ఆత్మవిశ్వాసంతో ఎవరెస్టు ఎంత ఎత్తయినా ఎక్కేస్తాం
- April 06, 2017
వారంతా రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. అయినా ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో..సముద్రమంత ధీమాతో ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టును అధిరోహించేందుకు సమాయత్తమవుతున్నారు. 60 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు యువజన వ్యవహారాల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బృందానికి చెందిన ధర్మతేజ, సత్యారావు, చెన్నారావు, భరత్, నాగరాజు, పార్వతిలకు ఆయన జెండాను అందజేశారు. మొత్తం ఆరుగురు యువ పర్వతారోహకులతో పాటు ఓ శిక్షకుడు, వైద్యుడు ఈ బృందంలో ఉన్నారు. ఈ నెల 8న వీరు విజయవాడ నుంచి బయలుదేరి.. దిల్లీ మీదుగా నేపాల్ రాజధాని ఖాట్మండు వెళ్తారు.
అక్కడి నుంచి సామగ్రి, షేర్పాలతో కలసి లాసాకు చేరుతారు. అక్కడి బేస్ క్యాంపు నుంచి ఎవరెస్టు అధిరోహణ పర్వం మొదలవుతుంది. యువతలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపేందుకు గత ఏడాది రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం 300 మందిని ఎంపిక చేసి, దశలవారీగా వడబోసి చివరకు ఆరుగుర్ని ఎంపిక చేశారు. మే నెల చివరికల్లా ఎవరెస్టును అధిరోహించి.. భారత్, ఆంధ్రప్రదేశ్ పతాకాలను ఎగురవేస్తామని వీరంతా ధీమాగా చెబుతున్నారు.
యువతకు అన్ని రంగాలలో శిక్షణ: మంత్రి: రాష్ట్రంలోని యువతకు అన్ని రంగాలలో అవసరమైన శిక్షణ ప్రభుత్వం ఇప్పిస్తుందని మంత్రి రవీంద్ర అన్నారు. గురువారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం రూ.2.40 కోట్లతో యువతకు ఎవరెస్ట్ అధిరోహించే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ ప్రయత్నంలో వారు విజయం సాధించి దేశ, రాష్ట్ర పతాకాలను రెపరెపలాడించాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







