సాయిశ్రీనివాస్‌ హీరోగా 'జయ జానకి నాయక' గీతావిష్కరణ

- July 31, 2017 , by Maagulf
సాయిశ్రీనివాస్‌ హీరోగా 'జయ జానకి నాయక' గీతావిష్కరణ

‘‘మ న సమాజంలో మహిళలకి ఎదురయ్యే ఒక ప్రధాన సమస్యని స్పృశిస్తూ సినిమాని తెరకెక్కించామ’’న్నారు బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జయ జానకి నాయక’. బెల్లకొండ సాయిశ్రీనివాస్‌ కథానాయకుడు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రగ్యాజైస్వాల్‌ కథా నాయికలు. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మాత. దేవిశ్రీప్రసాద్‌ స్వరకర్త. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో పాటల విడుదల కార్యక్రమం జరిగింది. తొలి సీడీని వి.వి.వినాయక్‌ ఆవిష్కరించారు. ట్రైలర్‌ని హర్షిత్‌, ద్వారక విడుదల చేశారు. అనంతరం బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘సినిమాకి ‘జయ జానకి నాయక’ పేరు పెట్టడం గురించి చాలా మంది అడిగారు. కొత్తదనంలో భాగంగానే ఆ పేరు పెట్టాం. ప్రేమించిన అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకొంటే... కుర్రాళ్లు వ్యసనాలకి బానిస కావడమో లేదంటే అమ్మాయిని ఇబ్బంది పెట్టడం వంటి సంఘటనల్ని సమాజంలో చూస్తూనే ఉన్నాం. కానీ నా తండ్రిని, నా అన్నని ఎలా జీవితాంతం ప్రేమిస్తానో, మనసిచ్చిన అమ్మాయిని కూడా అలా ప్రేమిస్తూనే ఉంటానని చెప్పే యువకుడిగా సాయిశ్రీనివాస్‌ కనిపిస్తాడు.
అతణ్ని తెరపై చూశాక ఇలాంటి కుర్రాడు మా ఇంట్లో ఉండాలనుకొంటారు. దేవిశ్రీప్రసాద్‌ మంచి సంగీతం అందించాడు. ఇందులో హంసలదీవిలో చేసిన ఓ పోరాట ఘట్టం చాలా బాగుంటుంది. మరో ఐదేళ్ల వరకు అలాంటి సన్నివేశాల్ని తెరపై చూడలేరు.
ఆ ఎపిసోడ్‌ చేయాలంటే 690 మంది యూనిట్‌ సభ్యులు నీళ్లలో నిలబడే ఉండాలి. అయినా సరే నాపై నమ్మకంతో వాళ్లు పనిచేశారు. ఇందులో రకుల్‌ పాత్ర చాలా బాగుంటుంది. కొన్నిచోట్ల ఆమెని చూసి కన్నీళ్లు పెట్టుకొంటారు.
వాణి విశ్వనాథ్‌, శరత్‌కుమార్‌, జగపతిబాబు పాత్రలు గుర్తుండిపోతాయి. మిర్యాల రవీందర్‌రెడ్డి మంచి నిర్మాత. నాకు కొన్ని ఒప్పందాలు ఉన్నాయి, అవి పూర్తయ్యాక ఆయనతో మరొక మంచి సినిమా చేస్తా. ఇలాంటి నిర్మాతలు పరిశ్రమకి చాలా అవసరం’’ అన్నారు.
వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ ‘‘సాయి శ్రీనివాస్‌ సినిమా అంటే తన తండ్రి బెల్లంకొండ సురేష్‌ ఎంత ఆత్రుతగా ఉంటారో, నేనూ అంతే ఆత్రుతగా చూస్తుంటా. సాయి ఈ సినిమాలో ‘నువ్వు ఏడిస్తే నేను వీడిని చంపేస్తా...’ అనే సంభాషణని చాలా పరిణతితో చెప్పాడు. బోయపాటి శ్రీనుకి అణువణువూ సినిమానే. తపనతో పనిచేస్తాడాయన.
దేవిశ్రీప్రసాద్‌ సమకూర్చిన ఏడు పాటలూ చాలా బాగున్నాయి’’ అన్నారు. దేవిశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘బోయపాటితో ఇది నాలుగో సినిమా. ప్రతిసారీ మంచి అనుభవం. ఇందులో ఎమోషన్‌, యాక్షన్‌ బాగుంటాయి.
