స్వర్ణ గణేషుడి దర్శనం కోసం బాలీవుడ్ తారలు క్యూ

- August 25, 2017 , by Maagulf
స్వర్ణ గణేషుడి దర్శనం కోసం బాలీవుడ్ తారలు క్యూ

ఆ గణనాథుడు బంగారు దేవుడు. కోటీశ్వరుడు. సెలబ్రిటీల ఆరాధ్యదైవం. ఆయన దర్శన భాగ్యం కలగాలంటే గంటలు, రోజుల తరబడి క్యూలో నిల్చోవాలి. గణేష్ ఉత్సవాల్లో అక్కడ ఇసుకవేస్తే రాలనంత జనం. ఇక నిమజ్జనం శోభాయాత్రలో సెలబ్రిటీలు కూడా తీన్మార్ స్టెప్పులేస్తారు. ముంబాయిలోని లాల్‌భగీచ రాజా గణేష్‌ మండపం విశిష్టత..

లాల్‌భగీచ రాజా గణేష్... ముంబాయిలో లాల్‌భాగ్‌లో కొలువు దీరారు. భారీ విగ్రహం... బంగారు తాపడం, స్వర్ణ కిరీటం, వజ్రాలు పొదిగిన పసిడి, వెండి ఆభరణాలు ధరించే వినాయకుడు. ఈ స్వర్ణ గణేషుడిని దర్శించుకోడానికి బాలీవుడ్‌ సెలబ్రిటీలంతా తరలివస్తారు...

ఏకదంతుడిని దర్శించుకోడానికి సామాన్య భక్తులు క్యూ కడతారు. ఇసుకవేస్తే రాలనంత జనం. గంటల తరబడి క్యూలో నిలబడి గజాననుడిని దర్శించుకోడానికి భక్తులు నిరీక్షిస్తారు. రోజూ సగటున లక్షన్నర మంది భక్తులు స్వామిని దర్శించుకోడానికి కిలోమీటర్ల పొడవున బారులు తీరుతారు. గత ఏడాది పదిరోజుల్లో 15 లక్షల మంది లాల్‌భగీచ గణేషుడిని దర్శించుకోవడం విశేషం..

వర్ధమాన నటుల నుంచి బిగ్ బి అమితాబ్ వరకు ప్రతి ఒక్కరూ లాల్‌భగీచ రాజా విజ్ఞేశ్వరుడిని దర్శించుకుని, హారతిలో పాల్గొని తరిస్తారు..ఈ వినాయకుడికి నవసచ గణపతిగా పేరుంది. అంటే కోరిన కోరికలు తీర్చే దేవుడు అని అర్థం. ఒక్కసారి ఈ గణేషుడిని దర్శించుకుని మనసులోని కోరికలు నివేదించుకుంటే తప్పక నెరవేరుతాయనేది భక్తుల నమ్మకం. కోరికలు తీరిన వారు మొక్కులు తీర్చుకుంటారు. ఇందుకోసం బంగారం, వెండి, వజ్రాలు, నగదు సమర్పించుకుంటారు. గత ఏడాది భక్తులు సమర్పించన కానుకల విలువ 7 కోట్ల రూపాయలు..

పది రోజులపాటు భక్తులకు దర్శనమిచ్చే లాల్‌భగీచ రాజా... నిమజ్జనం శోభాయాత్ర కూడా అత్యంత వైభంగా సాగుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తీన్మార్ స్టెప్పులేస్తారు.. లాల్‌భగీచ రాజా సార్వజనిక్ గణేష్ ఉత్సవ్ మండల్ ఏటా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్టిస్తుంది. 1934లోనే లాల్‌భాగ్‌ మార్కెట్లో మొదట విగ్రహ ప్రతిష్టాపనను మత్స్యకారులు, చిరువ్యాపారులు కలిసి చేశారు. ఇక స్వాతంత్ర్య పోరాటం ఉద్ధృతంగా కొనసాగుతున్న టైంలో గణేష్ ఉత్సవ్ మండల్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి క్రమంగా విగ్రహం ఎత్తును పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఇది 83వ విగ్రహం. గణేష్ విగ్రహ రూపకల్పన బాధ్యతను గత ఎనిమిది దశాబ్దాలుగా 
కంబ్లీ కుటుంబమే చూస్తోంది. ఎందుకంటే రత్నాకర్ కంబ్లీ తయారు చేసిన వినాయక విగ్రహాన్నే ఇక్కడ నెలకొల్పడం ఆనవాయితీగా మారింది. 1935లో మొదటిసారి ఆయన విగ్రహాన్ని తయారు చేయగా... ఆయన మరణం తర్వాత ఆ బాధ్యతను వారసులు కొనసాగిస్తున్నారు..
 
ఇక్కడ రెండు క్యూలైన్లు ఉంటాయి. ఒకటి నవసచి లైన్, రెండోది ముఖ్ దర్శన్ లైన్. భగవంతుడి పాదాలనుతాకి తమ కోరికలను నివేదించాలనుకునేవారు నవసచి లైన్‌లో వెళ్తారు. అయితే ఈ క్యూలో వెళ్లి దర్శనం చేసుకోవాలంటే 30 నుంచి 40 గంటల సమయం పడుతుంది. ఇక కేవలం గణేషుడిని దూరం నుంచి దర్శించాలనుకునేవారు ముఖ్ దర్శన్‌ లైన్‌లో వెళ్తారు. ఈ క్యూలో వెళ్లేవారికి దర్శనం కావడానికి 5 నుంచి 8 గంటల సమయం పడుతుంది. కొన్నిసార్లు 14 గంటలు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్యూలను కంట్రోల్ చేయడానికి 300 నుంచి 400 మంది సిబ్బంది ఉంటారు. ఇక భారీ రద్దీలో దర్శనం చేసుకోవడం కష్టం అని భావించేవారు టీవీల లైవ్ ద్వారా లాల్‌భగీచ రాజా వినాయకుడిని దర్శించుకుని తరిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com