ఈదురుగాలులు, భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో
- March 11, 2017
వాతావరణం మారిపోతోంది.. ఎండల్లో వానాకాలాన్ని తలపిస్తోంది.. తెలుగు రాష్ట్రాల్లో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరవుతుంటే.. కొన్నిచోట్ల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరో 24 గంటలు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఉదయం వణికిస్తోంది.. మధ్యాహ్నం మంటలు పుట్టిస్తోంది.. సాయంత్రం తడిసి ముద్ద చేస్తోంది.. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. రెండు మూడు రోజులుగా ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు బీభత్సం సృష్టిస్తుంటే, ఆ వెంటే భానుడు కూడా నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో మార్చ్ మొదట్లోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. ఫ్యూచర్లో ఇంకెంత రేంజ్కి వెళతాయోనన్న ఆందోళన కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాలను అన్సీజన్లో వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. ప్రచండగాలులకు పంటలు ధ్వంసమవుతున్నాయి. కృష్ణా జిల్లాలో వందలాది ఎకరాల్లో పంటలు నేలమట్టమయ్యాయి. శనివారం ఉదయం వరకు భీమడోలులో నాలుగు సెంటీమీటర్ల వర్షం కురిసింది. విశాఖ ఎయిర్పోర్ట్, మధిరలో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఎండలు కూడా ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ప్రచండ భానుడి ప్రతాపానికి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శింగనమల మండలం తరిమెలలో 42.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఎన్పీ కుంటలో 41.9 డిగ్రీలు, యల్లనూరు 40.2 డిగ్రీలు, చెన్నేకొత్తపల్లి, కూడేరు, తాడిమర్రి, గుంతకల్లులో 40 డిగ్రీలు నమోదయ్యాయి.
అటు ప్రకాశం జిల్లాలోనూ భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు క్రాస్ అయ్యాయి. ఉదయం పది గంటలకే భానుడి భగభగలు బెంబేలెత్తిస్తున్నాయి. బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ఎండలకు ఉక్కపోత కూడా తోవడంత ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాతావరణంలో మార్పులతో నిన్న మొన్నటి వరకు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవగా.. ఉన్నట్టుండి ఒక్కసారిగా 40 డిగ్రీలకు చేరాయి. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. ఇక తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ బెంగాల్ వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో సముద్రం నుంచి తేమగాలులు రావడం, కొన్నిచోట్ల ఎండ తీవ్రతతో వాతావరణంలో అనిశ్చితి నెలకొని మేఘాలు ఆవరిస్తున్నాయి. మరో 24 గంటల్లో ఏపీ, తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







