మ్యాజిక్ డైరెక్టర్ దేవీశ్రీ కి బర్త్ డే విషెస్

- August 02, 2017 , by Maagulf
మ్యాజిక్ డైరెక్టర్ దేవీశ్రీ కి బర్త్ డే విషెస్

మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తాడు, స్టెప్పులతో అదరగొడతాడు..
దేవీ శ్రీ ప్రసాద్ .. పారే సెలయేరులా స్వచ్ఛమైన సంగీతానికి కేరాఫ్ లా ఉంటాడు.  ఉప్పొంగే తరంగాలు కూడా ఆ ఉత్సాహాన్ని చూసి చిన్నబోతాయి.. ఉరకలెత్తే ఉత్సాహం కూడా ఆ జోష్ కు ఆశ్చర్యపోతాయి. తెరవెనక సంగీత దర్శకుడిగా ఎంత మౌనంగా పనిచేస్తాడో.. వేదికపై మ్యూజిక్ డైరెక్టర్ గా అంత రెచ్చిపోతాడు. అసలతని జోష్ చూసి హీరోలే కుళ్లుకుంటారంటే అతిశయోక్తి కాదు. సంగీత దర్శకుడిగా దక్షిణాదిలో  తనదైన ముద్రవేసి, స్టార్ హీరోలందరి ఫస్ట్ ఛాయిస్ గా మారిన మన రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ పుట్టిన రోజు ఈ రోజు. 
కొందరికి కళ క్యాజువల్ గా అబ్బుతుంది. అంటే రాత్రింబవళ్లు ఔపోసన పట్టిన వారికంటే కూడా అది చాలా నేచురల్ గా వచ్చేస్తుంది. అస్సలేం కష్టపడలేదు అని చెప్పలేంగానీ, దేవీ శ్రీ ప్రసాద్ కూ సంగీతం అలానే అబ్బింది. అతని ఆసక్తిని గమనించిన తండ్రి సత్యమూర్తి మాండోలిన్ శ్రీనివాస్ వద్ద సంగీతంలో శిక్షణ ఇప్పించారు. అలా సంగీతంపై పట్టు సాధించి.. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు దేవీ శ్రీ ప్రసాద్. 
సంగీత దర్శకుడు కావాలంటే ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఎంత అనుభవం సంపాదించాలి.. ఎంత మంది వద్ద శిష్యరికం చేయాలి.. అనుకుంటారు. ఆ ట్రెండ్ ను బ్రేక్ చేసింది మాత్రం దేవీ శ్రీనే. నిర్మాత ఎమ్మెస్ రాజు చెవిలో దేవీ మ్యూజిక్ పడింది. చిన్నవాడు కదా అని తండ్రి సత్యమూర్తి అంటే, టాలెంట్ కు వయసుతో పనేంటని ఎమ్మెస్ రాజు పట్టుబట్టి మరీ తన 'దేవి' సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ను చేశాడు. పరిశ్రమ మొత్తం ఆశ్చర్యపోయేంతటి బాణీలూ ఇచ్చాడు. 
'దేవి' సినిమా 1999లో వచ్చింది. ఆడియో తో పాటు బ్యాక్ గ్రౌండూ సూపర్ హిట్. తర్వాత అదే ఏడాది 'నీకోసం' సినిమాకు ఆఫర్ వచ్చింది. కానీ సినిమా పోయింది.  సినిమా తీసిన దర్శకుడు శ్రీను వైట్ల కావడంతో దేవిశ్రీకి తిరుగులేని బ్రేక్ వచ్చింది. 
ఇక అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు దేవి. అప్పటి వరకూ ఉన్న, విన్న పాటలకంటే భిన్నమైన బాణీలిస్తూ మన్మథుడైనా, తొట్టిగ్యాంగ్ అయినా.. సంగీతమే తన ఊపిరి అన్న రేంజ్ లో దూసుకుపోయాడు.
అతని స్వరాలు.. అందమైన వర్షపు చినుకులు
సినిమా ఇండస్ట్రీలో కొన్ని సిగ్నేచర్స్ ఉంటాయి. అలాంటిదే 'వర్షం'. 'వర్షం' మాత్రమే కాదు.. సుకుమార్ తో చేసిన 'ఆర్య' కూడా దేవీ శ్రీలోని డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్ ను ఆవిష్కరించింది. ఈ రెండు సినిమాలు దేవీ కెరీర్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లాయి. ఆ రెండు సినిమాల్లోని పాటలు కొన్నేళ్ల పాటు యువత పెదాలపై అలవోకగా హమ్మింగ్ చేశాయి.
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతానికి అంత త్వరగా కనెక్ట్ కావడానికి కారణం అవి రాకింగ్ గా ఉంటూనే సంప్రదాయ సంగీతాన్నీ తలపిస్తాయి. సీన్ కూ సిట్యుయేషన్ కూ తగ్గట్టుగా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తాయి. యూత్ ఫుల్ మూవీ అయితే ఆర్యలా అదరగొడతాడు..లవ్ స్టోరీ అయితే సంగీత వర్షం కురిపిస్తాడు. సో.. దేవీ శ్రీ తన సంగీత వర్షంలో అందర్నీ తడిచి ముద్దయ్యేలా చేస్తాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com