అర్మేనియా డైరీ పార్ట్ -4 ఆఖరి భాగం

- July 27, 2017 , by Maagulf


ప్రపంచంలో రికార్దు చేయబడిన జాతి హత్యల ఘటనల్లో అర్మేనియా జెనోసైడ్ మొదటిది.భోజనం తర్వాత నేను జెనోసైడ్ మ్యూజియం చూడాలని లక్ష్మణ్ గారికి చెప్పటంతో ఆయన ఆ విషయాన్ని డ్రైవర్ కి చెప్పారు. 16 వ శతాబ్దం నుండి 19 వ శతాబ్దం వరకు అర్మేనియా పశ్చిమ భాగం టర్కీ ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.దీనిని టర్కిష్ అర్మేనియా అని పిలిచేవారు. ఆ సమయంలోనే రుస్సో - పర్షియా యుద్ధాలు జరగటం కొంతమంది ఆర్మేనియన్లు ఆ యుద్ధాల్లో రష్యన్లకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే నెపంతో 1895 నుండి 1920 వరకు పలుదఫాలుగా టర్కీ పాలకులు అక్కడ నివసించే వారిని మట్టుబెట్టటం ప్రారంభించారు. 1915-20 కాలంలో అత్యంత ఎక్కువగా 15 లక్షలమందిని వివిధ రకాల పద్ధతుల్లో చంపటం జరిగింది. ఆఖరున సిరియా ఎడారిలో లక్షల మందిని నడిపించి దారిలోనే వారిని చంపేశారు. ఈ అతి పెద్ద మానవ హననం ఆర్మేనియన్ జెనోసైడ్ గా పేరొందింది. దీనికి సంభందించిన మ్యూజియం యెరవాన్ నగరం మధ్యలో ఉంది. ఆ ఊచకోత తరువాత 1918 నుండి అర్మేనియా రష్యా ఆధీనంలోకి వెళ్ళిపోయింది. 1990 వరకు సోవియట్ యూనియన్ లో సభ్య దేశంగా ఉంది.1991 నాటికి సోవియెట్ రిపబ్లిక్ విచ్చిన్నమయ్యాక స్వతంత్ర దేశంగా అవతరించింది. 1985 లో ఈ ఆర్మేనియన్ జెనోసైడ్ ని అధికారికంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి ఒక రిపోర్ట్ పంపారు. కానీ టర్కీ మరియు దాని మిత్ర దేశమైన అజర్బైజాన్ జెనోసైడ్ అనే పదం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాయి.1995 లో ఈ జెనోసైడ్ మ్యూజియం స్థాపించి, 1997 నుండి పలువురు విద్యార్థులు దీని మీద రీసెర్చ్ చేసి నివేదికలు సమర్పించగా 2017 నాటికి ప్రపంచంలో 29 దేశాలు ఆర్మేనియన్ జెనోసైడ్ ని అధికారికంగా గుర్తించాయి. ఇప్పటికీ మిగతా దేశాలన్నిటి గుర్తింపు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్మేనియన్లు పోరాడుతున్నారు. ఈ వివరాలన్నింటినీ సచిత్రంగా మ్యూజియంలో భద్రపరిచారు. భార్గవి కి ఇలాంటివి అంటే భయంఅందుకే తాను అలాంటివి చూడలేనని కార్లోనే ఉంటానని చెప్పింది. నేనొక్కడినే లోపలికి వెళ్లి అక్కడ ఉంచిన ఫోటోలు అన్నీ చూసి వచ్చాను.నేను ఇంతకుముందు పోలాండ్లో చూసిన యూదు కాన్సంట్రేషన్ కాంపుల్లో ఉన్న ఫొటోల్లాగే ఇక్కడ కూడా చంపబడిన వారి ఫోటోలుమూకుమ్మడి హత్యల శవాలుపుర్రెలు అన్నీ వీడియో మరియు ఫోటోల రూపంలో ఉన్నాయి. ప్రపంచంలో రికార్దు చేయబడిన జాతి హత్యల ఘటనల్లో అర్మేనియా జెనోసైడ్ మొదటిది.

