బాలయ్య చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు
- August 30, 2017
'సినీ పరిశ్రమపై చాలా మంది ఆధారపడుతుంటారు. వారికి ఉపాధి కల్పించాలంటే ఎక్కువ సినిమాలు రావాలి. అందుకే నేను వేగం పెంచాను' అన్నారు ప్రముఖ కథనాయకుడు బాలకృష్ణ. ఆయన నటించిన చిత్రం 'పైసా వసూల్'. పూరీ జగన్నాథ్ దర్శకుడు. శ్రియ, ముస్కాన్, కైరాదత్ కథానాయికలు. ఈ చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలకృష్ణ మాట్లాడారు. తన 101వ చిత్రం విశేషాలతో పాటు, ఎన్డీఆర్ జీవిత విశేషాలతో కూడిన చిత్రం గురించి పలు విషయాలు పంచుకున్నారు.
'తాజా ఆలోచనలతో ఈ సినిమా చేశా. 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత ఇలాంటి కథను ఎంచుకోవడానికి నా అనుభవమే కారణం. స్వతహాగా నేను తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాల్ని ఇస్తుంటాయి. ఒక కథని విన్నాక దాని గురించి ఓ నిర్ణయం తీసుకోవడానికి సమయం తీసుకొనే అలవాటు లేదు. నాతో ఎలాంటి సినిమా చేస్తే బావుంటుంది అనే విషయాన్ని దర్శకుడికే వదిలేస్తా. పూరీకి ఓ బ్రాండ్ ఉంది. ఆయన కథలు, పాత్రలు ప్రేక్షకుడికి బాగా నచ్చుతాయి'.
'థియేటర్‌కి వెళ్లానంటే నేనొక నటుడ్ని అనే విషయం మరిచిపోతా. సగటు ప్రేక్షకుడిగా ఈలలు వేస్తా, చప్పట్లు కొడతా. మల్టీప్లెక్స్ థియేటర్‌కి వెళ్లినా నా పద్ధతి మారదు. నేనే కాదు.. నా అభిమానులు కూడా అంతే. పరిశ్రమపై ఎంతో మంది ఆధారపడుతున్నారు. వారికి ఉపాధి దొరకాలంటే సినిమాలు చేయాల్సిందే. అందుకే వేగం పెంచాను. నా సినీ ప్రయాణం మొదలై 43 ఏళ్లు అయ్యింది. ఆరంభంలో నాన్నగారు చదువుపై దృష్టిపెట్టు అని చెప్పేవారు. నాణ్యమైన సినిమాలకు ప్రాధాన్యం ఇస్తూ చేశా. లేదంటే నా సినిమాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండేవి' అని బాలకృష్ణ చెప్పారు.
ఎన్టీఆర్ జీవిత కథతో తెరకెక్కబోయే సినిమా గురించి మాట్లాడుతూ.. 'రెండుమూడు రోజుల్లో దర్శకుడిని ప్రకటిస్తాం. సినిమా కూడా త్వరలోనే ప్రారంభం అవుతుంది. స్క్రిప్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. బంధువుల్ని, నాన్నగారి సహచరుల్ని, ఆయన దగ్గర పనిచేసిన అధికారుల్ని కలిసి వివరాలు సేకరిస్తున్నాం. ఈ మధ్య నేనూ చెన్నై వెళ్లి అక్కడ కొందర్ని కలిసి వచ్చా. నాన్నగారు సినిమా రంగానికి రాకముందు విషయాలు చాలా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి' అని అన్నారు.
'పని లేకపోతే పిచ్చిపడుతుంది నాకు. నా స్వభావానికి తగ్గట్టుగానే అవకాశాలు వస్తున్నాయి. ఉదయం 3.30 గంటలకే నిద్ర లేస్తా కాబట్టి లాంగ్ డే ఉంటుంది. నటుడిగా, ఎమ్మెల్యేగా, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా నేను చేస్తున్న పనులన్నీ సంతృప్తిని ఇస్తున్నాయి. నేర్చుకోవాలనే తపన నన్ను మరింత ఉత్సాహంగా ముందుకు నడిపిస్తుంటుంది. 43 ఏళ్ల అనుభవం నా వద్ద ఉన్నా ఇంకా నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనుకుంటా. ప్రతిక్షణం క్రమశిక్షణతో వ్యవహరించడం మర్చిపోను. నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చింది.. నిలబెట్టుకొన్నది అదే'.
'నంద్యాలలో తెదేపా విజయం నేను వూహించిందే. అదే జరిగింది. తెలుగు దేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి పనుల్ని చూసే ప్రజలు విజయాన్ని కట్టుబెట్టారు' అని బాలకృష్ణ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









