64 ఏళ్ల ఉన్మాది..ఎందుకు కాల్చాడో తెలుసా?

- October 03, 2017 , by Maagulf
64 ఏళ్ల ఉన్మాది..ఎందుకు కాల్చాడో తెలుసా?

మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేద్దామనుకున్నారు. కాని అదే తమరి చివరి మజిలీ అని ఊహించలేకపోయారు. సరదాలు, సంతోషాలతో హడావుడిగా కనిపించే లాస్ వేగాస్.. ఒక్కసారిగా తుపాకీ పేలుళ్లతో వణికిపోయింది. స్టీఫెన్ పడాక్ అనే దుర్మార్గుడు.. ఏకంగా 50 మందిని బలితీసుకున్నాడు. ఇంతకీ పడాక్.. ఎందుకు కాల్పులకు పాల్పడ్డాడు? అసలు అతడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటో చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది.

అప్పటివరకు చెవులు హోరెత్తించే సంగీతం
అంతలోనే తుపాకీ పేలుళ్లు
ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు
కాని, 58 మంది తుపాకీ తూటాలకు బలైపోయారు
500 మందికిపైగా గాయాలు 
అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణమైన, రక్తసిక్తమైన ఘటన ఇది.
ఈ దుర్మార్గానికి ఒడిగట్టింది ఒక్కడే.. స్టీఫెన్ పడాక్.

స్టీఫెన్ పడాక్. కుర్రాడేమీ కాదు. 64 ఏళ్ల వయసున్న వృద్దుడే. లాస్ వెగాస్ కు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మెస్ క్వైట్ అనే ఓ టౌన్ లో మరో మహిళతో కలిసి ఉండేవాడు. గత నెలలోనే అంటే.. సెప్టెంబర్ 28 నుంచి అతడు.. లాస్ వెగాస్ లోని మాండలే బే హోటల్ లో ఉంటున్నాడు. స్టీఫెన్ పడాక్ ఏమీ సామాన్యుడు కాదు. బాగా డబ్బున్నవాడే. గతంలో అకౌంటెంట్ గా పనిచేశాడు. 

పడాక్.... జీవితాన్ని మరీ ఎంజాయ్ చేశాడని చెప్పలేం కాని.. రిటైర్మెంట్ తరువాత మాత్రం సాధారణ జీవితం గడుపుతున్నాడు. స్టీఫెన్ పడాక్ కు ప్రైవేట్ పైలెట్ లైసన్స్ ఉంది. గన్ లైసెన్స్ కూడా ఉంది. పేరుకు గన్ లైసెన్స్ ను తీసుకున్నా.. ఇంతకుముందు ఎలాంటి నేర చరిత్రా లేదు. మరి తుపాకులు ఎందుకు కొన్నట్టు? పడాక్ రూం నుంచి అధికారులు.. 19 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేని పడాక్ కు ఇన్ని తుపాకులతో ఏంటి పని? ఎఫ్.బి.ఐ.కి ఇప్పుడిదే అర్థం కావడం లేదు. 

పడాక్ రూం నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకుల్లో ఎక్కువ భాగం.. ఈ ఏడాది కొన్నవే అని విచారణలో తేలింది. వీటిని నార్త్ లాస్ వేగాస్ లోని న్యూ ఫ్రంటైర్ ఆర్మరీ నుంచి కొన్నట్టు తెలిసింది. వీటికి ఎఫ్.బి.ఐ. తో పాటు ఇతర అనుమతి పత్రాలూ కూడా ఉన్నాయి. కాకపోతే.. ఈ గన్స్ నుంచి వచ్చే సౌండ్ కి, ఘటనా స్థలంలో వచ్చిన గన్స్ సౌండ్ కి పోలిక లేదు. పైగా అంత కెపాసిటీ కూడా ఉండవంటున్నారు అధికారులు. పడాక్ ఇంట్లో పేలుడు పదార్థాలు, అతడి కారులో అమ్మోనియం నైట్రేట్ ని స్వాధీనం చేసుకున్నారు. 

