ఇండియాలో తప్ప అన్ని దేశాల్లో బాగుంది

- March 08, 2017 , by Maagulf
ఇండియాలో తప్ప అన్ని దేశాల్లో బాగుంది

- భారత పార్లమెంట్‌లో మహిళా ప్రాతినిధ్యం తగ్గింది 
- ఇంటర్‌ పార్లమెంటరీ యూనియన్‌ నివేదిక 
- ప్రపంచ దేశాల పార్లమెంట్‌లలో స్వల్ప పెరుగుదల నమోదు 
ఐక్యరాజ్యసమితి : 'ఆసియా దేశాల్లోని పార్లమెంటులలో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది...ఒక్క ఇండియాలో తప్ప' అని ఐక్యరాజ్యసమితి ఆందోళన కలిగించే విషయాన్ని తెలియజేసింది. అంతేగాక మిగతా ఆసియా దేశాలతో పోల్చితే...మహిళ సాధికారతలో, స్వాలంబనలో ఇండియా వెనుకబడి ఉందని 'అంతర్జా తీయ మహిళా దినోత్సవం' సందర్భంగా ఓ నివేదికను ఐరాస విడుదల చేసింది. 'ఇంటర్‌ పార్లమెంటరీ యూనియన్స్‌ (ఐపీయు)' సంస్థ 'వుమెన్‌ ఇన్‌ పార్లమెంట్‌ ఇన్‌ 2016 : ద ఇయర్‌ ఇన్‌ రివ్యూ' అన్న నివేదికను రూపొందించింది.
మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నివేదికలోని అంశాల్ని చర్చనీయాంశం చేయాలన్న ఉద్దేశాన్ని ఐపీయు వ్యక్తం చేసింది. ముఖ్యంగా పార్లమెంట్‌లో మహిళల ప్రాతినిధ్యం పెరగటంపై కీలకమైన సూచనలు చేసింది. ఇందుకోసం రాజకీయ చిత్తశుద్ధి కనబర్చాలని, లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపన ఉండాలని నివేదికలో తెలిపారు. 2016 ఏడాదికి సంబంధించి ఐపీయు నివేదికలోని అంశాలు ఇలా ఉన్నాయి... 
8ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని పార్లమెంట్‌లలో మహిళల ప్రాతినిధ్యం స్వల్పంగా పెరిగింది. గత దశాబ్ధ కాలంగా ఈ మార్పు గణనీయమైన స్థాయిలో ఉంది. 
8మహిళా గొంతు అన్ని చోట్లా వినబడాలన్న వాదన మరింత ఊపందుకోవాలని, కీలకమైన నిర్ణయాలు తీసుకోవటంలో మహిళల శక్తి మరింత పెరగాలని 'ఐపీయు' పిలుపునిచ్చింది. 
8మహిళలకు దక్కే రాజకీయ సాధికారత పట్ల జాగ్రత్తగా ఉండాలని, అది వారి గౌరవాన్ని తగ్గించేదిగా...ఆత్మనూన్యతకు దారి తీసేదిగా ఉండరాదని నివేదిక హెచ్చరించింది. 
8ఆసియా దేశాల్లోని పార్లమెంట్‌లలో మహిళల ప్రాతినిధ్యం 0.5 శాతం పెరిగింది. 2015లో 18.8 ఉంటే...2016 నాటికి 19.3కు పెరిగింది. 
8ఇరాన్‌, జపాన్‌, లావోస్‌, మంగోలియా, ఫిలిప్పైన్స్‌, దక్షిణ కొరియా, వియాత్నం దేశాల ఎన్నికల్లో మహిళలు పోటీ చేయటం పెరిగింది. కానీ ఇండియాలో మాత్రం ఈ ధోరణి తిరోగమనంలో ఉంది. 
''1994లో స్థానిక ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్లను విజయవంతంగా తీసుకొచ్చినా...ఆసియాలో ఇండియా ఇంకా వెనుకబడే ఉంది. జాతీయ స్థాయిలో కూడా ఇలాంటి ప్రయత్నమే 2008లో జరిగింది. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును తీసుకొచ్చారు. కానీ ఇంకా అది చట్టరూపం దాల్చలేదు'' 
ప్రపంచంలో... 
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని పార్లమెంట్‌లలో మహిళల ప్రాతినిధ్యం సగటు 22.6 నుంచి 23.3కి పెరిగింది. పదేండ్ల క్రితం ఈ సంఖ్య 16.8గా ఉంటే...దీంట్లో 6.5 పాయింట్ల పెరుగుదల నమోదైంది. రాజకీయాల్లో లింగ సమానత్వానికి ఇదెంతగానో దోహదం చేసింది. ఉన్నతస్థానాల్లో మహిళలకు అవకాశం కల్పించటం కోసం పార్లమెంట్‌లు మరింత కృషి చేయాల్సి ఉంది. 2030 నాటి కల్లా లింగ సమానత్వాన్ని సాధించాలంటే...మరిన్ని సమర్థవంతమైన చట్టాల్ని తీసుకురావాల్సి ఉంది. 
భారత్‌లో.... 
2016 జూన్‌-జులై మధ్య రాజ్యసభ సభ్యుల ఎంపిక అనంతరం...సభలో మొత్తం మహిళల సంఖ్య 27 మాత్రమే. గతంలో జరిగిన రాజ్యసభ సభ్యుల ఎన్నికతో పోల్చితే...సభలో మహిళా ప్రాతినిధ్యం పడిపోయింది. మొత్తంగా పార్లమెంటులో 12.8 నుంచి 11.1 శాతానికి... అంటే 1.7 శాతం మహిళా ప్రాతినిధ్యం తగ్గింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com