అక్కడినుండి మా తదుపరి గమ్యం ఖోర్ విరాప్ అనే మరో క్రైస్తవ ఆశ్రమం. ఇది యెరవాన్ కి 40 కిలోమీటర్ల దూరంలో టర్కీ బోర్డర్ కి దగ్గరగా అరారత్ పర్వత భాగంలో ఉంది. యెరవాన్ నుండి అరారత్ వరకు లేన్ల రహదారి ఉంది. ఆ రహదారిలో ఎటువంటి అడ్డంకులు లేకుండా35 కిలోమీటర్లు ప్రయాణించాక పోకర్ వేది అనే గ్రామం దగ్గర కిలోమీటర్లు లోపలికి వెళితే ఎత్తైన కొండపైన ఖోర్ విరాప్ కనిపిస్తుంది. క్రీస్తు శకంవ శతాబ్దంలో క్రైస్తవ మతబోధకులంతా ఇక్కడ నుండి మతబోధనలుప్రార్ధనలు నిర్వహించేవారు. అప్పటి రాజు త్రిడేట్ కూడా ఇక్కడ ముఖ్య మతబోధకుడైన గ్రెగరీ దగ్గర బాప్టిజం తీసుకున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇది చాలా ఎత్తైన కొండమీద ఉండటంతో పైకి వెళ్ళటానికి మెట్లతో పాటు రోడ్ కూడా ఉంది. మేము హన్ష్ ని ట్రాలీ లో తీసుకుని రోడ్ మీదుగా పైకి వెళ్ళాం. అక్కడినుండి చూస్తే అరారత్ పర్వతాలు ఆకాశాన్ని తాకుతున్న అద్భుత దృశ్యం కనులవిందు చేసింది. ఈ ఖోర్ విరాప్ చుట్టూ అన్నీ పంట పొలాలుపచ్చిక బయళ్ళు ఉన్నాయి. కొంత దూరంలో ఫెన్సింగ్ వేసి ఉన్న టర్కీ సరిహద్దు కనిపించింది. అర్మేనియా కి టర్కీ కి సత్సభందాలు లేకపోవటం వల్ల ఈ కంచే అని అర్ధం అయ్యింది. 643 వ సంవత్సరంలో ఈ చర్చి నిర్మాణం ప్రారంభించి ఒక్క చాపెల్ మాత్రమే నిర్మించారు. అందులోనే ప్రార్ధనలు జరిగేవి. తరువాత 1662 లో ఇప్పుడు ఉన్న పెద్ద చర్చి నిర్మించారు. మేము మొదటగా నిర్మించిన చాపెల్ లోకి వెళ్ళాం. అది చాలా చిన్నదిఅందులోనే భూమిలోపల ఒక మాళిగ ఉంది. తరువాత బయటకి వచ్చి పక్కనున్న పెద్ద చర్చి లోకి వెళ్ళాం. మేము ఫొటోస్ తీసుకోవటానికి ఇబ్బంది పడటం చూసి అక్కడున్న ఒక ఆర్మేనియన్ మా చేతుల్లో ఉన్న హన్ష్ ని తీసుకుని మీరు తీసుకోండి అని మాకు సైగల ద్వారా చెప్పాడు. అతనికి థాంక్స్ చెప్పి అన్నీ ఫోటోలు తీసుకుని బయటికి వచ్చాం.

ఏదైనా షాపింగ్ చెయ్యాలని డ్రైవర్ కి చెప్పటంతో మళ్ళీ యెరవాన్ వచ్చాక దల్మా మాల్ అనే షాపింగ్ మాల్ కి తీసుకెళ్ళాడు. అన్నట్లు చెప్పటం మర్చిపోయా అర్మేనియా లో దొరికే వైన్ మరియు బ్రాందీ చాలా ఫేమస్ మరియు చవక. ప్రతి సూపర్ మార్కెట్లోనూ ఇవి దొరుకుతాయి. అరారత్ వైన్ అనేది ఇక్కడ మంచి బ్రాండ్. నగరం మధ్యలోనే అతి పెద్ద వైన్ ఫ్యాక్టరీ తో పాటు విస్కీ బ్రాందీ తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడ లంచ్ మరియు డిన్నర్ లలో వైన్ అనేది సర్వ సాధారణం. కావాలంటే మనం వైన్ తయారు చేసే ఫ్యాక్టరీ ని కూడా చూడచ్చు. మేము ఇదే విషయం లక్ష్మణ్ గారికి చెప్పటంతో ఆయన వెంటనే డ్రైవర్ తో మాట్లాడి మరుసటి రోజు ఉదయం ఆ ఫ్యాక్టరీ ని సందర్శించే ఏర్పాట్లు చేశారు. ఇక ఆ రోజుకి మాల్ లో కొన్ని వస్తువులు కొనుక్కుని హోటల్ కి వెళ్ళిపోయాం.

