తెలంగాణ రాష్ట్రంలో 450 పడకలతో కొత్త క్యాన్సర్ ఆసుపత్రి
- June 04, 2017
ఎంఎన్‌జేకు కొనసాగింపుగా మల్లేపల్లిలో నిర్మాణం
266 అదనపు పోస్టులకు ముఖ్యమంత్రి ఆమోదం
ఐదు జిల్లాల్లోనూ చికిత్స కేంద్రాలు
రా ష్ట్రంలో 450 పడకలతో కొత్తగా క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఎంఎన్‌జే ఆసుపత్రికి కొనసాగింపుగా ఇది సేవలందిస్తుంది. ప్రస్తుత ఆసుపత్రి భవనం పాతది కావడం.. రోగుల తాకిడికి తగ్గట్లుగా వసతులు కొరవడడం.. తదితర కారణాలతో నూతన ఆసుపత్రిని నిర్మించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ విషయంపై సంబంధిత శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పలు సమీక్షలు నిర్వహించిన అనంతరం హైదరాబాద్ మల్లేపల్లిలో నాలుగున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని నూతన క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించారు. భవన నిర్మాణం, అవసరమైన మానవ వనరుల నియామకాలకు సంబంధించిన దస్త్రానికి ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేశారని వైద్యవర్గాలు తెలిపాయి. 80 మంది వైద్యులు, 100 మంది నర్సులు సహా మొత్తం 266 పోస్టుల మంజూరుకు సంబంధించిన అనుమతి ఉత్తర్వు త్వరలో విడుదల కానుంది. నూతన ఆసుపత్రిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య పరికరాలను వినియోగించనున్నారు. ప్రస్తుతమున్న క్యాన్సర్ నిపుణులతో పాటు కొత్తగా ఉప విభాగాలనూ నెలకొల్పనున్నారు. గైనిక్, న్యూరో, గ్యాస్ట్రోఎంట్రిక్, ఈఎన్టీ తదితర విభాగాల్లో ఆంకాలజీ వైద్య సేవలను ప్రత్యేకంగా ఏర్పాటుచేయనున్నారు. ‘‘ఇలాంటి ఉపవిభాగాలతో కూడిన సేవలు ప్రస్తుతం టాటా క్యాన్సర్ ఆసుపత్రిలో మినహా దేశంలో మరే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో లేవు. నూతన ఆసుపత్రిలో వీటిని ఏర్పాటు చేయనున్నాం. ఇక్కడ ఎముక మూలుగ మార్పిడి(బోన్ మ్యారో), మూల కణ చికిత్స(స్టెమ్‌సెల్) తదితర అధునాతన వైద్యాలను అందుబాటులోకి తేనున్నాం’’ అని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి సంచాలకులు జయలత తెలిపారు.
డీఎన్బీ కోర్సుల నిర్వహణ..
ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో కొత్తగా డీఎన్బీ (డిప్లమేట్ ఆఫ్ నేషనల్ బోర్డు) కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదలు సిద్ధం చేశారు. రేడియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, మెడికల్ ఆంకాలజీ, గైనిక్ ఆంకాలజీ తదితర విభాగాల్లో డీఎన్బీ కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా ఆసుపత్రిలో పీజీ విద్యార్థుల సేవలు అందుబాటులోకి వస్తాయి. తద్వారా రోగులకు 24 గంటలూ మెరుగైన వైద్యసేవలందించడానికి మార్గం సుగమమౌతుంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపించనున్నామని వైద్యవర్గాలు తెలిపాయి.
జిల్లా స్థాయిలోనూ..
జిల్లా స్థాయిలోనూ క్యాన్సర్ చికిత్స కేంద్రాలను ఏర్పాటుచేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 15 పడకలతో క్యాన్సర్ వార్డులను ఏర్పాటుచేయనున్నారు. దశలవారీగా పడలక సంఖ్యను పెంచుతారు. ఇద్దరు వైద్యులు, నలుగురు నర్సులు, ఇద్దరు సాంకేతిక నిపుణులు, నలుగురు వార్డు బాలురు.. మొత్తంగా 12 మంది సిబ్బందిని ఈ చికిత్స కేంద్రాల్లో నియమించనున్నారు. ఇద్దరు వైద్యుల్లో ఒకరు రేడియేషన్ ఆంకాలజిస్టు ఉంటారు. అధునాతన వైద్య పరికరాలను సమకూర్చడం ద్వారా జిల్లాల్లోనే క్యాన్సర్ చికిత్సలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. వైద్య కళాశాలకు అనుబంధంగా వీటిని కొనసాగించడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో గుండె, జీర్ణకోశ, నాడీ సంబంధ, జనరల్ వైద్యనిపుణుల సేవలూ అందుబాటులో ఉంటాయని భావిస్తోంది. ఒకవేళ క్యాన్సర్ రోగులకు ఐసీయూ అవసరమైనా వైద్యకళాశాల అనుబంధ ఆసుపత్రిలో వినియోగించుకోవచ్చనీ, కొన్నిసార్లు శస్త్రచికిత్సలను కూడా జిల్లా స్థాయిలోనే చేయడానికి అవకాశముంటుందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. క్యాన్సర్ సేవల విస్తరణకు కేంద్రం నుంచి ఆర్థికసాయం అందుతుందనీ, ఇప్పటికే ఎంఎన్‌జే ఆసుపత్రికి కేటాయించిన రూ.100 కోట్లు కాకుండా మరిన్ని నిధులనూ మంజూరు చేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సుముఖత వ్యక్తంచేసిందని తెలిపాయి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









