మయన్మార్‌లో ఘోరం

- August 25, 2017 , by Maagulf
మయన్మార్‌లో ఘోరం

యాన్‌గాన్‌: మయన్మార్‌లోని రఖినీ రాష్ట్రంలో తీవ్రవాదులు భయోత్పాతం సృష్టించారు. దాదాపు 30 పోలీస్‌ పోస్టులు, ఆర్మీ బేస్‌ క్యాంప్‌లపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 71 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఇందులో 12 మంది భద్రతా విభాగానికి చెందిన అధికారులు కూడా ఉన్నారు. వందలమంది గాయాలపాలయ్యారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించింది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ దాడికి తామే కారణమంటూ అరకాన్‌ రోహింగ్యా సాల్వేషన్‌ ఆర్మీ(ఏఆర్‌ఎస్‌ఏ) అనే తీవ్రవాద సంస్థ ప్రకటించింది. దీనిని ఇంతకు ముందు హరఖా అల్‌ యాక్విన్‌ అని పిలిచే వారు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక బంగ్లా సరిహద్దులోని మాంటగావ్‌ పోలీస్‌స్టేషన్‌ను పేల్చివేశారని, అదే సమయంలో రఖినీలోని వివిధ పోలీస్‌స్టేషన్లపై దాడులకు పాల్పడ్డారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో దాదాపు 200 మంది తీవ్రవాదులు పాల్గొని ఉంటారని అంచనా వేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో మయన్మార్‌లో జరిగిన విధ్వంసకాండకూ ఈ తీవ్రవాద సంస్థే కారణం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com