సౌదీతో ఖతార్ చర్చలకు కువైట్ మధ్యవర్తిత్వం
- June 06, 2017
ఖతార్ సంక్షోభ నివారణకు కువైట్ ముందుకు వచ్చింది. మధ్యవర్తిత్వం వహించి దౌత్యపరమైన చర్చలు జరపడానికి ఆసక్తి చూపింది. ఈ నేపథ్యంలో కువైట్ రాజు జాబర్ అల్ అహమద్ అల్ సబా చర్చల నిమిత్తమై మంగళవారం సౌదీకి వెళ్లారని, ఈ సమస్యకు పరిష్కారాన్ని చర్చల ద్వారా కనుగొంటామని ఖతార్ విదేశాంగమంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. అయితే సంక్షోభానికి నిజమైన కారణం మాత్రం తెలియరాలేదని ఆయన స్పష్టం చేశారు. సౌదీతో చర్చల కోసం మధ్యవర్తిత్వం వహించేందుకు కువైట్ ముందుకు వచ్చిందని ఆయన వెల్లడించారు. అరబ్ సహా పలు దేశాలు ఖతార్‌తో దౌత్య సంబంధాలు తెగతెంపులు చేసుకోవటం మధ్యప్రాచ్యంలో మరో అలజడిని సృష్టించింది. ఇరాన్ అండ ఉన్న పలు గ్రూపులతోపాటు అల్‌ఖైదా, ఇస్లామిక్‌స్టేట్...తదితర జిహాదీ శక్తులకు ఖతార్ మద్దతు ఇస్తున్నదని ఆ దేశాలు ఆరోపిస్తున్నాయి. బహ్రెయిన్, సౌదీ అరేబియా, యుఏఈ, యెమెన్, లిబియా, మాల్దీవులు దౌత్య సంబంధాల్ని తెగతెంపులు చేసుకున్నాయి.
రెండు వారాల్లోగా ఖతార్ పౌరులు తమ దేశం విడిచిపోవాలని బహ్రెయిన్, సౌదీ, యుఏఈ ప్రకటించాయి. మధ్యప్రాచ్యంలో చాలా చిన్న దేశం ఖతార్. పరిమాణంలో చిన్నదే అయినా...ఇంధన వనరుల విషయంలో మాత్రం పెద్దదే. మిగతా అరబ్ దేశాలతో పోల్చితే చమురు ఉత్పత్తులతో గొప్ప ఆర్థిక ప్రగతి సాధించింది. అయితే గతకొన్నేండ్లుగా సౌదీ అరేబియా ఆధిపత్యాన్ని ఖతార్ ఒప్పుకోవటం లేదు. సౌదీ బద్ధ శత్రువు ఇరాన్‌కు వ్యూహాత్మకంగా దగ్గరైంది.
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ), కువైట్, ఒమన్, యెమెన్...ఇతర అరబ్ దేశాలతో మాత్రం ఖతార్‌కు ఇప్పటికీ సన్నిహిత సంబంధాలే ఉన్నాయి.
ఆహార కొరత ఏర్పడే ప్రమాదం
ప్రస్తుత నిర్ణయం కారణంగా ఖతార్ వెంటనే ఎదుర్కొనే సమస్య ఆహార కొరత. ఈ దేశానికి యుఏఈ నుంచి పెద్ద ఎత్తున ఆహారం దిగుమతి అవుతున్నది. విమాన సర్వీసుల్ని యుఏఈ రద్దు చేయటంతో ఆహార దిగుమతులు వెంటనే ఆగిపోయాయి. ఖతార్ నుంచి భూమార్గం ఉన్న ఏకైక దేశం సౌదీ అరేబియా. ఈ మార్గం గూండా ఖతార్‌కు దాదాపు 40 శాతం ఆహారం దిగుమతి అవుతున్నది. ఇప్పుడీ మార్గాన్ని కూడా సౌదీ మూసేయటం ఖతార్ ఆహార సమస్యను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో ఖతార్‌లో ఆహార ఉత్పత్తులకు కొరత ఏర్పడు తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఖతార్ సూపర్‌మా ర్కెట్లలో సరకుల కోసం సోమవారం నుంచే జనం బారులుదీరారు. వేల మంది ముందు జాగ్రత్తగా నిత్యా వసర వస్తువులను భారీ ఎత్తున కొనుగోలు చేయడంతో కొద్ది గంట ల్లోనే మార్కెట్లు ఖాళీ అయ్యాయి. దీంతో ఖతార్‌లో సరకుల ధరలు నింగికెగిసాయి. సరిహద్దుల్లో వందలాది ట్రక్కులు ఆగిపోయాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







