'స్పైడర్' సూపర్‌హిట్ ఖాయం అంటున్న అలనాటి సూపర్‌స్టార్ కృష్ణ

- September 15, 2017 , by Maagulf
'స్పైడర్' సూపర్‌హిట్ ఖాయం అంటున్న అలనాటి సూపర్‌స్టార్ కృష్ణ

 మహేష్‌బాబును చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని, సినిమా సినిమాకీ అతడు ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నాడని ప్రముఖ నటుడు, అలనాటి సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. మహేష్‌బాబు హీరోగా మురగదాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న స్పై థ్రిల్లర్ మూవీ 'స్పైడర్' ప్రీ రిలీజ్ వేడుక శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో అభిమానులు, చిత్ర ప్రముఖుల మధ్య అట్టహాసంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ తాను సినిమాల్లో నటించడానికి మద్రాస్ వెళ్లినప్పుడు తొలి అవకాశం తమిళ చిత్రంలోనే వచ్చిందని కానీ, తాను తమిళం నేర్చుకోకపోవడంతో ఆ అవకాశం చేజారిపోయిందన్నారు. ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు 'తేనె మనసులు' సినిమాతో తనను పరిచయం చేశారన్నారు. 350కు పైగా చిత్రాల్లో నటించిన తనను అభిమానులు ఎంతగానో ఆదరించారన్నారు. అలాంటి ఆదరణ ఇప్పుడు మహేష్‌బాబుకు కూడా తన అభిమానులనుంచి లభిస్తున్నందుకు చాలా సంతోషంగా వుందన్నారు. మురగదాస్ దర్శకత్వంలో విడుదలవుతున్న ఈ 'స్పైడర్' ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఉందని, మహేష్ ఎంతో చక్కగా తమిళం మాట్లాడారని, మురగదాస్ దర్శకత్వంలో మహేష్ తమిళంలో పరిచయం కావడం చాలా సంతోషంగా వుందన్నారు. ఎంతో కష్టపడి పనిచేసిన ఈ చిత్రం యూనిట్‌పై కృష్ణ ప్రశంసల జల్లులు కురిపించారు. ఈ చిత్రం తప్పకుండా సూపర్ డూపర్ హిట్ అవుతుందని కృష్ణ ధీమా వ్యక్తం చేశారు. 
ఈ వేడుకలో కృష్ణతో పాటు విజయనిర్మల, మహేష్‌బాబు, ఆయన సతీమణి నమ్రత, దర్శకుడు మురగదాస్, కథానాయిక రకుల్ ప్రీత్‌సింగ్, దర్శకుడు వంశీ పైడిపల్లి, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మహేష్ తనయుడు గౌతమ్, కుమార్తె సితార ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో అతడి అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.
చిత్రం..శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన స్పైడర్ సినిమా ప్రీ రిలీజ్
ఫంక్షన్‌లో పాల్గొన్న సీనియర్ నటుడు కృష్ణ, హీరో మహేశ్‌బాబు, హీరోయన్ రకుల్‌ప్రీత్‌సింగ్.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com