రూ.40వేలకు పెళ్లి పేరుతో అమ్మాయి అమ్మకం

- August 24, 2017 , by Maagulf
రూ.40వేలకు పెళ్లి పేరుతో అమ్మాయి అమ్మకం

హైదరాబాద్‌: పాతనగరంలో అరబ్‌షేక్‌ల దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని పెళ్లి పేరుతో వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఇటీవలే ఓ యువతిని రూ.5లక్షలకు కొనుగోలు చేసి పెళ్లి పేరుతో ఓ ఒమన్ షేక్ అక్కడికి తీసుకెళ్లిన ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి అమ్మాయిల్ని నిఖా (పెళ్లి) పేరుతో వంచించడానికి వచ్చిన ఇద్దరు దుబాయ్‌ సోదరులతోపాటు ఇద్దరు స్థానిక వ్యక్తుల్ని సైబరాబాద్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
శంషాబాద్‌ డీసీపీ పద్మజ, మైలార్‌దేవుపల్లి ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్వర్‌ ఈ సంఘటన గురించి న వివరాలను మీడియాకు తెలిపారు. దుబాయ్‌కు చెందిన సలీం ఒబేద్‌ (52) పాతకార్ల వ్యాపారి. ఆగస్టు 10న హైదరాబాద్‌కు వచ్చిన ఇతడు పెళ్లిళ్ల బ్రోకర్‌ షఫీని సంప్రదించాడు. అందమైన అమ్మాయితో నిఖా జరిపిస్తే రూ.70 వేలు ఇస్తానన్నాడు. దీంతో అతడు మైలార్‌దేవుపల్లికి చెందిన ఓ అమ్మాయితో నిఖాకు ఒప్పించాడు.
షేక్‌ ఇచ్చిన సొమ్ములో రూ. 40 వేలు వారికిచ్చి రూ. 30 వేలు తాను తీసుకున్నాడు షఫీ. కాగా, నిఖాను స్థానిక హాజీతోనే జరిపించాల్సి ఉన్నా.. అతడిని కాదని తనకు నమ్మకస్థుడైన మరొకరిని పిలిపించి ఆరు రోజుల క్రితం నిఖా జరిపించాడు. కోరిక తీర్చుకుని దుబాయ్‌కు పారిపోయే ఉద్దేశంతోనే సలీం ఒబేద్‌ ఇలా చేసినట్లు దర్యాప్తులో తేలింది.
నిఖా ధ్రువీకరణ పత్రాన్ని ఆమోదం కోసం ముంబై పంపించినట్లు బాధిత కుటుంబాన్ని నమ్మించారు. ఈ ఆరురోజులు బాధితురాలితో గడిపిన షేక్‌ దుబాయ్‌ పారిపోయేందుకు సన్నాహాలు చేసుకున్నాడు. సలీం లాగే అతడి తమ్ముడు ఇబ్రహీం ఒబేద్‌ (48) కూడా హైదరాబాద్‌ బాట పట్టి బ్రోకర్‌ షఫీని ఫోన్‌లో సంప్రదించాడు.
తనకు బాలికల్ని మాత్రమే చూపించాలని కోరాడు. గత మంగళవారం ఇబ్రహీం రాజేంద్రనగర్‌కు వచ్చాడు. షఫీ తన వద్ద ఉన్న బాలికల చిత్రాల్ని చూపించడంతో ఓ బాలికను ఎంచుకున్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో బుధవారం రాత్రి నలుగురు నిందితుల్ని అరెస్ట్‌ చేశారు.
కాగా నిందితుల వద్ద పదుల సంఖ్యలో అమ్మాయిల ఫొటోలుఉండటం గమనార్హం. నిందితులు ఇప్పటికే ఇద్దరు యువతులను విదేశాలకు పంపారని, అక్కడ తమను హింసిస్తున్నారని వెంటనే తమను హైదరాబాద్ తీసుకురావాలని షఫీకి ఫోన్ చేసి బాధిత యువతులు వేడుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com