సిరియాలో మరో రసాయనదాడి?

- June 27, 2017 , by Maagulf
సిరియాలో మరో రసాయనదాడి?

సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మరో మారణ హోమానికి ప్రణాళికలు రచిస్తున్నాడని అమెరికా పేర్కొన్నది. ప్రజలపై మరోసారి రసాయన దాడి జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఇదే జరిగితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఖాన్‌షైకూన్ పట్టణంపై రసాయన దాడి జరుగడంతో 75 మంది అమాయకులు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ఇది అధ్యక్షుడు అసద్ పనేనని ఆరోపిస్తూ అమెరికా సిరియా ఎయిర్‌బేస్‌పై క్షిపణిదాడి జరిపింది. తాజాగా మరోసారి రసాయన దాడి జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అమెరికా వైట్‌హౌస్ అధికార ప్రతినిధి సీన్ స్పైసర్ పేర్కొన్నారు. అసద్ నేతృత్వంలోని బలగాలు మరో రసాయన దాడి జరిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయని గుర్తించాం. 

ఏప్రిల్ 4కు ముందు జరిగినట్టే ఇప్పుడూ పరికరాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే జరిగితే అమాయక చిన్నపిల్లలతో సహా భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతారు అని చెప్పారు. రసాయన దాడి జరిగితే అసద్, ఆయన సైన్యం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. సిరియాలో అంతర్యుద్ధం 2011లో ప్రారంభమైంది. తిరుగుబాటుదారులు ప్రధాన పట్టణాలను ఆక్రమించుకోవడంతో సిరియా ప్రభుత్వం విన్నపం మేరకు రష్యా, ఇరాన్ సహకారం అందిస్తున్నాయి. ఆ తర్వా త తిరుగుబాటుదారులకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సహకారం అందించడంతో అమెరికా కూడా రంగంలోకి దిగింది. యుద్ధం వల్ల ఇప్పటివరకు 3.2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన రసాయన దాడిలో 75 మంది మరణించారు. ఇది సిరియా అధ్యక్షుడు అస ద్ పనేనని అమెరికా ఆరోపించగా, ఆయన ఇదంతా కట్టుకథ అని కొట్టిపారేశారు. తమ సైన్యం వద్ద ఉన్న రసాయన ఆయుధాలను 2013 లోనే నిర్మూలించామని చెప్పారు. సిరియా సైన్యం రసాయన ఆయుధాలను పునరుద్ధరించిందని అమెరికా రక్షణశాఖ మంత్రి జిమ్‌మాటిస్ గతంలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ సైన్యం సైతం అసద్ సైన్యం కొన్ని టన్నుల రసాయన ఆయుధాలను సిద్ధం చేసుకున్నదని బయటపెట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com