'జమున' పుట్టినరోజు స్పెషల్

- August 30, 2017 , by Maagulf
'జమున' పుట్టినరోజు స్పెషల్

గోదారికి గట్టెంత అందమో ఆనాటి వెండితెరకు జమున అంత అందాన్ని తీసుకువచ్చింది. అందం, అభినయం, పొగరు, వగరు అన్నీ ఉన్న సత్యభామ జమున. జమున .. అప్పట్లో హలో మేడమ్ సత్యభామా అంటూ పాటలు కట్టారు సినీ కవులు. నన్నుదోచుకుందువటే అంటూ కాసేపు పాడి తెగ ఫీలయ్యాడు ఎన్టీఆర్. కనులు మూసినా నీవాయే అని చాలా చాలా హాపీగా బాధపడ్డాడు ఏఎన్నార్. చేతులు కలసిన చప్పట్లూ మనసులు కలసిన ముచ్చట్లూ అంటూ ఆమె చెలులతో చేరి పాడుతుంటే... తన్మయంలోకి జారిపోయారు ఆకాలపు ఆడియన్సు. ఒక్కమాటలో చెప్పాలంటే అప్పటి స్టన్నింగ్ బ్యూటీ ఆమె. ఇన్నేసి ఇమేజినేషన్స్ ను మూడక్షరాల్లో బంధించుకున్న జమున పుట్టిన రోజు నేడు.. 
జమున తెలుగమ్మాయి కాదు.. కానీ తెలుగు నటి అయింది. పుట్టింది కర్ణాటకలోని హంపీలో.. అయినా అచ్చతెలుగు ఆడపడుచు అయింది. పదహారణాల తెలుగు పాత్రలో ఒదిగిపోయింది. సినీ నటుడు జగ్గయ్యదీ ఆమెదీ ఒకే వూరు కావడంతో జమున కుటుంబానికి జగ్గయ్యతో పరిచయం వుండటం జమునకు అనుకోకుండా కలిసొచ్చింది. ఆయనే జమునను నాటకాల ద్వారా నటనా రంగంలోకి దించారు.. 
నాటకాల్లో జమున పేరు మార్మోగిపోయింది. ఖిల్జీ రాజ్య పతనం అనే నాటిక నటిగా ఆమెకు తొలి వేదికనిచ్చింది.. ఆ నాటికలో గుమ్మడి కూడా నటించడం విశేషం.. జమున ప్రతిభ పది మందిలోకి ఫాస్టుగా పాకడంతో ఆమెకు వెండితెర అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. పుట్టిల్లు ఆమె ఫస్ట్ మూవీ. అక్కడి నుంచీ సినీ రంగాన్ని తన పుట్టిల్లుగా చేసుకుని జమున చాలా దూరమే ప్రయాణించింది.
సత్యభామగా ఎన్టీఆర్ లాంటి మహానటుడ్ని సైతం హడలగొట్టింది. అందుకే నేటికీ, ఏనాటికీ మన తెలుగు వారికి శ్రీకృష్ణుడంటే ఎన్టీఆర్ ఎలాగో సత్యభామంటే జమునా అలాగే. అందుకే నాటి అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి లెజండరీలతో ఎన్నో పాత్రలు పోషించినా... బాగా పేరు తెచ్చిన పాత్ర మాత్రం సత్యభామదే. సత్యభామగా మరొకర్ని వూహించుకోలేం అన్నంతగా పాపులర్ అయిపోయింది జమున.
