మా అసోసియేషన్ ప్రెసిడెంట్ శివాజీరాజ్ వార్నింగ్....

- October 03, 2017 , by Maagulf
మా అసోసియేషన్ ప్రెసిడెంట్ శివాజీరాజ్ వార్నింగ్....

పోటీ అనేది ప్రతి రంగంలో ఉంటుంది. ఆ పోటీలో గెలవాలని అడ్డదారులు తొక్కితేనే ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ మధ్య కాలంలో ఇలా అడ్డదారుల్లో పోటీలో గెలవాలని చూస్తోన్న వాటిలో సోషల్ మీడియా ఒకటి.. చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూపిస్తూ.. అడ్డగోలుగా ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ.. సినిమా వారి వ్యక్తిగత జీవితాల్ని సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న వెబ్ సైట్స్, యూట్యూబ్ చానల్స్ కు లెక్కేలేదు. సినిమా వారిపై అసత్య ప్రచారం చేస్తూ వారి ప్రతిష్టను బజారుకీడుస్తోన్న ఇలాంటి సైట్స్ పైచట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నామని ప్రకటించారు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ మురళీ మోహన్. 

ఆ హీరో అసలు లైఫ్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.. ఈ హీరోయిన్ అందుకోసం ఎంత తీసుకుంటో తెలిస్తే షాక్ అవుతారు.. ఫలానా నటుడి భార్య ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. అంటూ వల్గర్ హెడ్ లైన్స్ తో ఈ మధ్య ప్రతి యూట్యూబ్ చానల్ ఇరిటేట్ చేస్తుంది. కొన్ని విషయాలు హెడ్ లైన్ కు పూర్తి విరుద్ధంగా ఉంటే మరికొన్ని.. ఏ మాత్రం వాస్తవం కాని వార్తలు ఉంటాయి. మరికొన్నిసార్లు ఇంకా దిగజారి యధేచ్చగా బూతులు కూడా వాడేస్తున్నారు కొందరు. వీటివల్ల ఎవరు ఇబ్బంది పడ్డారనేది వారికి అనవసరం.. కానీ ఆ టైటిల్ ను బట్టి వచ్చే సబ్ స్క్రైబ్స్ మాత్రమే ముఖ్యం. ప్రధానంగా ఇలాంటి వార్తలన్నీ కేవలం సినిమా వారిపైనే వస్తుండటం సాధారణమైపోయింది. ఇన్నాళ్లూ చూసీ చూడనట్టు వదిలేసినా ఈ మధ్య ఇలాంటి రాతలు మరీ శ్రుతిమించుతున్నాయి. దీంతో ఇక యాక్షన్ లోకి దిగింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. మరీ దిగజారుడు వార్తలు రాసే వెబ్ సైట్స్, యూట్యూబ్ చానల్స్ పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం సైబర్ క్రైమ్ ఎస్పీ సహాయం కూడా తీసుకుంది మా. 

సెలబ్రిటీస్ లైఫ్ గురించి కామన్ పీపుల్ లో కొంత క్యూరియాసిటీ ఉంటుంది. దాన్ని మరింత పెంచడం కోసం అసంబధ్ధమైన వార్తలతో దిగజారుడు రాతలు రాస్తున్నాయి కొన్ని సైట్స్. ఇక యూ ట్యూబ్ లో ఫోటోలు మార్ఫింగ్ చేసే క్రమంలో విషయం చెబుతున్న వారి కంటే ఆ విషయంలో లేని వారి ఫోటోస్ అప్ లోడ్ చేస్తున్నారు. దీని వల్ల కనిపించేవారి ప్రతిష్టకు భంగం కలుగుతుంది. అసలు ఎవరైనా మరొకరి జీవితంలోకి తొంగిచూడ్డం వరకూ ఓకే అనుకోవచ్చు. కానీ ఆ స్థాయి దాటి వెళ్లి తెలియని విషయాలను తెలిసినట్టుగా చూపించడమో రాయడమో అనేది ఖచ్చితంగా ఆక్షేపించాల్సిన విషయం.. 

సెకన్ కో సైట్ ఉత్పన్నం అవుతోన్న తరుణంలో.. నిమిషానికో గాసిక్ క్రియేట్ అవుతోన్న టైమ్ లో నిజంగా ఇలాంటి సైట్స్ కు అడ్డుకట్ట వేయడం సాధ్యమా..? అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ఎందుకంటే కామన్ పీపుల్ నుంచి సెలబ్రిటీస్ వరకూ గాసిప్స్ అంటే చెవి కోసుకుంటారు. ఇదే ఆయాసైట్స్ ఇప్పుడు రెచ్చిపోవడానికి ప్రధాన కారణం. తమ క్లిక్స్ ను, సబ్ స్క్రైబర్స్ ను పెంచుకోవడం కోసం దారి తప్పుకున్నారు కొందరు.. ఒకరిని చూసి మరొకరు అలాంటి బూతు టైటిల్స్ తో రెచ్చిపోతున్నారు. ఇప్పటికే మన దగ్గర వేల సైట్స్ ఉన్నాయి. మరి వీటిని కంట్రోల్ చేయడం సాధ్యమా అంటే చాలా వరకూ కష్టమైన పనే అని చెప్పాలి. అది కేవలం ఇండస్ట్రీకే కాదు.. పోలీస్ డిపార్ట్ మెంట్ కు కూడా ఇబ్బంది కలిగించేదే..

ఎదుటి వారిపై అభాండాలు వేయడం, తెలియని విషయాలను ప్రమోట్ చేయడం, పర్సనల్ లైఫ్ ను బజారుకీడ్చడం.. లాంటివి ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన విషయాలే. కానీ ఇవన్నీ కంట్రోల్ చేయడం ద్వారా కంటే వారి నైతికతను బట్టి ఆగుతాయి. నైతిక విలువలు అనే మాట కూడా ఇప్పుడు బూతులా ధ్వనిస్తోంది కాబట్టి.. కొన్ని రాతలు రోత పుట్టిస్తున్నాయనేది నిజం. ఈ  విషయాలు చూసీ చూడనట్టు వదిలేసినా.. దాన్ని అలుసుగా తీసుకుని అనైతిక రాతలు రాస్తున్నారు కొందరు. అందుకే ఇకపై ఇలాంటి వారిపై చట్టపరంగాచర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ గా చెబుతోంది మా. 

మా చెప్పిన మాట ఎలా ఉన్నా.. ఇండస్ట్రీ నుంచే ఈ సైట్స్ ను నిరోధించడం పూర్తిగా అసాధ్యమైతే.. కనీసం కంట్రోల్ చేయడమైనా అయ్యే పనేనా అనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. కనీసం కొంత కదలిక తీసుకురాగలిగితే.. కొందరైనా కంట్రోల్ గా ఉంటారు కదా అనేది సీనియర్స్ వాదన. ఏదేమైనా ఇలాంటి విషయాలు రాసేవారి నైతికతపై ఆధారపడి ఉంటాయి. వారిలో మార్పు వస్తే తప్ప ఇలాంటి బూతు రాతలు ఆగవనేది మాత్రం నిజం.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com