ఆధార్‌ తప్పనిసరి ఉచిత గ్యాస్‌కు

- March 08, 2017 , by Maagulf
ఆధార్‌ తప్పనిసరి ఉచిత గ్యాస్‌కు

ఆధార్‌నంబర్‌ లేని మహిళలు మే 31లోగా దరఖాస్తు చేసుకోవాలి 

ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత వంటగ్యాస్‌ (ఎల్పీజీ) కనెక్షన్‌ పొందాలనుకునే నిరుపేద మహిళలు తప్పనిసరిగా ఆధార్‌ కార్డు కలిగి ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో ఎల్పీజీ సబ్సిడీలు పొందే ప్రతిఒక్కరికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. తాజాగా దారిద్య్రరేఖకు దిగువున ఉన్న కుటుంబాల మహిళలు ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌ పొందేందుకు కూడా ఆధార్‌ను తప్పనిసరి చేసింది. స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందజేసే లక్ష్యంతో.. మూడేళ్లలో ఐదు కోట్ల మంది నిరుపేద మహిళలకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చేందుకు గత ఏడాది ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై)కు కేంద్రం శ్రీకారం చుట్టింది.
ఈ నేపథ్యంలో తాజాగా పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఓ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పీఎంయూవై కింద ప్రయోజనం పొందాలని భావించే లబ్ధిదారు ఆధార్‌ నంబర్‌ను కలిగి ఉన్నట్టుగా ధ్రువీకరణ పత్రం సమర్పించాలని లేదా ఆధార్‌ కోసం నమోదు చేసుకోవాలంది. ఆధార్‌ లేనివారు మే 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. 
పంట బీమాకూ... 
రాబోయే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి పంటల బీమా పొందే రైతులకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తమ ఈ నిబంధనకు కట్టుబడి ఉండాలని కేంద్ర వ్యవసాయ శాఖ గ్రామీణ ఆర్థిక సంస్థల(ఆర్‌ఎఫ్‌ఐ)కి ఆదేశాలు జారీచేసింది. 'వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న పంటల బీమా సౌకర్యం పొందుతున్న రైతులంతా 2017 ఖరీఫ్‌ నుంచి ఆధార్‌ వివరాలు సమర్పించాలి' అని ఆదేశాల్లో పేర్కొన్నారు. రైతులు బ్యాంకును సందర్శించినపుడు లేదా రుణాలు మంజూరు చేసే సమయంలో ఆధార్‌ సమర్పించేలా వారిని ఒప్పించాలని బ్యాంకులను కోరారు. ఆధార్‌ లేని రైతులు దాన్ని పొందే వరకూ బ్యాంక్‌ పాస్‌బుక్, ఓటర్‌ గుర్తింపు కార్డు, ఉపాధి హామీ కార్డు, ఆధార్‌ దరఖాస్తు కాపీతోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లాంటి గుర్తింపు కార్డులను చూపి బీమా ప్రయోజనాలు పొందవచ్చన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com