హీరో విజయ్‌సేతుపతితో త్రిష ‘96’

- June 12, 2017 , by Maagulf
హీరో విజయ్‌సేతుపతితో త్రిష ‘96’

విజయ్‌సేతుపతితో త్రిష రొమాన్స్‌ చేస్తున్న 96 చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో చెన్నైలో ఆదివారం ప్రారంభం అయ్యింది. త్రిష చిత్రం ప్రారంభం అవుతుందంటే కోలీవుడ్‌ వర్గాల్లో కలిగే కిక్కే వేరు. అలాంటి వాతావరణమే ‘96’ చిత్ర పూజాకార్యక్రమంలో కనిపించింది. ఇంతకు ముందు జయంరవి, హన్సిక జంటగా రోమియో జూలియట్, విశాల్‌ హీరోగా కత్తిసండై వంటి భారీ చిత్రాలను నిర్మించిన మెడ్రాస్‌ ఎంటర్‌ప్రైజస్‌ సంస్థ అధినేత ఎస్‌ నందగోపాల్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం 96. అదే విధంగా పసంగ, నడువుల కొంచెం పక్కత్త కానోం, సుందరపాండియన్‌ చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన సీ ప్రేమ్‌కుమార్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

షణ్ముగసుందరం ఛాయాగ్రహణంతోపాటు గోవింద్‌మీనన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం గురించి కథానాయకుడు విజయ్‌సేతుపతి మాట్లాడుతూ ఇదో అందమైన ప్రేమ కథా చిత్రంగా ఉంటుందన్నారు. టైమ్‌ మిషన్‌లా చిత్రం చూసే ప్రేక్షకుల్ని వేరే లోకంలోకి తీసుకెళుతుందనే నమ్మకం ఉందన్నారు. తాను త్రిషతో కలిసి నటిస్తానని కలలో కూడా ఊహించలేదన్నారు. తాను చిన్న నటుడిగా ఉన్నప్పుడు త్రిష ప్రముఖ కథానాయకిగా వెలుగొందుతున్నారని, ఆమె నటించిన విన్నైతాండి వరువాయా చిత్రానికి తాను ఫ్యాన్‌ అని అన్నారు. త్రిష, నయనతార, తమన్నాలు కఠిన శ్రమ, నటనపై అంకిత భావంతోనే ఈ స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు.
విన్నైతాండివరువాయా తరువాతి చిత్రం:
నటి త్రిష మాట్లాడుతూ ‘96’ చిత్రం ఒక అందమైన ప్రేమ కథా చిత్రంగా ఉంటుందన్నారు. విన్నైతాండి వరువాయా తరువాత ఆ తరహాలో సాగే విభిన్న ప్రేమ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ఇదన్నారు. తాను సుమారు ఏడాదిగా ఈ కథలో పయనిస్తున్నానని చెప్పారు. నాలుగేళ్లుగా చాలా చిత్రాల్లో నటిస్తున్నానన్నారు. విజయ్‌ నుంచి విజయ్‌సేతుపతి వరకూ  ఈ పయనం తనకు ఎంతో బాగా నచ్చిందని త్రిష పేర్కొన్నారు. ‘96’ చిత్రంలోని విజయ్‌సేతుపతి, త్రిష మధ్య కీలక సన్నివేశాలను అండమాన్‌లో చిత్రీకరించనున్నట్లు నిర్మాత ఎస్‌ నందగోపాల్‌ తెలిపారు. ఆ తరువాత కలకత్తా, రాజస్థాన్, పాండిచ్చేరి, కుంభకోణం, చెన్నై ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్‌ జరుపనున్నట్లు ఆయన తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com