లండన్ వీధుల్లో బలూచ్ నినాదాలు

- November 14, 2017 , by Maagulf
లండన్ వీధుల్లో బలూచ్ నినాదాలు

స్వాతంత్ర్యం కోసం బలూచిస్తాన్‌లో వెల్లువెత్తుతున్న ఆందోళనను అణిచివేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మళ్లీ గండిపడింది. 'వరల్డ్ బలోచ్ ఆర్గనైజేషన్' మరోసారి భారీ ఎత్తున ప్రచార ఉద్యమాన్ని లేవనెత్తింది. లండన్‌లోని ప్రజా రవాణా బస్సులను తన తాజా ప్రచార అస్త్రాలుగా మలుచుకుంది. 'బలోచిస్తాన్‌కి స్వాతంత్ర్యం ఇవ్వాలి' అన్న నినాదాలతో పోస్టర్లను బస్సులపై ప్రదర్శిస్తోంది. లండన్ వీధుల్లో ప్రభుత్వ బస్సులపై బలోచిస్తాన్ నినాదాలు హల్‌చల్ చేస్తుండడంతో... పాకిస్తాన్ గుండెలమీద మరోసారి కుంపటి రాజుకుంటోంది. వరల్డ్ బలోచ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి భవల్ మెంగల్ మాట్లాడుతూ...
''బలోచిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్తాన్‌పై అవగాహన కల్పించేందుకు లండన్‌లో మూడవ దశ ప్రచార ఉద్యమం చేపట్టాం. బలోచ్ ప్రజల స్వీయ నిర్ణయ హక్కును కాలరాస్తున్న పాకిస్తాన్‌ చర్యలను ఎండగడతాం. తొలుత మేము టాక్సీలపై ప్రకటనలతో ప్రారంభించాం. అనంతరం రోడ్డు పక్కన హోర్డింగులపై ప్రచారం చేశాం. ఇప్పుడు లండన్ బస్సులపై ప్రచారోద్యమాన్ని చేపట్టాం..'' అని పేర్కొన్నారు. గతంలో చేపట్టిన ప్రచారం ఉద్యమం సందర్భంగానూ పాకిస్తాన్‌ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఈ ప్రచారంలో చెబుతున్నవన్నీ ''అబద్ధాలేననీ...'', ఇది ''పాకిస్తాన్ వ్యతిరేక'' ప్రచారమని పాక్ అధికారులు మళ్లీ పాతపాటే అందుకోవడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com