కలాం ఇంట్లో నివసించనున్న ప్రణబ్‌ముఖర్జీ

- July 23, 2017 , by Maagulf
కలాం ఇంట్లో నివసించనున్న ప్రణబ్‌ముఖర్జీ

దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఉన్న ఇంటికే ప్రస్తుతం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వెళ్లనున్నారు. ఆయన రాక కోసం ఆ ఇంటిని ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. దేశ రాజధాని దిల్లీలోని 10 రాజాజీ రోడ్‌లో ప్రత్యేక బంగ్లాను ప్రణబ్‌ముఖర్జీ కోసం సిద్ధం చేశారు. 11,776 చదరపు విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లాలో ఎనిమిది గదులు ఉన్నాయి. ఆయన రాక సందర్భంగా విల్లాలో ఉన్న ఫర్నీచర్‌ను, నేమ్‌ ప్లేట్లను మార్చినట్లు అధికారులు తెలిపారు. నూతన రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇటీవల ఎన్నికైన విషయం తెలిసిందే. ప్రస్తుత రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్‌ముఖర్జీ పదవీకాలం ఈనెల 25తో ముగియనుంది. పదవీ విరమణ అనంతరం ఆయన నివాసం ఉండేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 

జులై 25న కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రణబ్‌ముఖర్జీ కొత్త ఇంటికి వెళ్లిపోతారు. 2012లో రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ ఎన్నికయ్యారు. ఈ ఐదేళ్ల పదవీకాలం గురించి ప్రణబ్‌ ఓ పుస్తకం రాసే ఆలోచనలో ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. ఆయనకు పదవీ విరమణ అనంతరం నెలకు రూ.75వేలు పెన్షను రానుంది. వాటితో పాటు రెండు టెలిఫోన్లు, ఒక మొబైల్‌ ఫోన్‌, కారు ఉచితంగా ఇస్తారు. ఆయన దేశంలో ఎక్కడికైనా ఉచితంగా వెళ్లవచ్చు, వైద్యసదుపాయాలు కూడా ఉచితంగా అందిస్తారు. ఆయన భద్రతను దిల్లీ పోలీసులు చూసుకుంటారు. 10 రాజాజి రోడ్డులో ఉన్న ప్రస్తుత బంగ్లాను కలాం చనిపోయిన తర్వాత కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్‌ శర్మకు కేటాయించారు. ప్రణబ్‌ముఖర్జీ పదవీ విరమణ కావడంతో కేంద్రమంత్రికి వేరే బంగ్లాను కేటాయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com