లండన్ లో బ్రిటిష్ ఎయిర్‌వేస్ సర్వీస్‌లు రద్దు

- May 27, 2017 , by Maagulf
లండన్ లో బ్రిటిష్ ఎయిర్‌వేస్ సర్వీస్‌లు రద్దు

 విమానాశ్రయాల నుంచి కదలని విమానాలు.. కంప్యూటర్ వ్యవస్థలో లోపంతో గందరగోళం
బ్రిటిష్ ఎయిర్‌వేస్(బీఏ) కంప్యూటర్ వ్యవస్థలో తలెత్తిన లోపంతో శనివారం లండన్‌లోని హీత్రూ, గాట్విక్ విమానాశ్రయాల నుంచి బయలుదేరాల్సిన విమాన సర్వీసులను పూర్తిస్థాయిలో రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్‌లో బ్యాంకు సిబ్బందికి వారాంతపు సెలవు, సోమవారం వార్షిక సెలవు కావడంతో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. ముందుగా సాయంత్రం 6 గంటల వరకే విమానాలు రద్దుచేస్తామని బీఏ పేర్కొన్నది. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో చివరకు రోజుమొత్తం విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రయాణికులకు అంతరాయం కలిగించినందుకు బీఏ క్షమాపణలు కోరింది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. దీని ప్రభావం ఎన్ని విమాన సర్వీసులపై పడిందనేది స్పష్టతలేదని, కానీ హీత్రో, గాట్విక్, బెల్‌ఫాస్ట్ విమానాశ్రయాలకు చేరుకునే, అక్కడ నుంచి బయలుదేరే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు పేర్కొన్నది. ఐటీ అవాంతరంతో హీత్రూ విమానాశ్రయం నుంచి బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానాలు బయలుదేరకుండా వేచిఉండడం, కొన్ని విమానాలు ల్యాండ్ అయినా ప్రత్యేక పార్కింగ్ స్థలం లేకపోవడంతో గంటలతరబడి ప్రయాణికులు విమానాల్లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది.
ఇక్కడి నుంచి వెళ్లే ఇతర విమానాలపై ఈ ప్రభావం పడలేదని బ్రిటిష్ ఎయిర్‌వేస్ తెలిపింది. సేవలను భారత్‌కు ఔట్‌సోర్సింగ్ ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని బ్రిటిష్ ఎయిర్‌వేస్ యూనియన్ ఆరోపించింది 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com