మరణ మృదంగం మోగించిన తరువాత పడాక్.. తనను తాను కాల్చుకున్నాడు. అతడికి గతంలో ఎలాంటి మానసిక సమస్యలు లేవని తెలుస్తోంది. కాకపోతే.. పడాక్.. ఓ ప్రొఫెషనల్ గ్యాంబ్లర్ అని చెప్పాలి. కొన్నాళ్లుగా ఒంటరితనంతో పడాక్.. బాధపడుతున్నాడు. ఆ మానసిక ఆవేదన.. ఇలాంటి విపరీత చర్యకు పురిగొల్పిందా అని అధికారులు ఆరాతీస్తున్నారు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదించడంలో పడాక్ ఆరితేరిపోయాడు. చాలా అపార్ట్ మెంట్లు, ఇళ్లు ఉన్నాయి. 

పడాక్ రెండుసార్లు పెళ్లి చేసుకున్నాడు. 1977లో తొలిసారిగా వివాహం చేసుకున్న పడాక్.. రెండేళ్లకే.. భార్యకు విడాకులిచ్చాడు. 1985లో రెండోసారి పెళ్లి చేసుకున్న పడాక్.. ఐదేళ్ల తరువాత తన భార్యకు విడాకులిచ్చాడు. ఆమె ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉంటోంది. కాని చాలా సంవత్సరాల నుంచి వీరి మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. పడాక్ కు పిల్లలు లేరు. తన ఇంటికి కూడా అప్పుడప్పుడు గర్ల్ ఫ్రెండ్ తో వచ్చేవాడంటున్నారు ఇరుగుపొరుగు. 

పడాక్ తమ వాడే అని.. ఐసిస్ అంటోంది. కానీ అధికారుల పరిశీలనలో అతడికి ఎలాంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేదని తేలింది. కానీ ఎప్పుడూ మూడీగా కనిపించేవాడని, అసలు.. పక్కనే ఉంటున్నా.. లేనట్టే ఉంటాడని అంటున్నారు ఇరుగుపొరుగువాళ్లు. అంటే అతడి ప్రవర్తన ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. పడాక్ కు వీడియో పోకర్ ఆడడం, బోటు షికారు చేయడం ఎక్కువ అలవాటంటున్నారు అతడి సన్నిహితులు. అతడే ఈ దారుణానికి పాల్పడ్డాడు అంటే నమ్మలేమంటున్నారు ఆయన కుటుంబ సభ్యులు. 

పడాక్ తండ్రి బెంజమిన్ పడాక్ ఒకప్పుడు బ్యాంకును దోచుకున్నట్టుగా తెలుస్తోంది. పైగా అతను మానసిక వ్యాధితో బాధపడుతూ తరువాత చికిత్స ను తీసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో స్టీపెన్ పడాక్ పై అతడి కుటుంబ విషాద నేపథ్యం ఏమైనా ప్రభావం చూపించిందా అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. అమెరికాలోని గన్ కల్చర్ ఎలాంటి విపరీత పరిణామాలకు దారితీస్తోందో అని చెప్పడానికి ఈ ఘటనే ఓ ఉదాహరణ. 

నెవడాలో తుపాకీలు కొనడానికి లైసెన్స్ అవసరం లేదు. కాకపోతే వాటిని కొనేటప్పుడు ఎంక్వైరీ మాత్రం ఉంటుంది. కొన్న ఆయుధాలను ప్రైవేటు గా అమ్ముకునే ఛాన్స్ కూడా ఉంది. ఇలా చాలామంది తుపాకులు కొనుక్కోవడం అమెరికాలో మామూలే. కాని.. ఈ వెసులుబాటు.. ఇలాంటి విషాద ఘటనలకు దారితీస్తుండడంతో.. గన్ కల్చర్ పై మరోసారి చర్చ జరుగుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com