మరుసటి రోజు ఉదయం టాక్సీ డ్రైవర్ మమ్మల్ని నేరుగా బ్రాందీ ఫ్యాక్టరీ దగ్గరకి తీసుకువెళ్ళాడు. యెరవాన్ అరారత్ బ్రాందీ ఫ్యాక్టరీ అనేది అర్మేనియాలో అతి పెద్ద వైన్ తయారీ దారు. ఇది నగరం నడిమధ్యలో అతి పెద్ద ప్రహరీ గోడతో ఉంటుంది. ఇది తయారు చేసే బ్రాండ్ పేరు నోయ్. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకి ఫ్యాక్టరీ లో ఇంగ్లీష్ గైడెడ్ టూర్ ఉంటుంది. కాకపోతే ముందు రోజు అప్పాయింట్మెంట్ తీసుకోవాలి. అంతకుముందే మా డ్రైవర్ ఫ్యాక్టరీకి కాల్ చేసి ఉదయం 10 గంటలకి అప్పాయింట్మెంట్ తీసుకున్నాడు.మేము వెళ్ళేటప్పటికి అక్కడ ఒక రష్యన్ మహిళ మమ్మల్ని రిసీవ్ చేసుకుంది. మాతో పాటు ఒక పోలాండ్ మహిళ మరియు మా గ్రూప్ లో ఇద్దరు వచ్చారు.కేవలం ఫ్యాక్టరీ చూడాలంటే 3500 డ్రాములు చెల్లించాలి. ఫ్యాక్టరీ చూడటంతో పాటు వైన్ కూడా రుచి చూడాలంటే మరో 1500 డ్రాములు అదనం. ఆ వైన్70 సంవత్సరాల వయసుది అట. మాములుగా బయట కొనాలంటే ఒక్క బాటిల్ ఖరీదు ౩౦౦౦ డాలర్లు. మేము మా ఇద్దరికీ 7000 డ్రాములు చెల్లించి కేవలం చూడటానికి మాత్రమే టికెట్ తీసుకున్నాము. మాతో పాటు ఉన్న పోలిష్ మహిళ మాత్రం 5000 చెల్లించి వైన్ రుచి చూసింది. మేము ఫాక్టరీ ఆవరణలోకి వెళ్ళగానే ఎదురుగా పెద్ద ఫిరంగి మరియు ఒక పాత కారు కనిపించాయి. రష్యన్ గైడ్ వాటి గురించి చెపుతూ 1877 లో నేర్సేస్ తైరాన్ అనే వ్యాపారి ఈ ఫ్యాక్టరీని స్థాపించాడు.మొదటి పది సంవత్సరాలు కేవలం వైన్ మాత్రమే తయారు చేసేవారు. 1887 నుండి బ్రాందీ తయారు చెయ్యటం మొదలు పెట్టాడు. 1899 లో నికోలావ్ అనే ఒక ఉక్రేనియన్ కి లీజుకి ఇచ్చాడు. నికోలావ్ అప్పటికే రష్యా లో అతి పెద్ద వైన్ తయారిదారు. తరువాతి కాలంలో నికోలావ్ 50000 రూబుల్స్ కి ఈ ఫ్యాక్టరీ మొత్తాన్ని కొనుకున్నాడు.1901 లో కొన్ని వైన్ సాంపిల్స్ ని పారిస్ లో జరుగుతున్న ఒక ఎగ్జిబిషన్ కి పంపాడు. అక్కడున్న వారంతా అది రుచి చూసి తయారీ దారు గురించి ఆరా తీయగా అది అర్మేనియా నుండి వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయారట. అప్పటి నుండి నుండి నికోలావ్ యూరప్ దేశాలకి ఎగుమతి చెయ్యటం ప్రారంభించాడు. తన జీవితం మొత్తం వైన్ మరియు బ్రాందీ తయారీల మీదే గడిపాడట. రష్యా అధ్యక్షుడు స్టాలిన్ ఈ వైన్ ని రుచి చూసినవాడే. ఒకసారి ఇంగ్లాండ్ అధ్యక్షుడు విన్స్టన్ చర్చిల్ కి ఓ సమావేశంలో ఒక గ్లాస్ బ్రాందీ ఇవ్వగా రుచిలో తేడాని గమనించి ఇది ఇంతకుముందు రుచిలా లేదు అనటంతో స్టాలిన్ వెంటనే ఆరా తీయగా ఫాక్టరీ కి సంభందించిన ముఖ్య సాంకేతిక నిపుణుడు ఖైదు చేయబడ్డాడనిఅందువల్లనే వేరే వాళ్ళు ఆ మిశ్రమాన్ని కలపటం వల్ల రుచిలో మార్పు వచ్చిందని తెలుసుకున్నాడు. వెంటనే అతన్ని విడుదల చేయమని చెప్పి మళ్ళి ఫ్యాక్టరీలో ఉద్యోగిగా నియమించాడట. కొన్ని సంవత్సరాలకి రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఈ ఫాక్టరీ అనేక కారణాలతో మూతబడింది.దాదాపు 50 సంవత్సరాల పాటు ఇది తెరుచుకోలేదు. మళ్ళీ 2002 లో 50 మిలియన్ డాలర్ల పెట్టుబడితో మల్టీ గ్రూప్ ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరించింది. ఆ పునరుద్ధరణలో ఫ్యాక్టరీని కోసం తవ్వుతుండగా దొరికినదే ఈ ఫిరంగి అని చెప్పింది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో పడిన కొన్ని బాంబులు ఆయుధాలు కూడా ఇక్కడ దొరికాయట. అక్కడున్న కార్ కూడా ఫ్యాక్టరీ మూతబడినప్పుడు వదిలేసినదే. లోపలికి వెళ్ళగానే ఈ ఫ్యాక్టరీ వ్యవస్థాపకులు వాడిన వస్తువులుకుర్చీలు అన్నీ ఒక గదిలో ప్రదర్శనకి ఉంచారు. అప్పట్లో వాళ్ళు వాడిన టెలిఫోన్ మంచం ఇంకా చాలా వస్తువులు అక్కడ ఉన్నాయి. అక్కడినుండి వైన్ నిల్వ ఉంచే స్టోర్ కి తీసుకు వెళ్ళింది. పాత సినిమాల్లో చూపించినట్లు అన్నీ చెక్క పీపాలలో వైన్ నిల్వ చేసి ఉంది. అది చాలా పెద్ద స్టోర్. అక్కడినుండే నేరుగా పైప్ లో బాట్లింగ్ కి వెళుతుంది. ఈ ఫ్యాక్టరీ బయటే ఒక స్టోర్ ఉంది. బయట కంటే ఇక్కడ కొంచెం తక్కువ ధరలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ50 ఇయర్స్ వైన్ కూడా తయారవుతోంది.నోయ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన బ్రాందీ బ్రాండ్.

