వర్షం కారణంగా జాగారం చేస్తున్న బెంగళూరు
- September 04, 2017
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరం తడిసి ముద్దవుతోంది. చినుకు పడితే చాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కంటి మీద కునుకు లేకుండా రాత్రంతా జాగరం చేస్తున్నారు. ఆదివారం రాత్రి 11.45గంటలకు ప్రారంభమైన వర్షం సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల వరకు ఏకధాటిగా కురిసింది. 73 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ డైరెక్టర్ సుందర్ మైత్రి తెలిపారు. కృష్ణరాజపురం, దేవసంద్ర, త్రివేణినగర తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. దారులు వాగుల్లా మారాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోకి నీరు చేరడంతో పుస్తకాలు తడిసిపోయాయి. థణిసంద్ర, యలహంక, హెబ్బాళ్, బసవనపుర, లాల్‌బాగ్, యడియూరు తదితర చెరువులు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాజకాలువల మరమ్మతు పనులు పూర్తి కాకపోవడంతో అలుగు పారిన నీరు నేరుగా ఇళ్లలోకి ప్రవహిస్తుంది. నీళ్లతో పాటు పాములు, కప్పలు, చెత్త ఇళ్లలోకి చేరుతుండడంతో స్థానికుల అవస్థలు అన్నీఇన్నీ కావు. రాత్రంతా స్థానికులు జాగారం చేసి వచ్చిన నీటిని డబ్బాల సాయంతో బయటకు తోడి పోస్తున్నారు. రిచ్‌మండ్ కూడలిలో రిచ్‌మెండ్ టవర్ నేల అంతస్తు పూర్తిగా నీటితో నిండిపోయింది. వాహనాలు నీట మునిగి పాడయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చిన వాననీటిని యంత్రాల సహాయంతో బయటకు పంపిస్తున్నారు. సుబ్రహ్మణ్యనగర, వసంతపుర చెరువు నిండి అలుగు పారడంతో లోతట్టు ప్రదేశాలు ముంపునకు గురయ్యాయి. పాలికె సిబ్బంది అక్కడికి వచ్చి ఇళ్లు, దారుల్లో నిలబడిన నీటిని బయటకు పంపిస్తున్నారు. కురుస్తున్న వర్షాలకు దారులు పాడై గోతులు పడ్డాయి. హెణ్ణూరు రైల్వేక్రాస్ దారిలో మోకాలి లోతున వాననీరు నిలిచి పోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఆదారిలో ఎక్కడ గుంత ఉందో తెలియని స్థితి నెలకొంది. చినుకు పడితే నగరంలోని ఏదో ప్రాంతం నీట మునుగుతోంది. పాలికె ఎన్ని ముందస్తు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది.
నగరంలో వర్షం నిలిచిన తరువాత రహదారుల మరమ్మతు పనులు చేపడతామని బెంగళూరు అభివృద్ధిశాఖ మంత్రి కేజే జార్జి తెలిపారు. కురుస్తున్న వర్షాలకు నగరంలో దారులు పూర్తిగా పాడై గుంతలు పడ్డాయని, వాటిని ఇప్పుడు పూడిస్తే మరలా గుంతలు పడతాయని తెలియజేశారు. వర్షం నిలిచే వరకు మరమ్మతు పనులు చేపట్టబోమని సోమవారం ఇక్కడ ఆయన విలేఖరులకు తెలిపారు. రహదారుల్లో వాననీరు నిలబడటం వల్ల గుంతలు పడుతున్నాయని, ఇరువైపుల ఉన్న కాలువల్లో పూడిక తొలగించక పోవడం అందుకు కారణమన్నారు. అక్కడక్కడ పూడిక పనులు చేపట్టి నీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రహదారుల పనుల కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రూ.800కోట్లు విడుదల చేశారని, వాన నిలిచిన తరువాత ఆ నిధుల్ని ఖర్చు చేస్తామన్నారు. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా నిపుణుల సహాయంతో శాశ్వత చర్యలు చేపడతామని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







