హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చంద్రబాబు లేఖ
- January 03, 2018
ఉమ్మడి హైకోర్టు విభజన దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అమరావతిలో న్యాయస్థానం ఏర్పాటు చేయాలని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి లేఖ రాసారు. అందుకు అవసరమైన భవనాలు సమకూరుస్తామని చంద్రబాబు తెలిపారు. సీజే నుంచి కేంద్రానికి నివేదిక వెళ్లగానే రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే అమరావతికి హైకోర్టు తరలిరానుంది.
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లో ఉన్న హైకోర్టు రెండు రాష్ట్రాల ఉమ్మడి న్యాయస్థానంగా పనిచేస్తోంది. విభజన జరిగి నాలుగేళ్లు కావస్తుండటంతో హైకోర్టును కూడా విభజించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. నవ్యాంధ్రలో భవనాల కొరత కారణంగా ఆలస్యం జరుగుతూ వచ్చింది. హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన భవనాలను సిద్దం చేస్తున్నట్లు జస్టిస్ రమేష్ రంగనాధన్కు రాసిన లేఖలో సీఎం తెలిపారు. విజయవాడ, అమరావతి పరిధిలో మూడు భవనాలు చూసినట్లు సమాచారం. వాటి పరిశీలనకు న్యాయమూర్తుల కమిటీ వేయాలని కోరారు. భనవాల పరిశీలనకు పది రోజుల్లో రావాలని సీఎం కోరారు. మార్పులు చేర్పులు సూచిస్తే నెలరోజుల్లో పూర్తిచేసి సిద్దం చేస్తామని సీజేకు రాసిన లేఖలో చంద్రబాబు తెలిపారు. జూన్ రెండు నాటికి అమరావతికి హైకోర్టు తరలివచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నవ్యాంధ్రలో భవనాల ఎంపిక పూర్తయితే కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. వాటిపై కేంద్ర న్యాయశాఖ చర్చించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచనలు తీసుకోనుంది. ఆ తర్వాత ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్రపతికి నివేదిక ఇవ్వాలి. ఆయన అంగీకారం తెలిపి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తే హైకోర్టు ఏర్పడినట్లు అవుతుంది. ఈ ప్రక్రియను త్వరగా ముగించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. హైకోర్టు విభజనతో అమరావతికి తరలివచ్చే న్యాయమూర్తులు, ఇతర సిబ్బందికి వసతి సౌకర్యాల కల్పనపైనా దృష్టి పెట్టింది. సీఆర్డీఏ అధికారులకు సైతం ఆదేశాలు వెళ్లాయి.
ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తులను ఏపీ, తెలంగాణకు విభజించింది కేంద్రం. అమరావతిలో హైకోర్టు ఏర్పాటయితే ఏపీకి సంబంధించి అన్ని కార్యాలయాలు హైదరాబాద్ నుంచి తరలివచ్చినట్లవుతుంది. హైదరాబాద్లోని ప్రస్తుత హైకోర్టు తెలంగాణకు చెందుతుంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