ఇక గుండమ్మ కథ లాంటి సినిమాలో పొగరుబోతు యువతిగా  ఆ తర్వాత మనసస్సు మార్చుకున్న ఇల్లాలిగా ఆమె నటన ఎంతో మెచ్యూర్డ్ గా కనిపిస్తుంది. జమున ప్రత్యేకత అదే. పాత్రను బట్టి అందులోకి పరకాయ ప్రవేశం చేయగలదు. అందుకే ఒక్కోసారి ప్రేక్షకులు తిట్టుకునేలా నటించే ఆమే.. తర్వాత వారితో కంటతడి పెట్టించడంలోనూ ఆకట్టుకుంటుంది. గులేభకావళికథ, ఇల్లరికం, లేతమనసులూ, మూగనోము... వంటి సినిమాల్లో వారెవ్వా జమున అని అనిపించిన నాయిక ఆమె. ఒక్కో సినిమాలో ఒక్కోరకమైన సమ్మోహన మంత్రం వేస్తూ ఆడియన్స్ ని అవలీలగా బుట్టలో పడేస్తూ వచ్చిన గ్లామరస్ యాక్ట్రస్ జమున.
అలాగే మూగనోము చిత్రంలోని పాత్రా ప్రత్యేకమైనదే. టీచర్ ట్రయినింగ్ పూర్తి చేసుకుని వూరు చేరే అమ్మాయి. మార్గమధ్యంలో హీరోగారితో పరిచయం... ప్రేమగా మారుతుంది. అక్కడి నుంచి కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో.. అన్ని మలుపుల్లోనూ జమున తన నటనతో ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. మూగమనసులు సినిమాలోని గోదారి గట్టుందీ పాటను తెలుగువారెవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. కానీ ఈ పాట కోసం ఎండలో కాళ్లు బొబ్బలెక్కేలా శ్రమించింది జమున. ఆ సినిమాలోనే గౌరిగా గోదారి యాసలో మాట్లాడుతూ నాటి ప్రేక్షకులను ఉర్రూతలూపింది. 
కొన్నేళ్లు గడిచాక, కొంత వయసు వచ్చాక.. ఆమె మెల్లిగా మెచ్యూర్డ్ పాత్రల వైపు మళ్లారు. ఆ తర్వాతే జమున చీరలు ఆ రోజుల్లో బాగా పాపులర్ అయ్యాయి. జమున చీరలంటూ బయట బోర్డులు పెట్టి మరీ అమ్మేవారు. కృష్ణ నిర్మించిన పండంటి కాపురం చిత్రంలో జమున పోషించిన రాణీ మాలినీ దేవి పాత్ర ఆమె కెరీర్ కో అద్భుతమైన ఫినిషింగ్. దేవిక, ఎస్వీ రంగారావు, గుమ్మడి వంటి మహామహులతో పోటీ పడి మరీ నటించింది. అలాగే బాపు తీసిన సంపూర్ణ రామాయణంలో జమున పోషించిన కైక పాత్ర ఓ అద్భుతమే.. 
లేత మనసులు తమిళ రీమేక్ చేస్తున్నప్పుడు అక్కడ నటించిన ఓ కొత్త హీరో చేసిన తప్పిదం వల్ల జమున మెడకు పెద్ద దెబ్బ తగిలింది. షూటింగ్ ఆపేసి తాత్కాలికంగా వైద్యం చేయించారు. కానీ కొన్నాళ్ల తర్వాత ఆ దెబ్బి తిరగబెట్టింది. మరోవైపు సినిమా పరిశ్రమలో కూడా సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ పరిణామాలు, ఈ మెడనొప్పి కారణంగా చివరగా ఎన్టీఆర్ చేసిన అక్బర్ సలీమ్ అనార్కలి, రామపట్టాభిషేకం చిత్రాల్లో నటించిన తర్వాత వెండితెరకు దూరమైంది. 
సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు రావడానికి ముఫ్ఫైయేళ్ల ముందే ఏ రాయితీలు లేకుండా హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుని స్థిరపడింది జమున.  మధ్యలో కొన్నాళ్లు రాజకీయాల్లోనూ అడుగుపెట్టినా అక్కడ రాణించలేకపోయారు. ప్రస్తుతం దేవుడినే కాలక్షేపంగా చేసుకుని కాలం వెళ్లదీస్తోన్న జమున మరింత కాలం ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుందాం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com