అమెరికాలో బిజీబిజీగా చంద్రబాబు, సానుకూలంగా స్పందించిన ఎన్నారైలు.!

- October 19, 2017 , by Maagulf
అమెరికాలో బిజీబిజీగా చంద్రబాబు, సానుకూలంగా స్పందించిన ఎన్నారైలు.!

ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. తొలిరోజు అమెరికాలో పర్యటించిన సీఎం పలువురు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కంపెనీలు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్న ప్రవాసాంద్రులతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం చికాగో చేరుకున్న ముఖ్యమంత్రికి అక్కడి ప్రభుత్వ అధికారులు, ప్రవాసాంధ్రులు ఘనస్వాగతం పలికారు.

అమెరికాకు చెందిన సుమారు 80 ఐటీ సంస్థల నిర్వహకులతో చంద్రబాబు సమావేశమయ్యారు. అమరావతిలో ఐటీ రంగం అభివృద్ధిపై చర్చించారు. ఐటీ సిటీపై ఐటీ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ గారపాటి ప్రసాద్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. విశాఖపట్నాన్ని మెగా ఐటీ సిటీగా, అమరావతిని మేజర్ ఐటీ హబ్‌గా మార్చేందుకు సహకరించాలని ఐటీ కంపెనీ యాజమాన్యాలను సీఎం కోరారు. రాష్ట్రంలో తమ సంస్థలను నెలకొల్పేందుకు 60 కంపెనీలు ఆసక్తి చూపించాయి. తగిన స్థలం ఇవ్వడంతో పాటు మౌలిక సౌకర్యాలు కల్పిస్తే తక్షణమే కంపెనీలు నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నట్లు వివిధ సంస్థల సీఈఓలు తెలిపారు. కొత్త కంపెనీల ద్వారా రాబోయే కొద్ది రోజుల్లో 8వేల మందికి ప్రత్యక్షంగా.. 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. కంపెనీల ప్రతినిధులు చెప్పిన విషయాలు విన్న సీఎం మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

ఐటీ సంస్థల ప్రతినిధుల సమావేశంలో సీఎం మాట్లాడుతూ రెండు దశాబ్దాల క్రితం తాను తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు నాలేడ్జ్ ఎకానమీలో ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో గతంలో 30 ఇంజినీరింగ్ కళాశాలలుంటే వాటిని 300కు పెంచినట్లు తెలిపారు. ప్రపంచం నలుమూలలా ఎక్కడ చూసినా తెలుగువారు వేల సంఖ్యలో ఉంటారని.. ప్రత్యేకించి ఐటీలో మనవాళ్లదే హవా అని చెప్పారు. భారత్ లో సహజ వనరులు, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి, ఉద్యాన పంటలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అమెరికాలో ఏపీ నుంచి వచ్చిన చేపలు వినియోగించే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని.. 24 వేల కోట్ల రుణమాఫీ చేసి దేశంలో ఒక చరిత్ర సృష్టించామన్నారు. ఇది భారతదేశ చరిత్రలో అతిపెద్ద రుణమాఫీగా నిలిచిపోయిందని వివరించారు.

అమెరికా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబును తానా ప్రతినిధులు కలిశారు. అమెరికాలో 20 నగరాలలో 5కె రన్ నిర్వహిస్తున్నట్లు తానా ప్రతినిధులు తెలిపారు. 5కె రన్ కార్యక్రమాల ద్వారా వచ్చిన ఆదాయంతో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రికి వివరించారు. 2 మిలియన్ డాలర్లతో అమరావతిలో తానా భవన్ నిర్మించేందుకు ప్రతినిధులు ముందుకొచ్చారు. అందుకు అవసరమైన స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రిని తానా ప్రతినిధులు కోరారు. ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు.
చంద్రబాబుతో చికాగో స్టేట్ యూనివర్శిటీ చైర్మన్, డిపార్టుమెంట్ ఆఫ్ మేథమేటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్సెస్ ప్రొఫెసర్ రోహన్ అత్తెలె సమావేశమయ్యారు. యూనివర్శిటీ 150వ వార్షికోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది మే నెలలో జరగనున్న గ్రాడ్యుయేషన్ సెర్మనీలో పాల్గొనాలని చంద్రబాబును ఆహ్వానించారు. డైనమిక్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లో తమకున్న అనుభవం, ప్రావీణ్యాన్ని ఏపీలోని విశ్వవిద్యాలయాలకు అందిస్తామని ప్రొఫెసర్ రోహన్ ప్రతిపాదించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com