జనవరి1, 2018 నుంచి బీసీలకు చంద్రన్నపెళ్లికానుక పథకం
- October 10, 2017
ఏపీలో చంద్రన్న పెళ్లికానుక పథకానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. డెంగీ జ్వరాల నివారణలో వైద్యారోగ్యశాఖ అధికారుల పనితీరుపై సీఎం మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ, ఉచిత ఇసుక విధానం అమలు, పలు సంస్థల కోసం భూకేటాయింపులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అమరావతిలో వీఐపీలకు నిర్మించే ఇళ్ల డిజైన్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆరు గంటలపాటు సుదీర్థంగా సాగిన ఏపీ కేబినెట్ లో ప్రజాసంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బలహీన వర్గాల కోసం మరో కొత్త పథకాన్ని అమల్లోకి తెస్తోంది. ఇప్పటివరకూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతులకు మాత్రమే పరిమితమైన పెళ్లి కానుకను బీసీలకూ వర్తింపచేయనుంది. దీనికి సంబంధించి కేబినెట్ లో సుదీర్ఘ, ఆసక్తికర చర్చ జరిగింది. బీసీ యువతులకు పెళ్లి సమయంలో ప్రభుత్వం తరపున 35 వేల ఆర్ధికసాయం అందించనున్నారు. ఇప్పటి వరకూ ఎస్సీలకు 40 వేలు... ఎస్టీ, మైనార్టీలకు 50 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకి తెచ్చి... చంద్రన్న పెళ్లి కానుక పేరుతో అమలు చేయనుంది. జనవరి ఒకటో తేదీన సీఎం చంద్రబాబు కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. అయితే పథకం అమలుకు కనీస విద్యార్హతను పదో తరగతిగా నిర్ణయించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
అటు వైద్యారోగ్యశాఖ పనితీరుపై ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీఎం చంద్రబాబు...మరోసారి మండిపడ్డారు. డెంగీ జ్వరాల నియంత్రణలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. డెంగీని ముందుగా గుర్తించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా... వ్యాధుల నిర్దారణ సరిగా జరగడం లేదన్నారు. అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. ఎంత ఖర్చైనా.. విద్య, ఆరోగ్య విధానాలు మెరుగు కై కృషి చేస్తామని సీఎం తెలిపారు. సుమారు 160 కోట్ల రూపాయల వ్యయంతో ఎంపిక చేసిన మున్సిపల్ పాఠశాలల్లో వర్చువల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ఎన్నార్టీ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్, రెవిన్యూ శాఖలలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగ నియామకాలపై చర్చ జరిగింది. ఎంతమంది అవసరమో గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అటు ఉచిత ఇసుక విషయంలో ప్రజల్లో సంతృప్తి ఇంకా పెరగాలన్నారు బాబు.
సీఆర్డీఏతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కోసం భూకేటాయింపులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర వీఐపీలకు నిర్మించే ఇళ్లపైనా కేబినెట్ లో చర్చ జరిగింది. ఓ ప్రైవేట్ కంపెనీ తయారుచేసిన 10 రకాల డిజైన్లను మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. బుధవారం జరిగే సీఆర్డీఏ సమావేశంలో మంత్రుల అభిప్రాయాల మేరకు తుది డిజైన్లు ఎంపిక చేయనున్నారు.
ఎప్పుడూ సీరియస్ గా జరిగే కేబినెట్ మీటింగ్ లో.. చంద్రన్న పెళ్లి కానుక విషయంలో ఇద్దరు మంత్రుల మీద సీఎం చంద్రబాబు సైటెర్లు వేశారు. చంద్రన్న పెళ్లికానుకకు 35 వేలు సరిపోదని మంత్రి కేఈ చెప్పగా....యనమల జోక్యం చేసుకుని కేఈ మరోసారి పెళ్లి చేసుకుంటారేమో అన్నారు. అయితే కేఈ కంటే మీకే ఎక్కువ ఆసక్తి ఉన్నట్టుందని మంత్రి యనమలపై సీఎం చంద్రబాబు సెటైర్ వేయడంతో కాసేపు కేబినెట్ లో ఉత్సాహపూరిత వాతావరణం ఏర్పడింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







