ఇళయరాజా సంగీత విభావరి ముచ్చట్లు

- November 06, 2017 , by Maagulf
ఇళయరాజా సంగీత విభావరి ముచ్చట్లు

1. కార్యక్రమం అనుకున్న దానికన్నా 2 గంటలు ఆలస్యంగా మొదలైంది. 6 గంటలకు ప్రారంభం అనుకున్నారు. దాదాపు 8 అయ్యింది. కాని అభిమానులు మాత్రం ఏమాత్రం కదలకుండా ఎదురు చూసారు. ఎంతో ఓర్పు కనబరిచారు. రాజా గారి కోసం ఆమాత్రం ఎదురు చూడటం పెద్ద గొప్పేం కాదు అన్నట్లు స్పందించారు.

2. దాదాపు 25 మంది హంగేరి కళాకారులు వివిధ వాయిద్యాలతో రాజా గారి పాటలకు సింఫనీ, స్ట్రింగ్స్ అందించి తెలుగు వారిని విస్మయ పరిచారు. ఇళయరాజా గారు వాళ్ల శ్రమను శ్రోతలకు చెప్పి వాళ్ల కష్టం అంతా మీకోసమే అని గుర్తు చేసారు. 

3. గురుబ్రహ్మ అనే శ్లోకం కోరస్ గాయనీమణులు ఆలపిస్తుండగా.. అనేక మందికి గురువు (గురూజీ గా పిలవబడే) ఐన ఇళయరాజా గారు తమదైన శైలిలో తెలుపు పంచె తెల్ల లాల్చీ, లేత పచ్చ శాలువా ధరించి వేదిక మీదకి వచ్చారు. ప్రాంగణం నలువైపులా ఉన్న అభిమానులకి రెండు చేతులెత్తి అభివాదం చేయగా, ప్రాంగణం అంతా హర్ష ద్వానాలతో నిండిపోయింది. అభిమానులని ఉద్వేగానికి గురి చేసింది.

4. రాజా గారు తమ ఆనవాయితీ ప్రకారం "జననీ జననీ" అనే కళ్యాణి రాగం లోని "తాయి మూకాంబిగ" అనే తమిళ చిత్రం లోని పాటతో షో ని స్వయంగా పాడి ప్రారంభించారు. కార్తీక మాసం నిండు చంద్రుడు సభాప్రాంగణం పైనుంచి దర్శనం ఇస్తుండగా "ఓం శివోహం" అంటూ ఇళయరాజా బృందం ఆలపించిన భక్తి గీతం శ్రోతలను భక్తి పారవశ్యాలకు లోను చేసింది.

5. అతిరధ మహారధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చిరంజీవి సతీ సమేతంగా విచ్చేసి మొదటి వరసలో కూర్చోగా, మోహన్‌బాబు, మంచు లక్ష్మి, దర్శకులు హరీష్ శంకర్, బోయపాటి శ్రీను, ఆర్ పీ పట్నాయక్ మరియు పలు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

6.  ఇళయరాజా గారి సమ్మేళనం లో దాదాపు 75 వాయిద్యకారులు పాల్గొన్నారు. ఒక ప్రత్యక్ష సంగీత కార్యక్రమం లో ఇంత మంది పాల్గొనడం, ఇంత మందిని ఒకే త్రాటిపైకి తేవడం అంత సులభం కాదు.

7. రాజా గారి సంగీత సభలలో అత్యధిక తెలుగు పాటలు ప్రదర్శించడం ఇది తొలిసారి, ఆయన స్వయంగా అత్యధిక తెలుగు పాటలు వేదిక మీద పాడటం ఇది తొలి సారి. అంతేకాదు, అసలు తెలుగు రాష్ట్రాలలో ఇళయరాజా గారి సంగీత కార్యక్రమం జరగడం కూడా ఇదే మొట్టమొదటిసారి.

8. జననీ జననీ, ఎన్నో రాత్రులొస్తాయి గానీ, కలయా నిజమా, మాటే మంత్రము పాటలను స్వయం గా ఇళయరాజానే గానం చేసి ప్రేక్షకులను ముగ్ధుల్ని చేసారు. 75 ఏళ్ల వయసులో కూడా చెక్కు చెదరనీ ఆయన గొంతులోని సరస్వతికి జనం నీరజనాలు అర్పించారు.