రిషి పంజాబీ పనితనం చాలా బాగుంది. అల్లుడు శీనుకీ, ఈ సినిమాకీ సాయిశ్రీనివాస్‌లో చాలా వైవిధ్యం కనిపించింది. చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి మంచి సాహిత్యం అందించార’’న్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘‘నాకు సొంత అన్నయ్య ఉంటే బోయపాటిగారిలా ఉంటారేమో.
నా రెండో సినిమా అంతగా ఆడకపోయినా నాకు అండగా నిలిచి నాతో ఈ సినిమా చేశారు. ఆ విషయంలో ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. దేవిశ్రీప్రసాద్‌ అంటే నాకు ఇష్టం. ఇందులోని ప్రతి పాటా బాగుంది.
రకుల్‌ బాగా నటించింది. తన పాత్ర తప్పనిసరిగా కొన్ని రోజులు గుర్తుపెట్టుకొనేలా ఉంటుంది. ప్రగ్యా, కేథరిన్‌ అలరిస్తారు. ఈ సినిమా మాకు కీలకం.
మా నాన్నగారు నా కలని ఆయనదిగా భావించి నన్ను ముందుకు నడిపిస్తున్నార’’న్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘‘నేను చేసిన అన్ని పాత్రల్లోకెళ్లా భిన్నంగా ఉంటుంది ఇందులోని పాత్ర. ఒక దర్శకుడితో మళ్లీ మళ్లీ పనిచేయడం సంతోషాన్నిచ్చే విషయం’’ అన్నారు. మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల అంచనాలకి తగ్గకుండా సినిమా ఉంటుంది’’ అన్నారు.
చంద్రబోస్‌ మాట్లాడుతూ ‘‘నువ్వేలే నువ్వేలే... అనే పాటని ఇందులో రాశా. ఆర్తి, ఆర్ధ్రతతో కూడిన అర్థవంతమైన సందర్భానికి పాట రాసే అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నానని నమ్ముతున్నా’’ అన్నారు.
వాణి విశ్వనాథ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాతో తెలుగులో పునః ప్రవేశించడం నా అదృష్టం’’ అన్నారు. శరత్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘ఎన్నో రికార్డులు సృష్టించిన దర్శకుడు బోయపాటిశ్రీను. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, రకుల్‌, జగపతిబాబు తదితరులతో కలిసి నటించడం మంచి అనుభవం’’ అన్నారు. జగపతిబాబు మాట్లాడుతూ ‘‘మా హెడ్మాస్టర్‌ బోయపాటి శ్రీను.
రోజూ ఏం ఛాలెంజ్‌ ఇవ్వబోతున్నాడో అనుకొంటూ పనిచేసేవాళ్లం. డబ్బింగ్‌లోనూ ప్రతి సంభాషణనీ నాతో ప్రత్యేకంగా చెప్పించాడు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం తన మనసులాగే స్వచ్ఛంగా ఉంటుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ రూపంలో మరో స్టార్‌ పుట్టినట్టే.
ఇందులో ఒక చోట సంభాషణని చెప్పలేకపోయా. మూడు రోజులు ప్రయత్నించా కానీ రాలేదు. దాన్ని సక్సెస్‌మీట్‌లో చెబుతా’’ అన్నారు. శ్రీమణి మాట్లాడుతూ ‘‘ఇందులో ఐదు పాటలు రాశా.
ప్రతి సందర్భాన్ని ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. నేనూ ఆస్వాదిస్తూ పాటల్ని రాశా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ పద్మావతి, మిరియాల నవ్య, కోనేరు కిరణ్‌, ప్రేమ్‌రక్షిత్‌, నల్లమలుపు బుజ్జి, తిరుమల్‌ రెడ్డి, తరుణ్‌ అరోరా, టి.జి.విశ్వప్రసాద్‌, రిషి పంజాబీ, ఎ.ఎమ్‌.రెడ్డి, జెమినీ కిరణ్‌, పాలడుగు సుధ, బ్రహ్మయ్య, సాహి సురేష్‌, రామ్‌లక్ష్మణ్‌, శ్రావణ్‌, శశాంక్‌, భరణి, రత్నం తదితరులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com