనురాగం కొరవడింది.

అసలు ఏమైందని లైలాను భర్త ప్రశ్నిస్తాడు. తాను మజ్ను అనే అబ్బాయిని ప్రేమించానని, కానీ పెద్దలు బలవంతంగా మీతో పెళ్లి చేసారని వివరించింది. లైలా ప్రేమను అర్థం చేసుకున్న భగత్.. ఆమెను మజ్ను వద్దకు పంపించేసాడు. దీంతో లైలా, మజ్నులు మళ్లీ కలుసుకుంటారు. ఇది చూసి భరించలేని పెద్దలు వారిని చిత్రహింసలు పెట్టారు. లైలాను మళ్లీ ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించారు. ఈ బాధ భరించలేని లైలా ప్రాణాలు విడిచింది. ఈ వార్త విన్న మజ్ను కూడా తక్షణమే ప్రాణాలు విడిచాడు.

వారి పవిత్ర ప్రేమను చూసి సిగ్గుపడి కళ్లు తెరిచిన పెద్దలు, మత గురువులు లైలా సమాధి పక్కనే మజ్ను సమాధి కూడా కట్టారు. మనిషికి చావున్న ప్రేమకు చావులేదని ఈ లైలా మజ్నులా ప్రేమ గాథ లోకానికి చాటిచెప్పింది. ఈ భూమి మీద ప్రేమికులున్నంత కాలం వీరి ప్రేమ విరాజిల్లుతుంది.

చివరిగా ఒక్క మాట.. లైలా, మజ్నుల ప్రేమని ఆదర్శంగా తీసుకోండి కానీ వారిలా కాకుండా మీ ప్రేమను గెలుపించుకోండి. పెద్దలను ఒప్పించండి.. కానీ ప్రేమ కోసం ప్రాణాలు మాత్రం తీసుకోకండ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com