9. దాదాపు 35 పాటలలో అత్యధికం వేటురి గారు రాసినవే కావడం మరో గొప్ప విషయం. కానీ ఆయనను స్మరించుకోవడం మరువడం కాస్త విచారం.

10. ప్రేమ ఎంత మధురం పాటకు ఆత్రేయగారితో ఉన్న అనుభందాన్ని, వటపత్ర శాయికి పాటకు విశ్వనాథ్ గారి గొప్పతనాన్ని ఇళయరాజా గుర్తు చేసుకుని అభిమానులతో పంచుకుని వాళ్లకోసం చప్పట్లు కొట్టించారు.

11. మనో కి ఇళయరాజాకి మధ్య సంభాషణలు, చణుకులు, ప్రేక్షకులని గిలిగింతలు పెట్టాయి. ఇంత సంగీత కార్యక్రమం జరుగుతుంటే మాటలు వొద్దని, మాటలు కూడా పాటలలాగానే పాడాలని నవ్వులు పూయించారు.  

12. జల్లంత కవ్వింత కావాలి అనే పాట ప్రదర్శన తర్వాత రెండో చరణం ముందు వచ్చే మ్యూజిక్ తెర వెనుక కథ ని ఇళయరాజా తన ఆస్థాన మురళి (ఫ్లూటు) కళాకారులైన నెపోలియన్ గారు ప్రేక్షకులతో పంచుకున్నారు.

13. అబ్బనీ తియ్యనీ దెబ్బ పాటకు చిరంజీవి సైతం సగటు ప్రేక్షకునిలా మారి చిరునవ్వులు చిందిస్తూ ఆస్వాదించారు. ఈ పాటకు ప్రేక్షకులు వన్స్ మోర్ అంటూ కేకలు వేసారు.

14. మంచు లక్ష్మి గారు, ఇళయరాజా గారి ప్రతీ పాటకు, ఎంతో ఉత్సాహం ప్రదర్శిస్తూ, సోఫాలో కూర్చునే తన్మయంతో డాన్స్ చేసారు. 

15. చిత్ర గారు వేదిక మీదకి వచ్చి నిన్ను కోరి పాట అందుకోగానే స్టేడియం అంతా హోరెత్తిపోయింది. తెలుగునాట ఆమెకున్న అంతులేని అభిమానం బయటపడింది. ఇప్పటికీ నిత్య యవ్వనంగా ఆమె గాత్రం పలికింది. అభిమానులను ఆనందింపచేసింది.

16. ఇళయరాజాగారు మాటే మంత్రము పాడుతున్నప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. ఆయన చరణం సరిగ్గా అందుకోలేదు. కానీ ఎప్పటిలాగే రాజీ పడకుండా, మళ్ళీ టేక్ 2 అంటూ మళ్లీ పాడి సరిచేసుకున్నారు

17. ఓ ప్రియా ప్రియా అనే పాట ప్రదర్శించిన తర్వాత, సింఫనీ గురించి ప్రేక్షకులకు వివరిస్తూ, ముందు బృంద గాయకులను (కోరస్) మరియు బేస్ వయోలిన్ వరకే వినిపించి, తర్వత బృంద గాయనీమణులను మిగతా స్ట్రింగ్స్ వయోలిన్ లను కలిపి ఒక సారి వినిపించారు.  తర్వాత ఈ రెండూ కలిపితే సింఫనీ ఎలా అవుతుందో అందరిని ఒకేసారి పాడించి, అన్ని వాయిద్యాలు ఒకేసారి కలిసి వాయించమన్నారు. అదొక గొప్ప అనుభూతిగా మిగిలిపోయింది. ఈ పాటకి సింఫనీ నోట్స్ అంతా కేవలం పదే పది నిమిషాల్లో రాసాను అని చెప్పి సంభ్రమాశ్చర్యాలకు గురి చేసారు. ఆయనకి ఆయనే సాటి అని నిరూపించారు.

