ఒక విద్యార్ధి కలిగించిన అలజడి

- November 12, 2017 , by Maagulf
ఒక విద్యార్ధి కలిగించిన అలజడి

గురుగ్రామ్‌: సంచలనం సృష్టించిన ఏడేళ్ల బాలుడు ప్రద్యుమన్‌ హత్య కేసులో రోజుకో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వస్తూనే ఉంది. హత్య కేసులో సీబీఐ అదుపులో ఉన్న సీనియర్‌ విద్యార్థి వివిధ రకాల విషపదార్థాల గురించి అంతర్జాలంలో వెతికినట్లు సమాచారం. వాటిని ఎలా ఉపయోగించాలి, హత్య చేసిన తర్వాత కత్తి మీద వేలిముద్రలు ఎలా తీసేయాలనే దాని గురించి నెట్‌లో పరిశోధించినట్లు తెలుస్తోంది. విద్యార్థి దగ్గర నుంచి సీబీఐ అధికారుల స్వాధీనం చేసుకున్న మొబైల్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌ను పరిశీలించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
ప్రద్యుమన్‌ గొంతు కోసేందుకు ఉపయోగించిన కత్తిని హత్యకు ఒకరోజు ముందు సదరు విద్యార్థి కొనుగోలు చేసినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. దీనిపై సీబీఐ అధికారులు మాట్లాడుతూ.. విచారణ చాలా సున్నితమైన దశలో ఉందని తెలిపారు. ఇప్పుడే దీనిపై ఎటువంటి వ్యాఖ్య చేయలేమని సీబీఐ ప్రతినిధి అభిషేక్‌ దయాల్‌ తెలిపారు.
ప్రస్తుతం విచారణ నిమిత్తం విద్యార్థిని జువైనల్‌ హోమ్‌కు తరలించారు. సెప్టెంబర్‌ 8న గురుగ్రామ్‌లోని రేయాన్‌ అంతర్జాతీయ పాఠశాలలో ఏడేళ్ల బాలుడు ప్రద్యుమన్‌ను దారుణంగా గొంతు కోసి హత్య చేసిన విషయం తెలిసిందే. తొలుత ఈ హత్యను బస్సు కండక్టర్‌ అశోక్‌ కుమార్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. కానీ, ఇటీవల ఈ కేసు కీలక మలుపు తిరిగింది. పాఠశాలలో జరుగుతున్న పరీక్షను వాయిదా వేయించేందుకు ప్రద్యుమన్‌ను అదే పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి హత్య చేసినట్లు బయటకు వచ్చింది. అతడిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com