ఇండోనేషియాలో దారుణం సొరంగం తవ్వి బాలిలో నలుగురు ఖైదీల పరారీ

- June 19, 2017 , by Maagulf
ఇండోనేషియాలో దారుణం సొరంగం తవ్వి బాలిలో నలుగురు ఖైదీల పరారీ

కిక్కిరిసి పోయిన జైలు నుండి తప్పించుకు పారిపోయిన నలుగురు విదేశీ ఖైదీల కోసం ఇండోనేషియా పోలీసులు గాలింపు ప్రారంభించారు. జైలు లోపల నుండి సొరంగాన్ని తవ్వి ఆ నలుగురు ఖైదీలు తప్పించుకు పారిపోయారని అధికారులు సోమవారం తెలిపారు. 39 అడుగుల పొడవైన సొరంగాన్ని తవ్వడానికి వారం రోజులు పట్టి వుంటుందని జైలు అధికారి పేర్కొన్నారు. తప్పించుకున్న ఆ ఖైదీలు ఇంకా బాలిలోనే వుండి వుంటారని, ఎక్కువ దూరం వెళ్ళి వుండరని అధికారులు భావిస్తున్నారు. ఆ నలుగురు ఆస్ట్రేలియా, బల్గేరియా, భారత్‌, మలేసియా జాతీయులని పోలీసు ప్రతినిధి చెప్పారు. సోమవారం ఉదయం చూసే నాటికి 50సెంటిమీటర్ల వ్యాసార్థంతో వున్న ఆ సొరంగం నిండా నీరు వుందని తెలిపారు. అంతర్జాతీయ పర్యాటక, రవాణా కేంద్రమైన బాలిలో విదేశీ ఖైదీలు ఎక్కువగానే వుంటారు. ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు ఉల్లంఘించడం నుండి మాదకద్రవ్యాల నేరాల వరకు వివిధ నేరాల్లో వీరు నలుగురు శిక్షను అనుభవిస్తున్నారు. ఆదివారం రాత్రి వీరు తప్పించుకున్నారని అనుమానిస్తున్నారు. ఆ సమయంలో 10మంది గార్డులు విధుల్లో వున్నారు.
కెరోబాకన్‌ జైలు సామర్ధ్యం 323 మంది ఖైదీలు కాగా, ప్రస్తుతం అందులో నాలుగు రెట్లు అంటే 1378మంది వున్నారని ప్రభుత్వ డేటా తెలియచేస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com