జనాలు అభివృద్ధి మంత్రానికి పట్టం కట్టారు

- March 11, 2017 , by Maagulf
జనాలు అభివృద్ధి మంత్రానికి పట్టం కట్టారు

యూపీ ఎన్నికలు దేశవ్యాప్తంగా గుణపాఠం నేర్పుతుందా?  కేవలం ఉచిత పథకాలతోనే పీఠం చేరుకోవచ్చన్న అభిప్రాయం ఉన్న పార్టీలకు చెంపపెట్టులాంటి తీర్పు అంటున్నారు. అవును సిద్దాంతాలు, విధానాలు పక్కనపెట్టి కేవలం ఉచిత హామీలతో మ్యానిఫెస్టోలను నింపిన పార్టీలను పక్కనపెట్టి బీజేపీ అభివృద్ధి మంత్రానికి పట్టం కట్టడం చెప్పుకోదగ్గ మార్పు అంటున్నారు నిపుణులు. మరి ఇందులో నిజమెంత. అర్బన్‌ పార్టీగా ముద్ర పడ్డ బీజేపీ.. రూరల్‌ ఓటర్లు ఎక్కువగా ఉన్న యూపీలో అసమాన విజయం సొంతం చేసుకుంది. అన్నివర్గాల ప్రజల మనసును గెలచుకుని ప్రత్యర్ధుల ఊహకు కూడా అందనంత ఎత్తులో కూర్చుంది. ప్రతిపక్ష హోదా కాపాడుకోవడానికి నిన్నటిదాకా అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ అష్టకష్టాలు పడింది. చావుతప్పి కన్నులొట్టపోయింది. బీజేపీ విధానాలకు, అభివృద్ది మంత్రానికి ప్రజలు పట్టం కట్టారు. ఇక్కడ హామీల కంటే భవిష్యత్తు కోసం ప్రజలు స్పష్టంగా మార్పును కోరుకున్నారు.   
యూపీ ఎన్నికలు కేవలం అక్కడి ప్రాంతీయ శక్తులకే పాఠం నేర్పడం లేదు. దేశవ్యాప్తంగా ఉచిత హామీలతో మ్యానిఫెస్టోలను నింపి విధానాలకు, సిద్దాంతాలకు తిలోదకాలు ఇచ్చిన పార్టీలకు చెబుతున్న గుణపాఠం ఇది. ఓటర్లకు ఉచిత హామీలతో ఆకట్టుకోవడం చాలా పార్టీలకు అలవాటుగా మారింది. మ్యానిఫెస్టోల్లో ఆయా రాష్ట్రాలు, ప్రాంతాల సుస్థిర అభివృద్ధికి ఎక్కడా ప్రణాళికలు కనిపించడం లేదు సైకిళ్లు, బైకులు, లాప్‌ట్యాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు వంటి బహుమతులను ప్రకటిస్తున్నారు. కానీ వాటిని సొంతంగా సంపాదించుకోవడానికి అవసరమైన విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించడానికి అనుసరించే విధానాలు కనిపించడం లేదు. విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్న మానిఫెస్టోలు కనిపించడం లేదు. అన్ని వర్గాలకు, కులాలకు, మతాలకు ఉచిత పథకాలు ఇస్తే చాలు ఓట్లు పడతాయన్న భావన పెరుగుతోంది. కాశ్మీర్‌ నుంచి కేరళ దాకా ఇదే పరిస్థితి. గడిచిన 20 ఏళ్లుగా ఉచిత పథకాలు పెరిగిపోయాయి. అవి లేకుండా ఎన్నికలు హామీలు ఉండడం లేదు.
యూపీలో బీజేపీ ఉచిత హామీల కంటే కూడా అభివృద్ధి నినాదం బలంగా వినిపించారు. భావితరాలకు బంగారు భవిష్యత్తు అందిస్తామని భరోసా ఇచ్చారు. పేదరికం గురించి ఎక్కువమాట్లాడారు. మోడీ, అమిత్‌షాలు మానిఫెస్టోలో అవసరమైన ఉచితాలకు ఓకే ఉన్నారు. రైతుల సంక్షేమానికి కట్టుబడతామన్నారు. అనుచితాలను పక్కనపెట్టారు. అదే వారికి వరంగా మారింది. ఓ రకంగా ప్రజలు ఉచితాల కంటే తమ గ్రామాలు బాగుపడాలన్న భావన ఓట్ల ద్వారా వ్యక్తం చేశారు. రూరల్‌ ఓట్లు అధికంగా ఉన్న యూపీలో ప్రజలు ఉచిత పథకాలకు నో చెప్పడం రాజకీయాల్లో వచ్చిన పెద్ద మార్పుగానే భావించాలి. మోడీ అభివృధ్ధి నినాదానికి వారు మద్దతు తెలిపినట్టు చూడాలి. కుల, మత, వంశపారంపర్య రాజకీయాలకు చరమగీతం పాడారు. యూపీ ఎన్నికల ద్వారా అయినా ఉచిత పథకాలపై పార్టీలు పునసమీక్షీంచుకోవాలి. పథకాలు ప్రజాశ్రేయస్సు కోరే విధంగా... దూరదృష్టితో ఉండాలని. ప్రజల జీవన విధానం మెరుగుపడేలా ఉండాలి. అంతే కానీ వ్యక్తిగత ప్రయోజనాలతో అభివృద్ధి అసాద్యమని గుర్తించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com