ఇదే రోజున మా తిరుగు ప్రయాణం. సాయంత్రం 4గంటలకి ఫ్లైట్ కావటంతో మేము గంటకల్లా ఎయిర్పోర్ట్ కి చేరుకోవాలి. అప్పటికే భోజన సమయం కావటంతో దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేసి ఎయిర్పోర్ట్ కి పయనమయ్యాం. మాకంటే ముందుగా రెండేళ్ళ క్రితం మా గ్రామానికి చెందిన Gorrepati Narasimha Prasad గారుఈ దేశాన్ని సందర్శించటం వల్ల ఆయన ఇచ్చిన సలహాలు కూడా మా పర్యటనకి ఎంతో దోహదం చేశాయి. డాక్టర్ లక్ష్మణ్ కుమార్ గారి పరిచయం కూడా ఆయన వల్ల జరిగినదే.

అర్మేనియా లో నివాస ఖర్చు చాలా తక్కువ. ఒక కుటుంబానికి నెలకి అయ్యే ఖర్చు కేవలం 300 డాలర్లు.టూరిజం మీద ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా ఎక్కడా కూడా వ్యాపార ధోరణి కనపడదు. హోటల్స్భోజనం మరియు నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా మన దేశంలో కంటే చాలా తక్కువ. 
ప్రపంచంలో ఎక్కువకాలం నుండి మనుషులు నివసిస్తున్న నగరాల్లో యెరవాన్ ఒకటి. ఇంతటి పురాతన నగరాన్ని దేశాన్ని సందర్శించటం మాత్రం మరువలేని అనుభూతి. ఆ నాలుగు రోజుల అనుభవాలని ఆనందాన్ని మూటగట్టుకుని మళ్ళీ దుబాయ్ ఉరుకుల పరుగుల జీవితంలోకి వచ్చేశాం.

--రాజేష్ వేమూరి(దుబాయ్)

 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com