పారిస్‌లో కార్మికలోకం కన్నెర్ర అధ్యక్షుడుపై ఆగ్రహం

- September 25, 2017 , by Maagulf
పారిస్‌లో కార్మికలోకం కన్నెర్ర అధ్యక్షుడుపై ఆగ్రహం

- లక్షలాదిమందితో నిరసన ప్రదర్శనలు 
- మాక్రాన్‌పై ఆగ్రహం 
 కార్మిక హక్కులను కాలరాచేలా అధ్యక్షుడు మాక్రాన్‌ జారీ చేసిన కొత్త డిక్రీలను నిరసిస్తూ వేలాదిమంది ప్రజలు ఆదివారం పారిస్‌లో బ్రహ్మాండమైన ప్రదర్శన నిర్వహించారు. అధ్యక్షుడి కొత్త డిక్రీలతో ఇప్పటివరకు కార్మిక హక్కులను పరిరక్షించేలా వున్న కాంట్రాక్టులు ఇకపై చిత్తు కాగితాలుగా మారిపోనున్నాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వామపక్ష నేత జేన్‌ లాక్‌ మెలంకెన్‌ నేతృత్వంలోని ''ఫ్రాన్స్‌ అన్‌బౌడ్‌'' పార్టీ ఈ నిరసన ప్రదర్శనను నిర్వహించింది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, అధ్యక్షుడు మాక్రాన్‌ తక్షణమే ఈ డిక్రీలను విరమించుకోవాలని మెలంకెన్‌ కోరుతున్నారు. శుక్రవారం ఈ డిక్రీలపై అధ్యక్షుడు మాక్రాన్‌ సంతకాలు చేశారు. ఆమోదం నిమిత్తం పార్లమెంట్‌కు పంపించారు. అంటే ఇక వీటి సవరణకు అవకాశం కూడా లేనట్లే. పరిశ్రమలవారీగా కార్మికులు మూకుమ్మడిగా బేరసారాలకు పాల్పడే అవకాశాన్ని కోల్పోతారు. యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఈడిక్రీలు యజమానులను అనుమతిస్తాయి. అవసరం లేదనుకుంటే కార్మికులపై వేటు వేసే అవకాశం కూడా యజమానులకు వుంటుంది. దాదాపు లక్షా 50వేల మంది కార్మికులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. కార్మికులనుద్దేశించి ప్రసంగిస్తూ మెలంకెన్‌, ఇక్కడితో ఈ పోరాటం ముగిసిపోదని, ఇది ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. 1789లో ఫ్రెంచి విప్లవం గౌరవార్థం ఇక్కడ నిర్మించిన డీ లా రిపబ్లిక్యూ వద్ద బహిరంగ సభ జరిగింది. ''రాజులను నేలకూల్చిన వీధి ఇది. నాజీలను తొలగించిన నేల ఇది. తాజా పరిస్థితుల్లో కాంట్రాక్టులు కేవలం చెత్త కాగితాలుగా మారుతున్నాయని విమర్శించారు. అత్యంత వేగంగా కార్మిక చట్టాల్లో మార్పులను తీసుకువస్తూ అధ్యక్షుడు వ్యవహరించిన తీరు నియంతృత్వపు పోకడలను తలపిస్తోందని విమర్శించారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే కార్మిక వర్ఘం మూడోసారి ఆందోళనకు దిగడం వారి ఆగ్రహాన్ని ్తతేటతెల్లం చేస్తోంది. గురువారం నాటి ప్రదర్శనలో దాదాపు లక్షా 32,000 మంది పాల్గొన్నారని ఆయన చెప్పారు. ఫ్రాన్స్‌లో ఏం జరుగుతోందో యూరప్‌ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. వచ్చే శనివారం జరగనున్న మరో ఆందోళనలో పెద్ద సంఖ్యలో పాల్గొనాల్సిందిగా ఆయన తన మద్దతుదారులను కోరారు. 'మీరు మా జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. కలలు కనకుండా మీరు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. మీకు నిద్ర లేకుండా మేం చేస్తాం.'' అన్న సందేశాన్ని కార్మిక లోకం గట్టిగా, స్పష్టంగా పాలకులకు పంపాలని పిలుపునిచ్చారు. 
- మాక్రాన్‌కు తగ్గిన ప్రజాదరణ 
- ఎన్నికల్లో ఎదురుదెబ్బ 
ఆదివారం జరిగిన సెనెట్‌ ఎన్నికల్లో మాక్రాన్‌ కొత్త సెంట్రిస్ట్‌ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. పార్లమెంట్‌ ఎగువ సభ అయిన సెనెట్‌లో మితవాద రిపబ్లికన్స్‌ పార్టీ తన ఆధి పత్యాన్ని మరింత బలపరుచుకుంది. అయితే మాక్రాన్‌ తాను అమలు చేయదలచుకున్న ఆర్థిక సంస్కరణల ఎజెండాను ముందుకు తీసుకెళ్ళడాన్ని ఇదేమీ ప్రభావితం చేయకపోవచ్చని భావిస్తున్నారు. ఇటీవలి నెలల్లో మాక్రాన్‌కు ప్రజాదరణ తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో ఎన్నికల పరంగా కూడా దెబ్బ తగిలింది. రిపబ్లికన్ల తరపు అధ్యక్ష అభ్యర్థిగా భావిస్తున్న లారెంట్‌ వాక్విజ్‌ ఈ ఫలితాలపై స్పందిస్తూ, మాక్రాన్‌కు ఇది మొదటి హెచ్చరిక అని వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com