ఇండిగో లో మళ్ళీ అలజడి

- November 21, 2017 , by Maagulf
ఇండిగో లో మళ్ళీ అలజడి

న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్స్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారుతోంది. ఈ ఎయిర్ లైన్స్ సంస్థ వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ప్రయాణికుల పట్ల సంస్థ సిబ్బంది తరచూ దురుసుగా ప్రవర్తిస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు.
ఇండిగో సిబ్బంది దురుసు ప్రవర్తనకు తాజాగా మరో ప్రయాణికురాలు బలైంది. ఈ ఘటన ఆదివారం గౌహతి విమానాశ్రయంలో చోటు చేసుకుంది. కృష్ణశర్మ అనే మహిళా న్యాయవాది ఫోన్ ను బలవంతంగా లాక్కున్న ఎయిర్ లైన్స్ సిబ్బంది అందులోని ఫొటోలను డిలీట్ చేయడానికి ప్రయత్నించారు.
దీనిపై ఆమె ఫిర్యాదు చేయడంతో.. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు ఉద్యోగులను సంస్థ విధుల నుంచి తప్పించింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించింది. ఘటన జరిగిన వెంటనే కారకులైన సిబ్బందిపై చర్యలు తీసుకున్నామని, కృష్ణ శర్మకు ఎప్పటికప్పుడు వివరాలు అందించామని సంస్థ తెలిపింది.
ఇండిగో యాజమాన్యం తీసుకున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కృష్ణ శర్మ.. ఘటన గురించిన వివరాలను చెప్పేందుకు నిరాకరించారు. అయితే, సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ఆమె లగేజీని ఇండిగో సిబ్బంది పదే పదే తనిఖీలు చేశారు.
దీన్నంతటినీ ఆమె తన ఫోన్లో ఫొటోలు తీశారు. దీంతో తనిఖీలు అయిపోయాక ఆ ఫొటోలు డిలీట్ చేయాలని ఆమెను ఓ ఉద్యోగి హెచ్చరించారు. దీంతో ఆమె ఫొటోలను డిలీట్ చేసేశారు.
అయినా సరే.. సిబ్బంది ఆమె చేతిలోని ఫోన్‌ను లాక్కుని డిలీట్ చేశారా? లేదా? అని తరచి చూశారని, ఇతర ఫొటోలను కూడా డిలీట్ చేసేందుకు ప్రయత్నించారనేది కృష్ణశర్మ కథనం. దీనికి సంబంధించిన ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com