తెలంగాణ పీసీసీ అధ్యక్షురాలిగా డీకే అరుణ

- November 14, 2017 , by Maagulf
తెలంగాణ పీసీసీ అధ్యక్షురాలిగా డీకే అరుణ

కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు రాహుల్ చేపట్టాక టీ-పీసీసీలో కూడా భారీ మార్పులే జరుగుతాయన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఐతే, పీసీసీ పదవిని ఈసారి మహిళా నేతకే కట్టబెట్టే అవకాశాలున్నాయని గాంధీభవన్‌లో వార్తలు జోరందుకున్నాయి. ఇంతవరకూ తెలంగాణా కేబినేట్‌లో మహిళలకు స్ధానం కల్పించలేదని, అధికార టీఆర్ఎస్‌ని టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పడు తాము మహిళలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నామో చెప్పుకోవడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందన్నది హస్తం నేతల ఆలోచన. అందుకే గద్వాల జేజమ్మగా చెప్పుకునే డీకే అరుణ పేరు.. ఆ పార్టీ కేడర్లో వైరల్ అవుతోంది.
కొద్దినెలలుగా పీసీసీ మార్పుపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్న తరుణంలో అరుణ పేరు బయటికి రావడం ఆసక్తి రేపుతోంది. పీసీసీ మార్పు ఉంటుందని తెలంగాణా ఇన్‌చార్జి కుంతియా చెబుతుంటే, మార్పు లేకపోతే సీనియర్లు జారుకునే ప్రమాదం కూడా ఉందని ఢిల్లీకి సమాచారం వెళ్లింది. అందుకే పీసీసీని కూడా సమూలంగా ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. ఇటీవల చేరిన రేవంత్‌రెడ్డికి ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న తరుణంలో.. ఆయన జిల్లాకే చెందిన అరుణకు పీసీసీ బాధ్యతలు ఎలా ఇస్తారన్న వాదనా లేకపోలేదు.

ఒకే జిల్లాకు రెండు కీలక పదవులు ఎలా ఇస్తారని కొందరంటుంటే, ఇంతకాలం పీసీసీ, సిఎల్‌పి పదవులు ఒకే జిల్లాకు ఇవ్వలేదా అని మరికొందరు వాదిస్తున్నారు. మొత్తం మీద రాహుల్ పట్టాభిషేకం తర్వాత భారీ మార్పులు మాత్రం ఖాయంగా కనిపిస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com