నేడు పాకిస్థాన్‌ ఆపద్ధర్మ ప్రధాని ఎన్నిక

- July 31, 2017 , by Maagulf
నేడు పాకిస్థాన్‌ ఆపద్ధర్మ ప్రధాని ఎన్నిక

పాకిస్థాన్‌ ఆపద్ధర్మ ప్రధాని పదవి కోసం ఆరుగురు పోటీ పడుతున్నారు. మంగళవారం జరగనున్న ఎన్నికల్లో పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌(నవాజ్‌) తరఫున షహీద్‌ ఖాకన్‌ అబ్బాసీ నామపత్రం సమర్పించారు. ఉమ్మడి అభ్యర్థిని నిలపడంపై ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అయిదుగురు నామపత్రాలు దాఖలు చేశారు. దిగువసభ నేషనల్‌ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 342 కాగా, విజయం సాధించడానికి 172 ఓట్లు రావాల్సి ఉంది. నవాజ్‌ పార్టీ, మిత్ర పక్షాలకు 209 సీట్లు ఉండడంతో అబ్బాసీ విజయం ఖాయంగా కనిపిస్తోంది.
పాక్‌ ఆపద్ధర్మ ప్రధాని అభ్యర్థి పైనా అవినీతి కేసు: పాకిస్థాన్‌ ఆపద్ధర్మ ప్రధాని అభ్యర్థి షహీద్‌ ఖాకన్‌ అబ్బాసీ కూడా అవినీతి ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్నారు. రూ.22 వేల కోట్ల విలువైన ద్రవీకృత సహజవాయువు (ఎల్‌ఎన్‌జీ) కాంట్రాక్టు మంజూరులో అవినీతికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై 2015లో జాతీయ జవాబుదారీ సంస్థ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోందని డాన్‌ న్యూస్‌ పత్రిక వెల్లడించింది. మరోవైపు విదేశీ విరాళాల కేసులో ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారుడు, ప్రతిపక్ష నేత ఇమ్రాన్‌ ఖాన్‌ సుప్రీంకోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించారని నవాజ్‌ షరీఫ్‌ పార్టీ ఆరోపించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com