18. కేవలం మూడే స్వరాలు (స రి గ) ఆధారంగా చేసుకుని ఆయన స్వరపరిచిన పాటను ప్రదర్శించి డెమో చూపించారు. పల్లవి ఎలా పుట్టింది, చరణం ఎంత సవాలుగా తీసుకుని చేసింది కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇది ప్రోగ్రాం మొత్తానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

19. విచ్చేసిన ప్రతి ఒక్కరికీ తమ వద్ద నచ్చిన పాటల లిస్ట్ ఉంటుందని, కాని మన లిస్ట్ ప్రకారం మనం వెల్దాం అని మనో తో సరదాగా మాట్లాడి ప్రేక్షకులను శాంతపరిచారు. ఇలాంటి పిచ్చి ప్రేమ చూపించే అభిమానులు తనకు ఎప్పుడూ దొరకరు అంటూ తెలుగు అభిమానుల పట్ల తనకున్న అపారమైన ప్రేమని వ్యక్తం చేసారు. నాపాటలు అన్నీ మీ పాటలే అనీ, అవి నావి కాదని అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. 

20. ఆయన నోట చక్కని తెలుగు పలకడం తో అభిమానుల ఆనందానికి అవధులే లేకుండా పోయింది. రాజా సార్ ప్రతి మాటకి, ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ, కేరింతలు కొడుతూ అభిమానాన్ని చాటారు. ప్రాంగణం అంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది.

21. ఎస్ పీ బాలు గారు రావకపోవడం అతిపెద్ద లోటు గా కనిపించింది. ఆయన ఉండి ఉంటే, నూటికి వెయ్యి శాతం పరిపూర్ణత చేకూరేది.

22. సుందరమో అనే పాటలో ఆలపన ని మరొక సారి విజయ్ ప్రకాష్ తో పాడించారు. ఎందుకో ఎన్ని సార్లు విన్నా ఈ క్షణం మళ్లీ రాదు కదా అని వేదాతం చెప్పారు.

23. కొన్ని సాంకేతిక లోపాలు జరిగాయి, అనుకోని ధ్వనులు వచ్చాయి, మళ్ళీ పాడాల్సి వచ్చింది. రాజా గారికి కాస్త కోపం కలిగింది.  

24. కీరవాణి, ఎన్నో రాత్రులొస్తాయి, యమహో నీ, జానేదోనా, ఇందువదన, బలపం పట్టి, ఓ ప్రియా ప్రియా, మాటే మంత్రము పాటలకు విశేష స్పందన లభించింది.

25. రానున్న కాలంలో యూట్యూబ్ లో ఈ కచేరీ కి సంబంధించిన సరదా సన్నివేశాలు, రాజా గారి పాటలు, ఆయన వివరించిన సందర్భాలు మొదలైన వీడియోలు  ఖచ్చితంగా కొన్ని లక్షల మందితో మళ్లీ మళ్లీ చూసేలా చేస్తాయి.  

ఇలా చెప్పుకుంటూ పోతే 6 గంటలు సుదీర్ఘంగా సాగిన ఈ సంగీత ఝరి లో ఎన్నెన్నో విశేషాలు, ఎన్నో మధుర జ్ఞాపకాలు. తెలుగు సంగీత ప్రియుల గుండెల్లో చిరకాలం నిలిచే అనుభవైకవేద్యమైన అనుభూతిని మిగిల్చాయి.  కార్యక్రమం అయిపోగానే అప్పుడే అయిపోయిందా అని ప్రతీ ప్రేక్షకుడు భావించడం లో ఏమాత్రం అతిశయోక్తి గానీ, ఆశ్చర్యం గానీ లేదు. ఆయన మీద ప్రేమ అటువంటిది, ఆయన పాటలు చేసే మాయ అలాంటిది. ఇంత చక్కని కార్యక్రమాన్ని మన తెలుగు వాళ్ల కోసం మన నగరానికి ఇళయరాజా ని తీసుకొచ్చి, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందించిన టెంపుల్ బెల్స్ ఈవెంట్స్ వారికి, శ్రేయాస్ మీడియా వారికి మనసారా ధన్యవాదాలు తెలియచేయాల్సిందే.

 

--నవ్య.సి(మాగల్ఫ్ సీనియర్ రిపోర్టర్,హైదరాబాద్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com